దాడులు..ప్రతిదాడులు

8 Dec, 2018 09:09 IST|Sakshi
ఇసాక్‌ ముబీన్‌ స్వతంత్య్ర అభ్యర్థి వశీం ఖాజా నూరుద్దీన్‌ అహ్మద్‌ గాయపడిన టీడీపీ కార్యకర్త

హబీబ్‌నగర్‌లో ఘర్షణ

నాంపల్లి: ఎన్నికల సందర్భంగా నాంపల్లి నియోజకవర్గంలోని మల్లేపల్లి డివిజన్‌లో ఘర్షణ చోటు చేసుకుంది. ఎంఐఎం కార్యకర్తలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. రియాన్‌ హోటల్‌ ప్రాంతంలో రాళ్లతో పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఇసాక్‌ షేక్‌ ముబీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మల్లేపల్లి భారత్‌ గ్రౌండ్స్‌లో జరిగిన ఘటనలో స్వతంత్య్ర అభ్యర్థి వశీం గాయపడ్డాడు. హబీబ్‌నగర్‌లో ఎంఐఎం, కాంగ్రెస్‌ కార్యకర్తల రాళ్లదాడి జరగడంతో ఖాజా నూరుద్దీన్‌ అహ్మద్, మహ్మద్‌ ఇర్ఫాన్‌ అనే వ్యక్తులు గాయపడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం నాంపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు హబీబ్‌నగర్‌ పోలీసులు కేసు నమోదుచేశారు.

టీఆర్‌ఎస్, టీడీపీ నాయకుల ఘర్షణ
ఆల్విన్‌కాలనీ: టీడీపీ, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఆల్విన్‌ కాలనీ పైపులైన్‌ రోడ్డులోని మాంటిస్సోరి స్కూల్‌ బూత్‌లో ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తులతో టీడీపీ నాయకులు దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో టీఆర్‌ఎస్‌ నాయకులు వారితో ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్త నాగేశ్వరరావుకు గాయాలయ్యాయి.ఇరు వర్గాల నాయకులు పరస్పరం కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. 

లంగర్‌హౌస్‌లో ఉద్రిక్తత
లంగర్‌హౌస్‌: కార్వాన్‌ నియోజక వర్గం, లంగర్‌హౌస్‌లో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీ అభ్యర్థులు, కార్యకర్తల మధ్య జరిగిన గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. బూత్‌ నెంబర్‌ 134లో పోలింగ్‌ సిబ్బంది ఎంఐఎంకు మద్దతు పలుకుతూ స్వయంగా రిగ్గింగ్‌ చేయిస్తున్నారని కాంగ్రెస్‌ అభ్యర్థి ఆరోపించారు. ఓటరు ధృవీకరణ కార్డులు చూడకుండానే ఓటింగ్‌కు అనుమతిస్తుండటంతో ఉదయం బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఉస్మాన్‌ బిన్‌ హాజ్రి మాట్లాడుతూ లంగర్‌హౌస్‌ కేంద్రీయ విద్యాలయ పాఠశాలలో 134 బూత్‌లో స్వల్పంగా ఓటింగ్‌ నమోదయ్యిందని, దీంతో ఎంఐఎం నాయకులు, బూత్‌లో విధులు నిర్వహిస్తున్న సోహైల్‌తో పాటు మరో ఇద్దరు కలిసి ఎంఐఎంకు అనుకూలంగా వ్యవహరిస్తూ రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు.134 బూత్‌ పరిధిలోని వెయ్యి ఓటరు స్లిప్పులను అధికారుల టేబుళ్లపై పెట్టుకున్నారన్నారు. ఈ విష యమై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్న ట్లు తెలిపారు. ఎంఐఎం అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కౌసర్‌ మొహినుద్దీన్‌ తన అనుచరులతో అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

మజ్లీస్, ఎంబీటీ కార్యకర్తల మధ్య ఘర్షణ...
యాకుత్‌పురా: యాకుత్‌పురా నియోజకవర్గంలోని బడాబజార్‌ యూనిక్‌ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద మజ్లీస్‌ నేతలు రిగ్గింగ్‌ చేస్తున్నారని ఆరోపిస్తూ ఎంబీటీ నాయకులు ఘర్షణకు దిగారు. మజ్లీస్‌ నాయకులు పలు ప్రాంతాల్లో పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లి రిగ్గింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో ఆయా పోలింగ్‌ కేంద్రాలను సందర్శించినట్లు ఎంబీటీ అధికార ప్రతినిధి అంజదుల్లా ఖాన్‌ తెలిపారు. దీనిపై రెయిన్‌బజార్‌ ఇన్‌స్పెక్టర్‌ అంజనేయులును ఆరా తీయగా ఎలాంటి రిగ్గింగ్‌ జరగడం లేదని తెలిపారు. 

ఓటర్‌ లిస్టులోఅవకతవకలు: పాషా ఖాద్రీ.  
ఓటర్‌ లిస్టులో కొందరిపేర్లు గల్లంతు కావడంతో పోలింగ్‌ శాతం తగ్గిందని యాకుత్‌పురా మజ్లీస్‌ అభ్యర్థి సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రీ అన్నారు. తమ వద్ద ఉన్న ఓటరు లిస్టులో పేర్లు ఉన్నప్పటికీ... పోలింగ్‌ కేంద్రంలోని అధికారుల వద్ద ఉన్న జాబితాలో కనిపించడం లేదన్నారు. ఈవీఎంలు మోరాయించడంతో పలు కేంద్రాల్లో ఆలస్యంగా ప్రారంభమైందన్నారు. ఎంబీటీ నాయకులు పోలింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.

మరిన్ని వార్తలు