ఆటో కార్మికుల కష్టాలు

6 May, 2020 12:56 IST|Sakshi

లాక్‌డౌన్‌తో నిలిచిన ఆటోలు

ఫైనాన్స్‌ చెల్లింపులకు సతమతం

మహబూబాబాద్‌ అర్బన్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆటో కార్మికులు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. మూడు చక్రాల ఆటో తిరిగితే తప్ప కడుపు నిండని ఆటో డ్రైవర్లు చేసేందుకు పనిలేక ఇల్లు గడవక నానా అవస్థలు పడుతున్నారు.  ఆటో యజమానుల వద్ద రోజుకు రూ.300లకు ఆటోను అద్దెకు తీసుకుని నడిపే వారికి కరోనా ఒక శాపంలా మారింది. జిల్లాలో పగలు, రాత్రి ఆటోలు నడుపుతూ ఉపాధి పొందే కార్మికులు దాదాపు 2వేల మంది ఉన్నారు.

పెరిగిన ఖర్చులు
లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి రూ.1500, 12కిలోల బియ్యం అందజేస్తుంది. అయినా రోజువారి రాబడి లేకపోవడంతో కుటుంబ ఖర్చులు పెరిగాయి. దీంతో ఖర్చులు తట్టుకోలేకపోతున్నామని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫైనాన్స్‌ వడ్డీల భయం
లాక్‌డౌన్‌తో ఫైనాన్స్‌లో ఆటోలు కొనుగోలు చేసిన ఆటో డ్రైవర్లు పడరాని పాట్లు పడుతున్నారు. ఓ వైపు ఇంటి ఖర్చులు, మరో వైపు ఆటో ఫైన్సాన్స్‌ నెలవారీ చెల్లింపుల భయంతో బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నారు. ప్రభుత్వం వెసలుబాటు కల్పించినా లాక్‌డౌన్‌ తరువాత అయినా ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారు.

కుటుంబం గడవడం కష్టంగా ఉంది
ఒక్కసారిగా లాక్‌డౌన్‌ అమలు చేయడంతో ఆటో డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది ఫైనాన్స్‌ కింద ఆటోలు కొనుగోలు చేశారు. వారంతా ఫైనాన్స్‌ ఎలా చెల్లించాలో తెలియక సతమతమవుతున్నారు. కుటుంబం గడవడం కష్టంగా ఉంది. ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి.– నలమాస సాయి,టీఏడీయూ జిల్లా అధ్యక్షుడు, మహబూబాబాద్‌

మరిన్ని వార్తలు