విలేకరులపై దాడి

14 May, 2018 01:59 IST|Sakshi

సిద్దిపేట జోన్‌: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. ‘మాకే వ్యతిరేకంగా వార్తలు రాస్తారా?’అంటూ ఆదివారం రాత్రి జనగామ జిల్లా మద్దూ రు మండలంలోని వంగపల్లిలో దుర్గామాత ఉత్సవాల కవరేజీకి వచ్చిన సాక్షి విలేకరి సమ్మ య్య, ఈనాడు విలేకరి దర్శన్, నవ తెలంగాణ విలేకరి మహేందర్‌పై దాడికి తెగబడ్డారు. తీవ్ర గాయాలు అయ్యేలా కొట్టారు.

ఎమ్మెల్యే ముత్తి రెడ్డి అనుచరులు బద్దిపడగ కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మల్లిపెద్ది మల్లేశం, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ మేక సంతోష్‌తోపాటు మరో ఇద్దరు ఈ దాడిలో పాల్గొ న్నారు. విలేకరులపై దాడిని అడ్డు కున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కూడా ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగారు. ఈ దాడిలో మద్దూరు మండల టీఆర్‌ఎస్‌ మాజీ మండలాధ్యక్షుడు బోయిన శ్రీనివాస్‌ తీవ్రంగా గాయపడ్డారు.

విలేకరులను అసభ్య పదజాలంతో దూషించారు. ‘మీ ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తారా, మేము ఎమ్మెల్యే మనుషులం, మేం చెప్పినట్టు వార్తలు రాయకపోతే ఇక్కడ ఎవరూ మిగలరు’అంటూ వీరంగం సృష్టించారు. విష యం తెలుసుకున్న స్థానికులు, గ్రామస్తులు ఎమ్మెల్యే అనుచరుల తీరును నిరసిస్తూ పోలీస్‌స్టేషన్‌ ముందు ఆందోళన చేశా రు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని విలేకరులు, నాయకులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రఘు తెలిపారు.

మరిన్ని వార్తలు