సజావుగా సాగాలి 

5 Mar, 2020 02:26 IST|Sakshi

దేశానికే ఆదర్శంగా ఉండే ప్రజా సమస్యలపై చర్చ 

సభ్యులకు ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు 

ప్రత్యేక వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా అధికారుల సమన్వయం 

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలపై చైర్మన్, స్పీకర్‌ సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రయోజనాలు, ప్రగతికి దోహదం చేసే చర్చలను ప్రజలు నిశితంగా గమనిస్తారనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని శాసనసభ సమావేశాలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వి.నరసింహాచార్యులుతో కలిసి బుధవారం శాసనసభ ఆవరణలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ శాసనసభ పనితీరు దేశానికే ఆదర్శంగా ఉండేలా చూడాలని, సభ్యులు అధికారుల మధ్య సమన్వయ లోపం లేకుండా చూడాలని పోచారం ఆదేశించారు. గతంలో మాదిరిగానే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమావేశాలు నిర్వహిస్తామని గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు.

శాసనసభ నుంచి శాసనమండలిలోకి వచ్చే మంత్రులకు ట్రాఫిక్‌ సమస్య ఎదురవకుండా చూడాలని, ఉభయ సభల్లో చర్చకు వచ్చే అంశాలకు సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల నివాస సముదాయాల నుంచి వచ్చే సభ్యులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవకుండా చూడాలని తెలిపారు. శాసనమండలి చీఫ్‌ విప్, విప్‌లు, ఎమ్మెల్సీల విషయంలో జిల్లా స్థాయిలో అధికారులు ప్రోటోకాల్‌ పాటించడం లేదని గుత్తా వ్యాఖ్యానించారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా సభ జరిగేందుకు అధికారులు సర్వసన్నద్ధులుగా ఉండాలని వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. భద్రత పరంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ కార్యదర్శులు వాట్సాప్‌ ద్వారా సమావేశాల తీరును ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. 

పోలీసు అధికారులతో ప్రత్యేక భేటీ.. 
శాసనసభ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో పోలీసు అధికారులతో గుత్తా సుఖేందర్‌రెడ్డి, పోచారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భద్రత ఏర్పాట్లను సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, డీజీపీ (ఎస్‌పీఎఫ్‌) తేజ్‌ దీప్‌ కౌర్, హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్, రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్, అసెంబ్లీ చీఫ్‌ మార్షల్‌ టి.కరుణాకర్‌ పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, చీఫ్‌ విప్‌లు దాస్యం వినయభాస్కర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, టీఆర్‌ఎల్‌పీ ఇన్‌చార్జి రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం శాసనసభ ఆవరణలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆఫీసర్స్‌ లాంజ్‌ను స్పీకర్, మండలి చైర్మన్‌ సంయుక్తంగా ప్రారంభించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా