వేలం వెర్రి..!

11 Feb, 2020 02:01 IST|Sakshi
శెట్‌పల్లి సహకారం సంఘం 

సహకార సంఘాల ఎన్నికల్లో కొనసాగిన వేలం పాటలు

రూ. లక్షలు పలుకుతున్న సొసైటీ చైర్మన్, డైరెక్టర్‌ స్థానాలు

కీలకంగా వ్యవహరిస్తున్న గ్రామాభివృద్ధి కమిటీలు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ షెట్‌పల్లి సహకార సంఘం డైరెక్టర్, చైర్మన్‌ పదవులకు నిర్వహించిన వేలం పాటలో రూ.25 లక్షల వరకు ధర పలికింది. ఏర్గట్ల సొసైటీ రూ.15 లక్షలకు వేలం పాడారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు జిల్లాలో అనేక సొసైటీల పదవులకు వేలం పాటలు జరిగాయి. ఆర్మూర్‌ మండలం పిప్రి సొసైటీకి నిర్వహించిన వేలంలో రూ.77 లక్షల విలువైన పనులు చేçస్తామనే ఒప్పందంతో ఏకగ్రీవం చేశారు.  సహకార సంఘాల ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా నిజామాబాద్‌ జిల్లాలో డైరెక్టర్, చైర్మన్‌ స్థానాలను వేలం పాటల ద్వారా దక్కించుకున్నారు. జిల్లాలో 89 సహకార సంఘాలు, వీటి పరిధిలో 1,157 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు గడువు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగియగా, రాష్ట్రంలోనే అత్యధికంగా 26 సహకార సంఘాలు, 736 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.

ఇందులో కొన్ని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని ఏకగ్రీవం చేసిన స్థానాలు ఉండగా, ఎక్కువ భాగం వేలం పాటల ద్వారానే రూ.లక్షలు వెచ్చించి దక్కించుకున్నవే ఉండటం గమనార్హం. అయితే,, ఈ విషయమై గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)లు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పాలనకు దీటుగా సమాంతర పాలన కొనసాగిస్తాయి. ఎవరైనా వీడీసీల కట్టుబాట్లను ధిక్కరిస్తే పెద్ద మొత్తంలో జరిమానాలు, బహిష్కరణకు గురి కావాల్సి వస్తుంది. గ్రామాభివృద్ధికి నిధుల సమీకరణ పేరుతో సహకార సంఘాలకు వేలం పాటలు నిర్వహిస్తున్నారు. వేలంలో అత్యధిక ధర పలికి పదవిని కొనుక్కున్న వారు నిర్ణయించిన తేదీలోగా డబ్బులు కమిటీకి జమ చేయాల్సి ఉంటుంది.

ఆధారాల్లేక చర్యలు తీసుకోలేకపోతున్నాం
సహకార ఎన్నికల్లో వేలం పాటలు నిర్వహించకూడదనే జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం ఆదేశాలను వీడీసీలు ఖాతరు చేయలేదు. డైరెక్టర్, సొసైటీల చైర్మన్‌ స్థానాలకు యథేచ్ఛగా వేలం పాటలు నిర్వహించాయి. సరైన ఆధారం లేకపోవడంతోనే చర్యలు తీసుకోలేకపోయామని జిల్లా సహకారశాఖాధికారి సింహాచలం ‘సాక్షి’ప్రతినిధితో పేర్కొన్నారు. ఎక్కడైనా ఫిర్యాదు వస్తే పోలీసులతో విచారణ చేపడతామని చెప్పుకొచ్చారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా