గోదావరి నదిలో దూకి ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య

26 May, 2020 17:51 IST|Sakshi

సాక్షి, నిర్మల్‌ : తనకు జీవనాధారం అయిన ఆటోను బలవంతంగా లాక్కున్నాడని మనస్థాపంతో బాసర పట్టణానికి చెందిన ఒక ఆటో డ్రైవర్‌ గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. బాసరకు చెందిన రాము వృత్తిరిత్యా ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం( మే 24న) రాములు ఆటో తోలుతూ నిజామాబాద్‌ జిల్లా ఫకీరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి బైక్‌ను ప్రమాదవశాత్తు ఢీకొట్టాడు. దీంతో తనకు రూ. 15 వేలు నష్టపరిహారం చెల్లించాలంటూ ఫకీరాబాద్‌ వ్యక్తి బలవంతంగా రాము ఆటోను ఎత్తుకెళ్లాడు. అయితే రాము తన ఆటోను విడిపించుకునేందుకు నిజామాబాద్‌ వ్యక్తికి రూ. 10 వేలు అందజేశాడు. అయితే మిగతా ఐదువేల రూపాయలు చెల్లిస్తే తప్ప ఆటోను విడిచేది లేదంటూ వ్యకి తెగేసి చెప్పాడు.
(వైద్య విద్యార్థిని ఆత్మహత్య కలకలం)

దీంతో తన జీవనాధారమైన ఆటో లేకపోతే తాను బతకటం కష్టమవుతుదంటూ రాము ఆ వ్యక్తి ఇంటి ముందే బ్లేడ్‌తో చేయి కోసుకున్నాడు. చచ్చినా పర్వాలేదు.. కానీ పూర్తి డబ్బులు చెల్లిస్తేనే ఆటోను తిరిగి ఇచ్చేస్తానని మరోసారి తేల్చిచెప్పడంతో కలత చెందిన రాములు గోదావరి నదిలో మునిగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా రాములు మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ అతని బంధువులు, స్థానికులు జాతీయ రహదారిపై బైఠాయించారు. జరిగిన చిన్న యాక్సిడెంట్‌లో వ్యక్తికి సంబంధించిన వాహన ఇండికేటర్‌ మాత్రమే దెబ్బతింది.. దీనికే రాముపై దౌర్జన్యానికి దిగిన వ్యక్తి రూ.15 వేలు డిమాండ్‌ చేయడమే గాక ఆటోను లాక్కోవడం దారుణమని పేర్కొన్నారు. బాధితుని మృతికి కారణమైన వ్యక్తిపై కేసు పెట్టి అతని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్‌ చేశారు. దీంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 


 

మరిన్ని వార్తలు