కర్రతో కళాత్మక వస్తువులు

22 Nov, 2019 09:02 IST|Sakshi
కళారూపాలను తయారు చేస్తున్న కుల్దీప్‌

కళాత్మక దృష్టి ఉంటే ప్రతీది కళాఖండమే అవుతుందని నిరూపిస్తున్నాడు ఆ యువకుడు. ఎందుకు పనికిరాని కర్ర, చెట్లవేర్లు, వెదురుతో రకరకాల ఆకృతుల్లో కళాఖండాలను తయారు చేసి అబ్బురపరుస్తున్నాడు. చూడముచ్చటైన కళారూపాలతో ఆకట్టుకుంటున్నాడు. కర్రతో పిచ్చుక రూపాలు, గూళ్లు, గృహ అలంకరణ వస్తువులను కళాత్మకంగా తయారు చేసి అబ్బురపరుస్తున్నాడు  బెల్లంపల్లికి చెందిన దుర్గం కుల్దీప్‌.              

అటవీశాఖ ప్రోత్సహంతో...
కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడికి చెందిన దుర్గం కుల్దీప్‌ 20ఏళ్ల క్రితం కర్రతో కళాత్మక వస్తువుల తయారీని నేర్చుకున్నాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ‘వినుకాలే’ అనే గురువు వద్ద మూడేళ్ళ పాటు శిక్షణ పొందాడు. ఇంటర్మీడియెట్‌ వరకు విద్యాభ్యాసం చేసిన కుల్దీప్‌ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఉన్నత చదువులకు వెళ్లలేకపోయాడు. నచ్చిన కళను ఎంచుకుని రాణిస్తున్నాడు. అతడి కర్ర కళానైపుణ్యతను గమనించిన బెల్లంపల్లికి చెందిన అటవీశాఖ అధికారులు 16ఏళ్ల క్రితం బెల్లంపల్లికి రప్పించారు. నివసించడానికి ప్రత్యేకంగా గూడు కల్పించి కర్రతో చెక్కిన శిల్పాలు, ఇతర కళారూపాలను తయారు చేయిస్తూ ప్రోత్సహిస్తున్నారు. 

కర్రకు అద్భుత రూపాలు...
అటవీ ప్రాంతంలో పనికిరాని, పడేసిన చెట్ల మొదళ్లు, చెట్లవేర్లు, వింతఆకృతుల్లోని కర్ర, వెదురుతో అనేక రకాల అద్భుతాలను  చెక్కుతున్నాడు. అతడి చేతిలోపడిన  ఎలాంటి కర్ర అయినా కళాత్మకంగానే తయారవుతుంది. ఇళ్లలో గృహ అలంకరణకు ఉపయోగపడే ఎన్నోరకాల వస్తువులు కర్రతో రూపొందించి మదిని దోస్తున్నాడు. చెట్టుపై వాలిన పిచ్చుకలు, పిచ్చుక గూళ్లు, నాగలితో పొలం దున్నుతున్న రైతు, టీ ట్రేలు, హెయిర్‌ క్లిప్పింగ్స్, సబ్బు పెట్టెలు, కూరగాయల బకెట్స్‌ , ప్రేమికుల బొమ్మలు, షోకేజ్‌ ఐటమ్స్‌ ఇలా రకరకాలతో అద్భుతంగా  తయారు చేసి కర్రకు రంగులద్దుతున్నాడు. 

వినియోగించే కర్ర... 
కర్రతో శిల్పాలు చెక్కడానికి కళాత్మక వస్తువులు, కళాఖండాలను తయారు చేయడానికి కుల్దీప్‌ ప్రధానంగా ప్రత్యేకత కలిగిన కర్రను వినియోగిస్తాడు. మంచి రంగుకు వచ్చిన ముదురు టేకు, తెల్లటేకు, పునికి కర్ర, వెదురుతో మాత్రమే కళారూపాలు తయారు చేస్తాడు. మొత్తంగా టేకు, వెదు రు  కర్రను అటవీశాఖ నుంచి కొనుగోలు చేస్తాడు. కర్ర కోసం జన్నారం, ఆసిఫా బా ద్, తిర్యాణి తదితర దట్టమైన అటవీ ప్రాం తాలకు వెళ్లి ఆకృతుల్లో కనిపించిన కర్రను సేకరిస్తాడు. ఆ కర్రతోనే కళారూపాలు త యారు చేసి జీవనోపాధి పొందుతున్నాడు. 

ఎగ్జిబిషన్లలో ప్రదర్శన....
ఏటా ఆయా నగరాల్లో పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్లు నిర్వహిస్తుంటారు. ఆ ఎగ్జిబిషన్లలో అటవీశాఖ తరపున కుల్దీప్‌ వెదురు, కర్ర చేతి వృత్తుల కళా ఖండాలను ప్రదర్శనలో ఉంచుతున్నాడు. కొన్నేళ్ల నుంచి హైదరాబాద్, కేరళ, ఢిల్లీ, బెంగుళూరు, త్రిపుర, మణిపూర్, అసోం తదితర ప్రాంతాలలో నిర్వహిస్తున్న  ఎగ్జిబిషన్లలో కళారూపాలు ప్రదర్శనకు అర్హత సాధిస్తున్నాయి.

నేర్చుకున్న విద్య మరోపది మందికి ...
కుల్దీప్‌ తాను నేర్చుకున్న విద్యను తన వరకే పరిమితం చేయలేదు. మరో పది మందికి నేర్పించాడు. తన వద్ద శిష్యరికం చేసిన యువకులు సొంతంగా కర్రతో కళాత్మక వస్తువులను తయారు చేసి స్వయం ఉపాధిని పొందుతున్నారు. కుటుంబాలను పోషించుకుంటున్నారు. తన వల్ల పది కుటుంబాలు జీవనోపాధి పొందుతుండటం పట్ల  కుల్దీప్‌  ఒకింత సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. 

ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందించాలి
నా వద్ద విద్య ఉంది కానీ వ్యాపారం చేసుకునే అంత ఆర్థిక స్థోమత లేదు.  నేను తయారు చేసిన కళ్మాతక వస్తువులను అమ్మి కుటుంబాన్నీ పోషించుకోవడానికే సరిపోతోంది. వ్యాపారం సాగించడానికి  తగినంత ఆర్థిక వనరులు లేవు. స్వయం ఉపాధి కోసం రుణం మంజూరు చేయాలని ఇప్పటికి మూడుసార్లు దరఖాస్తు చేసుకున్న కానీ అధికారులు మాత్రం రుణం మంజూరు చేయడం లేదు. ఇప్పటికైనా మాలాంటి వారిని ఆర్థికంగా ఆదుకోవాలి.            
– దుర్గం కుల్దీప్, బెల్లంపల్లి  

>
మరిన్ని వార్తలు