చార్మినార్‌ మరమ్మతులకు ఆలయ స్థపతులు

8 Jun, 2019 02:48 IST|Sakshi

తమిళనాడు బృందానికి బాధ్యతల అప్పగింత 

రెండు మూడు రోజుల్లో మొదలుకానున్న పనులు 

భారీ వర్షానికి పెచ్చులూడిన చోట పునర్నిర్మాణం 

సంప్రదాయ డంగు సున్నం మిశ్రమంతో పాతరూపు

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగం (ఏఎస్‌ఐ) అధీనంలో ఉన్న చార్మినార్‌ కట్టడానికి దేవాలయాల స్థపతులు మరమ్మతులు చేయబోతున్నారు. గత నెల రెండో తేదీ అర్ధరాత్రి వేళ ఈ చారిత్రక కట్టడానికి మక్కా మసీదు వైపు ఉన్న మినార్‌ డిజైన్‌ లోంచి ఓ భాగం ఊడి కింద పడిపోయిన విషయం తెలిసిందే. దాదాపు మూడు మీటర్ల మేర ఈ భారీ పెచ్చు ఉన్నట్టుండి ఊడి కింద పడింది. అంతకుముందు కురిసిన భారీ వర్షానికి ఆ ప్రాంతంలోని సన్నటి పగుళ్ల నుంచి నీటిని భారీగా పీల్చుకోవటంతో అక్కడి డంగు సున్నంతో రూపొందించిన నగిషీల భాగం బాగా బరువెక్కి ఊడిపోయినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పుడు ఆ పెచ్చు ఊడిపోయిన చోట మళ్లీ సంప్రదాయరీతిలో డంగు సున్నం మిశ్రమంతో తిరిగి నగిషీలు అద్దాల్సి ఉంది. కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగం నిపుణులే దాన్ని పూర్తి చేస్తారని అనుకున్నా, ఆ విభాగం తాజాగా ఆ పనిని దేవాలయాల స్థపతులకు అప్పగించింది. తమిళనాడుకు చెందిన ఆ స్థపతుల బృందం ఆది, సోమవారాల్లో నగరానికి రానుంది.

ఆ వెంటనే పనులు మొదలుపెడతారు. గతంలో ఈ స్థపతులకు ఇలాంటి పనులు చేసిన అనుభవం ఉండటంతో వారికే అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. ఏడెనిమిదేళ్ల క్రితం చార్మినార్‌కు చిన్నచిన్న డిజైన్లు ఊడిపోవటంతో వీరితోనే చేయించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రిలో పురాతన దేవాలయాల పునరుద్ధరణలో కూడా వీరు డంగు సున్నంతో పనులు చేశారు. చార్మినార్‌కు కూడా ఇప్పుడు సూక్ష నగిషీలు అద్దాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వారైతేనే సరిగ్గా చేయగలరని నిర్ణయించి పనులు అప్పగించారు. మరో పది రోజుల్లో వానలు కురిసే అవకాశం ఉన్నందున ఈలోపే పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. డంగు సున్నం, నల్లబెల్లం, కరక్కాయ పొడి, రాతి పొడి, గుడ్డు సొనలతో కూడిన మిశ్రమాన్ని ఈ పనుల్లో వినియోగించనున్నారు. కట్టడంలోని చాలా భాగాల్లో చిన్నచిన్న పగుళ్లు ఏర్పడ్డాయి. భారీ పెచ్చు ఊడిన ప్రాంతంలో కూడా మరికొన్ని పగుళ్లున్నట్టు అధికారులు గుర్తించారు. వాటిని కూడా ఇప్పుడు పూడ్చేయనున్నారు. లేకుంటే మరిన్ని పెచ్చులు ఊడిపడే ప్రమాదం ఉంది. 

త్వరలో ఢిల్లీ నుంచి అధికారులు 
చార్మినార్‌ పెచ్చు ఊడి పడడానికి కారణమైన పగుళ్లు ఎందుకు ఏర్పడ్డాయనే విషయంలో మరింత లోతుగా పరిశీలించేందుకు ఢిల్లీ నుంచి ఏఎస్‌ఐ ఉన్నతాధికారులు త్వరలో నిపుణులతో కలిసి రానున్నారు. పెచ్చు ఊడిపడిన వెంటనే కొందరు నిపుణులు వచ్చి పరిశీలించి వెళ్లారు. వారి నుంచి ఇంకా నివేదిక రాలేదు. కట్టడం చుట్టూ ఏర్పడ్డ వైబ్రేషన్ల వల్లే పగుళ్లు ఏర్పడినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. చార్మినార్‌ చుట్టూ దశాబ్దాలుగా వాహనాలు తిరుగుతుండటం, ఇటీవల పాదచారుల ప్రాజెక్టులో భాగంగా కట్టడానికి అతి చేరువగా భారీ యంత్రాలతో పనులు చేపట్టడం వల్ల ఇవి ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాతే మరమ్మతు పనులు చేపట్టాలని తొలుత భావించారు. కానీ వర్షాకాలం ముంచుకు రావడంతో వెంటనే మరమ్మతులు జరపకుంటే మరిన్ని పెచ్చులూడే ప్రమాదం ఉండటంతో వెంటనే పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఇన్‌ఫ్రారెడ్‌ థర్మోగ్రఫీ స్కానర్‌ సాయంతో కట్టడంలో ఎక్కడెక్కడ పగుళ్లున్నాయో గుర్తించనున్నారు.

మరిన్ని వార్తలు