మనీతో అటెండెన్స్ !

5 Dec, 2015 01:28 IST|Sakshi

నకిలీ అటెండెన్స్‌తో కేఎంసీలో హాల్ టికెట్లు
విచారణకు ఆదేశించిన ప్రిన్సిపాల్

 
ఎంజీఎం : కాకతీయ మెడికల్ కళాశాలలో టెక్నికల్ విభాగం కోర్సును పలువురు ఆడుతూ పాడుతూ పూర్తి చేస్తున్నారు. కేవలం పరీక్షలకు హాజరై సర్టిఫికెట్ పొందుతున్నారు. డబ్బులతో నకిలీ అటెండెన్స్ సమర్పించి హాల్ టికెట్ తీసుకొని పరీక్షలకు హాజరవుతున్నారు. ఇది కొన్నేళ్లుగా సాగుతోంది. కాగా నాలుగు రోజుల క్రితం రేడియూలజీ విభాగంలో ఇదే తరహాలో జరగడంతో అధికారులు గుర్తించి విచారణకు ఆదేశాలు జారీచేశారు. కాకతీయ మెడికల్ కళాశాలలో డీఎంఐటీ, డీఎంఎల్‌టీ, ఈసీజీ, డీడీఆర్‌ఏ, డీసీఆర్‌ఏ వంటి పలు టెక్నికల్ కోర్సుల్లో ఎంతోమంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుంటారు. ప్రతి కోర్సును రెండు సంవత్సరాలు విద్యనుభ్యసించి పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే కోర్సులో చేరిన వారు ఉదయం 9 గంటల నుంచి 2 గంటల నుంచి ఎంజీఎంలో పనిచేస్తూ 2 గంటల నుంచి 4 గంటల వరకు కేఎంసీ కళాశాలలో తరగతులను వినాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలను ఏ మాత్రం టెక్నికల్ కోర్సును అభ్యసించే వారికి కానరావు.

ఇలాంటి వారికి ఆటెండెన్స్ ఇచ్చేందుకు కళాశాలలో ఓ టీమ్ ఏర్పడి పెద్ద దందా కొన్నేళ్లుగా కొనసాగిస్తోంది. నాలుగు రోజుల క్రితం రేడియూలజీ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ గుర్తించడంతో వెలుగులోకి వచ్చింది. ఇద్దరు విద్యార్థులు ఏనాడూ హాజరు కాకుండా ఎలా హాల్ టికెట్లు పొందారనే విషయంపై సదరు ప్రొఫెసర్ కేఎంసీ ప్రిన్సిపాల్ అబ్బగాని విద్యాసాగర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కేఎంసీ ప్రిన్సిపాల్ అసలు వారికి ఎవరు అటెండెన్స్ అందించారనే విషయంతోపాటు కొన్నేళ్లుగా సాగుతున్న ఈ దందాపై పూర్తిస్థాయి విచారణకు కమిటీ వేసినట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. అంతేకాకుండా పలు కోర్సుల్లో నకిలీ అటెండెన్స్ ఇస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు డీఎంఈ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు స్పష్టంచేశారు. ఇప్పటికైనా ఆయా విభాగాల అధిపతులు స్పందించి పలు టెక్నికల్ కోర్సుల్లో నకిలీ అటెండెన్స్ ఇస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు