టెన్షన్.. అటెన్షన్

28 Sep, 2015 01:51 IST|Sakshi

ఏజెన్సీని జల్లెడ పడుతున్న పోలీసులు
పట్టణాలకు వెళ్లాలంటూ ప్రజాప్రతినిధులకు ఆదేశాలు


వరంగల్ క్రైం: తాడ్వాయి ఎన్‌కౌంటర్‌ను ఖండిస్తూ సోమవారం మావోరుుస్టులు వరంగల్,ఖమ్మం, కరీంనగర్ జిల్లాల బంద్‌కు పిలుపునిచ్చారు. అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు, నిఘా పంచారు. ఈనెల 15వ తేదీన మెట్టుగుట్ట అడవులలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళా నక్సలైట్‌తో పాటు మరో మావోయిస్టు మృతి చెందిన విషయం తెలిసిందే. ఎన్‌కౌంటర్ తర్వా త అన్ని వర్గాల ప్రజలనుంచి పోలీసులు తీవ్ర విమర్శలు ఎదుర్కొవడంతో కూంబింగ్‌లో పట్టుబడిన మరోముగ్గురు మావోయిస్టులతో పాటు ఒక సానుబూతిపరుడిని అరెస్టు చేసి రిమాం డ్‌కు తరలించారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు అయిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్‌కౌంటర్‌పై ప్రజాసంఘాలు, విప్లవ సంఘాలు విరుచుకుపడ్డాయి. నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా అని ప్రకటించిన కేసీఆర్  బూటకపు ఎన్‌కౌంటర్ చేయించారని విమర్శించారు. మహిళా నక్సలైట్ శృతిపై అత్యాచారం చే శారని, యాసిడ్ పోసి అత్యంత దారుణంగా చం పారని ప్రజాసంఘాలు విమర్శించాయి. అయితే వీరి విమర్శలకు ప్రజల నుంచి సానుబూతి వెల్లువెత్తడంతో పోలీసులు ఇరుకునపడ్డా రు. ఎన్ కౌంటర్‌పై జిల్లా పోలీసులు ఎప్పటికప్పుడు సంజాయిషీ ఇస్తూనే వస్తున్నారు. అయినప్పటికీ పౌరహక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు ఈ ఎన్‌కౌంటర్‌తో పోలీసులను, ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని వర్గాల నుంచి ఎన్‌కౌంటర్‌పై సానుభూతి వస్తున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ సోమవారం బంద్‌కు పిలుపునిచ్చింది.

 అన్ని వర్గాల ప్రజలు బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చింది. మరో పక్క బంద్‌ను విఫలం చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బంద్ నేపథ్యంలో మావోయిస్టు కదలికలపై నిఘా పెంచారు. ఏజెన్సీ ఏరియా జల్లెడ పడుతున్నారు. ప్రజాప్రతినిధులు ఇప్పటికే హైదరాబాద్‌కు వెళ్లాలని హెచ్చరికలు జారీచేశారు. పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో ఏజెన్సీ ఏరియాతో పాటు మైదాన ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా రాజదాని బాట పట్టారు. ఎన్‌కౌంటర్ ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నప్పటికీ తీవ్ర వ్యతిరేకత నేపధ్యంలో పోలీసులు కొంత వెనుకడుగు వేస్తున్నారు. సోమవారం నాటి బంద్‌పై పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. పోలీసుల డేగ కళ్ల పహారా నడుమ బంద్‌ను విజయవంతం చేసేందుకు మావోలు పావులు కదుపుతున్నారు.
 

మరిన్ని వార్తలు