‘మెప్మా’లో తనిఖీలు

5 Feb, 2015 05:14 IST|Sakshi

ఖమ్మంసిటీ: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో బినామీ రుణాల బాగోతం వ్యవహారం రాష్ట్రస్థాయిలోనే ఓ కుదుపు కుదిపింది. మెప్మా సిబ్బంది, బ్యాంకు అధికారులు కలిసి చేసిన నిర్వాకం ఆ సంస్థకే మాయని మచ్చగా మిగిలింది. మెప్మాలో జరిగిన అవినీతిలో తెరవెనుక ఉన్న బాస్‌పై గత మూడు రోజులుగా ఇంటెలిజెన్స్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి కమ్యూనిటీ ఆర్గనైజర్, రీసోర్స్ పర్సన్‌లు బినామీ గ్రూపులతో రుణాల మంజూరు చేసిన అగ్రిమెంట్లను పరిశీలించారు.

ఒక గ్రూపునకు రుణాలు ఇవ్వాలంటే ఎవరెవరి సంతకాలు చేయాల్సి ఉంటుందో.. వాటి వివరాలను పీడీ వేణుమనోహర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆ అగ్రిమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. గతంలోనే వీరిపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని పీడీని ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నించారు. సంవత్సరం క్రితమే ఇలాంటి బినామీ గ్రూపుల వ్యవహారం బయటకు వచ్చినప్పటికీ నగరంలోని బ్యాంకు మేనేజర్‌తో సమావేశం ఏర్పాటు చేసి ఆయా బ్యాంకులలోని గ్రూపుల వివరాలను, రుణం చెల్లించని గ్రూపుల వివరాలను ఎందుకు సేకరించలేకపోయారని అడిగారు.

బ్యాంకు ఓ గ్రూపునకు రుణం మంజూరు చేసిన తర్వాత ప్రతినెలా మెప్మాకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని, అయితే సంవత్సరాలు గడిచినా సమాచారం రాకపోవడం వెనుక కారణమేంటని ఆరా తీశారు. రుణాల మంజూరులో అవకతవకలు జరగకుండా గ్రూపులు అన్నింటినీ రెండు సంవత్సరాల క్రితమే ఆన్‌లైన్ చేసినప్పటికీ  ఈ గ్రూపులు ఆన్‌లైన్‌లో ఎందుకు రాలేదని కూడా పీడీని అడిగి తెలుసుకున్నారు. కొన్ని పత్రాలను వారితోపాటు తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ సైతం దీనిపై నివేదిక కోరినట్లు సమాచారం.
 
తెరవెనుక బాస్‌పై ఆరా..
మెప్మాలోని తెరవెనుక బాస్‌కు సంబంధించి ఆస్తులు, ఉద్యోగంలో చేరిననాటినుంచి ఇప్పటి వరకు ఏమైనా రిమార్కులు ఉన్నాయా..? అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. గతంలో ‘సాక్షి’లో వచ్చిన షాడో కమిషనర్ అనే వార్తపై కూడా ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. మెప్మా కార్యాలయంలో ఆ ఉద్యోగి బాసిజాన్ని గురించి సైతం ఆరా తీస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు