అధికారులకు ‘క్రమబద్ధీకరణ’ పరేషాన్

9 Feb, 2015 07:36 IST|Sakshi
  • స్థలాల క్రమబద్ధీకరణలో చెక్‌మెమోతో తంటాలు
  • సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియలో చెక్‌మెమో వ్యవహారం రెవెన్యూ అధికారులను పరేషాన్‌కి గురిచేస్తోంది. ఉచిత, చెల్లింపు కేటగిరీల కింద వచ్చిన సుమారు మూడున్నర లక్షల దరఖాస్తుల పరిశీలనలో చెక్‌మెమోను తప్పనిసరిగా పాటించాలని భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ తాజాగా ఆదేశాలు జారీచేశారు.

    చెక్‌మెమోలోని 32 అంశాలను విచారణాధికారి, మండల తహశీ ల్దారు స్వయంగా పరిశీలించి ధ్రువీకరించాలని అం దులో పేర్కొన్నారు. అలాగే.. ఏవైనా తప్పిదాలు జరి గితే సంబంధిత మండల తహశీల్దార్లను బాధ్యులుగా పరిగణిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఓవైపు సిబ్బంది కొరత, మరోవైపు అధికమైన పనిభారంతో తహశీల్దార్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  
     
    రోజుకు పది దరఖాస్తులు గగనమే..


    క్రమబద్ధీకరణ దరఖాస్తుల్లో దరఖాస్తుదారు పేర్కొన్న స్థలం వివరాలను క్షేత్రస్థాయిలో విచారణాధికారితో పాటు తహశీల్దారు కూడా పరిశీలించాలి. దీంతో పాటు దరఖాస్తుదారుని వృత్తి, మతం, కులం, వీధి, వార్డు, గ్రామం, కుటుంబ సభ్యుల వివరాలను కూడా ధ్రువీకరించాలి. విద్యుత్, నీటి బిల్లులు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డులు సరైనవో కావో సంబంధిత విభాగాల అధికారులతో సంప్రదించి నిర్ధారించుకోవాలి. దరఖాస్తులో పేర్కొన్న ఇంటి నిర్మాణం, ఖాళీ జాగాలను పరిశీలించి సర్వే చేయించాలి.

    ఇలా చెక్‌మెమోలో పేర్కొన్న 32 అంశాలను స్వయంగా తహశీల్దార్లు ధ్రువీకరించాలని సీసీఎల్‌ఏ జారీచేసిన చెక్‌మెమోలో పేర్కొన్నారు. వీటన్నింటిని నేరుగా తామే వెళ్లి పరిశీలించడమంటే సాధ్యమయ్యే పనికాదని అధికారులు అంటున్నారు. రోజుకు 50 దరఖాస్తులు పరిష్కరించాలని ఉన్నతాధికారులు ఆదేశించినా, 32 అంశాలను నిశితంగా పరిశీలించాల్సి వస్తున్నందున రోజుకు పది దరఖాస్తులు కూడా క్లియర్ చేయలేకపోతున్నట్లు అధికారులు వాపోతున్నారు. పరిశీలన ప్రక్రియ ఇదేవిధంగా కొనసాగితే.. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఈ నెల 20నుంచి పట్టాల పంపిణీ సాధ్యం కాకపోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు