మాకో వైన్స్‌ కావాలి..! 

18 Sep, 2019 11:55 IST|Sakshi

జత కడుతున్న వ్యాపారులు 

12 రోజుల్లో ముగియనున్న లైసెన్స్‌ గడువు 

కొత్తపాలసీపై కోటి ఆశలు 

సిరిసిల్ల: మరో పన్నెండు రోజుల్లో మద్యం లైసెన్స్‌ల గడువు ముగియనుంది. ప్రభుత్వం కొత్త ఎక్సైజ్‌ పాలసీ ఏవిధంగా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొందరు వ్యాపారులు, యువకులు సైతం ఈసారి మద్యం లైసెన్స్‌లు పొందేందుకు జతకడుతున్నారు. జిల్లాలో 42 మద్యం దుకాణాలు ఉండగా.. వీటికి 2017 సెప్టెంబరులో లైసెన్స్‌ జారీచేశారు. అదే ఏడాది అక్టోబరు ఒకటే తేదీన వైన్స్‌లు తెరిచారు. 

కలిసొచ్చిన ఎన్నికలు.. 
మద్యం వ్యాపారులకు గతరెండేళ్లు కలిసి వచ్చింది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలతో పాటు, గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పార్ల మెంట్‌ ఎన్నికలు వరుసగా రావడంతో మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. జిల్లాలో 42 దుకాణాలు ఉండగా.. రెండేళ్లలో రూ.560. 50 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో 8,29,882 ఐఎంఎల్‌ బాక్స్‌లు, 17,27,113 బీర్‌ బ్యాక్స్‌లు అమ్ముడుపోయాయి. సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్‌ సర్కిళ్లు ఉన్నాయి. 

ఊరూరా కిక్కు.. 
జిల్లాలోని 42 మద్యం దుకాణాలకు అనుబంధంగా అనేక గ్రామాల్లో బెల్ట్‌ షాపులు తెరిచారు. సుమారు వెయ్యికిపైగా బెల్ట్‌షాపులు ఉన్నాయని తెలుస్తోంది. ఎల్లారెడ్డిపేటలోని ఓ వైన్స్‌లో రెండేళ్లలో రూ.23.05 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 25.1 శాతం అమ్మకాలతో టాప్‌లో నిలిచింది. ఎల్లారెడ్డిపేట, రాచర్ల గొల్లపల్లి వైన్స్‌ షాపుల్లోనూ వరుసగా రూ.18.80కోట్లు, రూ.18.77 కోట్లతో రెండు, మూడు స్థానంలో నిలిచాయి. ఇల్లంతకుంటలోని ఓ వైన్స్‌ షాప్‌లో రూ.17.54కోట్ల మద్యం విక్రయించి నాలుగో స్థానం దక్కించుకుంది. సిరిసిల్ల, తంగళ్లపల్లి, గంభీరావుపేట వైన్స్‌ షాపులు వరుసగా పదో స్థానం వరకు ఉన్నాయి. వేములవాడలో ఓ వైన్స్‌ షాపు రూ.14.50 కోట్ల మద్యం విక్రయించి 11వ స్థానంలో ఉండగా రెండేళ్లలో రూ.10 కోట్లలోపు మద్యం విక్రయించి వేములవాడలోని ఓ మూడు వైన్స్‌ షాపులు చివరిస్థానంలో నిలిచాయి.
 
కొత్త పాలసీపై కోటి ఆశలు 
వచ్చే అక్టోబర్‌ ఒకటి నుంచి కొత్త ఎక్సైజ్‌ పాలసీ అమల్లోకి రానుంది. దరఖాస్తు ఫీజు, ఈఎండీలో ఏమైనా మార్పులు ఉంటాయా అనే ఉత్కంఠ లిక్కర్‌ వ్యాపారుల్లో నెలకొంది. ఇప్పటికే మద్యం వ్యాపారులు సన్నిహితులతో జతకడుతూ సిండికేట్‌గా మారుతున్నారు. 10 మంది జతగా ఉండి దరఖాస్తు చేసుకుని ఏ ఒక్కరికి లక్కీ డ్రాలో మద్యం షాపు వచ్చినా అందరూ పంచుకునేలా ఒప్పందాలు చేసు కుంటున్నారు. రెండేళ్ల క్రితం ఆబ్కారీ పాలసీ దరఖాస్తు ఫీజు రూ.లక్ష ఉండగా, ఈఎండీ లైసె న్స్‌ ఫీజులో 10 శాతం ఉంది. అంటే మండల కేంద్రాల్లో రూ.4.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.50లక్షలు నిర్దేశించారు. జనాభా ప్రాతిపదికన ఆబ్కారీ విధానం రూపొందించారు. గతంలో జిల్లాలోని 42 వైన్స్‌ షాపులకు 672 దర ఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.6.72 కోట్ల ఆదాయం సమకూరింది. 

లిక్కర్‌కు ‘రియల్‌’ ఎఫెక్ట్‌... 
జిల్లాలో మద్యం వ్యాపారంపై రియల్‌ ఎస్టేట్‌ భూం ప్రభావం ప్రధానంగా ఉంటుంది. సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌ ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ దందా ఎక్కువగా ఉంది. భూముల ధరలు పదింతలు అవడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు భారీ ఎత్తున లిక్కర్‌ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం గా ఉన్నారు. కొత్త ఎక్సైజ్‌ పాలసీ రాగానే రూ. కోట్లు కుమ్మరించేందుకు సిద్ధమవుతున్నారు. రెండు, మూడు రోజుల్లో కొత్త ఆబ్కారీ విధానానికి నోటిఫికేషన్‌ వెలువడుతుందని ఎక్సైజ్‌ అధికారులు పేర్కొంటున్నారు. ఈసారి అన్ని వైన్స్‌ లకు భారీగా పోటీ ఉంటుందని భావిస్తున్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా