ఆగస్టు 10న మోటార్ల డ్రైరన్‌

24 Jul, 2018 02:15 IST|Sakshi

వేగం పుంజుకున్న కన్నెపల్లి పంప్‌హౌస్‌ పనులు

మూడు మోటార్ల బిగింపునకు సన్నాహాలు

కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో నిర్మి స్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో కన్నెపల్లి (మేడిగడ్డ) పంప్‌హౌస్‌ మోటార్లకు డ్రైరన్‌ (బిగించిన మోటార్ల పనితీరు పరిశీలన) ఆగస్టు 10న నిర్వహించనున్నా రు. దీనిని పరిశీలించేందుకు మంత్రి హరీశ్‌రావు వస్తారని సమాచారం.

ఆగస్టు చివరికల్లా స్టార్టర్లు, రోటార్లు బిగించి మోటార్ల ద్వారా నీటిని తరలించనున్నారు. రూ.2,826 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనుల్లో మొత్తం 11 శక్తివంతమైన మోటార్లను బిగించనున్నా రు. వాటిద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని గ్రావిటీ కాల్వ ద్వారా 13.2 కి.మీ. దూరంలోని అన్నారం బ్యా రేజీ వరకు, అక్కడి నుంచి ఎల్లంపల్లికి తరలిస్తారు.  

వేగవంతంగా మోటార్ల బిగింపు
ప్రస్తుతం కన్నెపల్లి పంప్‌హౌస్‌లో మోటార్ల బిగింపు ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఈ నెలలో 10 రోజుల పాటు వర్షాల కారణంగా పనులు నిలిచిపోవడంతో మోటార్ల బిగింపు ఆలస్యమైంది. ఇప్పటికే ఫిన్‌లాండ్, ఆస్ట్రియా దేశాల నుంచి స్టార్టర్, రోటార్లు పంప్‌హౌస్‌కు చేరుకున్నాయి. ఒక్కో మోటారుకు 40 మెగావాట్ల విద్యుత్‌ అవసరం. ఆగస్టు 10 వరకు రెండు లేదా 3 మోటార్లను బిగించి డ్రైరన్‌ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

పంప్‌హౌస్‌లో డ్రాప్ట్‌ట్యూబ్, సైప్రల్‌ కేసింగ్‌ ఎరక్షన్‌ పూర్తయిందని, ఇంపెల్లర్, షాఫ్ట్‌ బిగింపు పనులు జరుగుతున్నాయని ఇంజనీర్లు తెలిపారు. స్టార్టర్లు, రోటార్లు బిగిస్తే మొదటి మోటార్‌ బిగింపు ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు.  కన్నెపల్లిలో రూ.220 కోట్ల వ్యయంతో 220/11కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. త్వరలో సబ్‌స్టేషన్‌ ఎరక్షన్‌ పూర్తి అవుతుందని ఇంజనీర్లు తెలిపారు.

మరిన్ని వార్తలు