హోటల్‌ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి

24 Jul, 2018 13:34 IST|Sakshi
వీపుపై కొట్టాడని చూపిస్తున్న బాధితుడు 

మంచిర్యాలటౌన్‌ : మంచిర్యాల పట్టణంలోని హైటెక్‌సిటీ కాలనీ సమీపంలో ఉన్న టేబుల్‌ 7 రెస్టారెంట్‌లో యాజమాన్యం కుకింగ్‌ మాస్టర్లు, వెయిటర్లను ఆదివారం రాత్రి గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేసింది. టేబుల్‌ 7 హోటల్‌ యాజమాన్యం ఒడిశాకు చెందిన 13 మంది సిబ్బందిని నెలన్నర క్రితం పనిలో పెట్టుకుంది.

తాము చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆదివారం జీతాలు ఇవ్వాలని సిబ్బంది యాజమాన్యాన్ని కోరారు. అయితే యాజమాన్యం మాత్రం ఒప్పం దం ప్రకారంగా కాకుండా, తక్కువగా వేతనాలు చెల్లించింది. తమ వేతనాల గురించి మాట్లాడి, పని నచ్చక స్వంత ఊరికి వెళ్లేందుకు సిబ్బంది రైల్వే స్టేషన్‌కు వెళ్లారు.

విషయం తెలుసుకున్న యాజమాన్యం సిబ్బందికి ఫోను చేసి, వెంటనే హోటల్‌కు తిరిగి రావాలని వారు కోరిన జీతాలు ఇస్తామని నమ్మబలికారు. దీంతో హోటల్‌కు తిరిగి వచ్చిన 13 మంది సిబ్బందిని యాజమాన్యం గదుల్లో బంధించి, తాము చెప్పినట్లు వినాలని బెదిరిస్తూ వారిపై ఇనుపరాడ్లతో తీవ్రంగా గాయపర్చారు.

సిబ్బంది పెడుతున్న అరుపులకు పక్కనే ఉన్నవారు వెంటనే 100 నంబరుకు ఫోన్‌ చేశారు. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకుని, గాయాలపాలైన సిబ్బందిని విడిపించారు. వారిని ప్రత్యేక వాహనం ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

బాధితుడు రాజేందర్‌ ముఖితో పాటు గాయపడిన వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హోటల్‌ యాజమాన్యం సభ్యులు రాజు, బబ్లూతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు