ఆటో మిత్తి.. మెడపై కత్తి

22 Aug, 2018 10:29 IST|Sakshi

ఫైనాన్షియర్ల ‘చక్ర’బంధంలో ఆటోడ్రైవర్లు

రూ.6,624 అసలుకు రూ.47,500 వసూలు

వడ్డీపై చక్రవడ్డీ వేసి మరీ వసూలు

ఫైనాన్షియర్ల గుప్పిట్లో 90 వేల ఆటోలు

పోలీసు, ఆర్టీఏ, ఫైనాన్స్‌ చట్టాలేవీ వర్తించని వైనం

సాక్షి, సిటీబ్యూరో: ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు శ్రీనివాస్‌. నాచారం ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్‌. అద్దె ఆటో నడుపుతూ కొంతకాలం ఉపాధి పొందిన అతడు.. మూడేళ్ల క్రితం సెకెండ్‌హ్యాండ్‌ ఆటో కొనుక్కొనేందుకు ఖైరతాబాద్‌లోని ఓ ఫైనాన్స్‌ వ్యాపారిని ఆశ్రయించాడు. రూ.1.35 లక్షలు ఇచ్చేందుకు వ్యాపారి అంగీకరించాడు. దీనికి నెలకు రూ.6,624 చొప్పున వాయిదా చెల్లించాలని షరతు విధించాడు. మూడేళ్ల పాటు రాత్రింబవళ్లు కష్టపడి వడ్డీతో సహా బాకీ చెల్లించాడు. కానీ ఒకేఒక్క వాయిదా చెల్లించలేకపోయాడు. ఈ మొత్తాన్ని ఫైనాన్షియర్‌ నుంచి మినహాయింపు కోరాలని భావించాడు. కానీ రూ.6,624 నెల వాయిదాకు ఏడాది వ్యవధిలో రూ.47,500 చెల్లించాలంటూ ఫైనాన్షియర్‌ తాఖీదు ఇవ్వడంతో శ్రీనివాస్‌ గుండె గుభేల్‌మంది. అంటే ఈ మొత్తం బాకీపై వడ్డీ విధించి.. ప్రతినెలా అసలు, వడ్డీకి మళ్లీ చక్రవడ్డీ విధించి వసూలు చేశాడు. ఆటోరిక్షా ఫైనాన్షియర్ల దా‘రుణ’మైన దోపిడీకి ఇదో పరాకాష్ట. శ్రీనివాస్‌ లాంటివారుగ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 90 వేల మంది ఫైనాన్షియర్ల కబందహస్తాల్లో నిలువుదోపిడీకి గురవుతున్నారు. ఆటోరిక్షాలపై వడ్డీ వ్యాపారం చేస్తున్న 500 మంది, వాళ్లకు అనుబంధంగా పనిచేసే దళారీ వ్యవస్థ నగరంలో ఏటా రూ.వందల కోట్ల అక్రమ వ్యాపారాన్ని సాగిస్తోంది. ఒకసారి ఫైనాన్షియర్‌ వద్ద అప్పు తీసుకున్న ఆటోడ్రైవర్‌ జీవితకాల రుణగ్రస్తుడుగా మారిపోవాల్సి వస్తోంది. లేదా ఏ ఒకటి, రెండు నెలల వాయిదాలు చెల్లించకుంటే ఏకంగా ఆటోనే వదులకోవాల్సిన పరిస్థితి. అయితే, ఈ ఫైనాన్షియర్ల అక్రమ వ్యాపారానికి ఆర్‌బీఐ నిబంధనలు వర్తించవు. రవాణా, పోలీసు చట్టాలకు వీరు అతీతం. చివరకు ఆర్థికశాఖ పరిధిలోని ‘మానీ లాండరింగ్‌ చట్టం’ కూడా ఈ దోపిడీని అరికట్టలేకపోతోంది. దీంతో వేలాది మంది ఆటోడ్రైర్లు వీరి కబంధ హస్తాల్లో చిక్కుకుని అప్పుల పాలవుతున్నారు. 

కేన్సర్‌ బాధితుడినీ వదల్లేదు..
ఆటోడ్రైవర్ల పాలిట శాపంలా మారిన ఫైనాన్షియర్లు చివరకు ఓ కేన్సర్‌ వ్యాధిగ్రస్తుడినీ వదలకుండా పీల్చిపిప్పి చేశారు. బోడుప్పల్‌కు చెందిన దేవేందర్‌కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఒక ఫైనాన్షియర్‌ వద్ద రూ.1.5 లక్షల అప్పు తీసుకొని ఆటో కొన్నాడు. మూడేళ్లలో రూ.2 లక్షలకు పైగా అసలు, వడ్డీ చెల్లించాడు. కానీ మరో రూ.10 వేలు బాకీ ఉండిపోయింది. కొద్ది రోజులకే   అతని భార్య అనారోగ్యంతో చనిపోయింది. దురదృష్టవశాత్తు అతడు కేన్సర్‌ బారిన పడ్డాడు. దీంతో కొడుకు చదువు ఇంటర్‌ మధ్యలోనే ఆగిపోయింది. ఒకరకంగా ఆ కుటుబం మరిన్ని కష్టాలపాలైంది. కానీ ఆ కష్టాలు ఫైనాన్షియర్‌ను కదిలించలేదు. రూ.10 వేల అప్పు కింద ఉపాధిని ఇస్తున్న ఏకైక ఆధారం ఆటోను జప్తు చేశాడు. చివరకు ఆటో సంఘాల జోక్యంతో మరో నాలుగు నెలల్లో రూ.10 వేల అసలుతో పాటు వడ్డీ చెల్లిస్తేనే ఆటో డాక్యుమెంట్లు ఇస్తానన్నాడు. ‘బాకీలు కట్టీ కట్టీ సర్వం కోల్పోయిన. ఇక నా వల్ల కాదు. కొడుకు చదువాగిపోయింది. భార్య చనిపోయింది. ఆ ఫైనాన్షియర్‌కు ఏ మాత్రం కనికరం లేదు’.. ఇది దేవయ్య ఆవేదన మాత్రమే కాదు. నగరంలో చాపకింద నీరులా విస్తరిస్తూ బడుగుల బతుకులపై కేన్సర్‌ కంటే ప్రమాదకరంగా మారిన ఫైనాన్షియర్ల బారిన పడ్డ ఎంతోమందిది ఇదే పరిస్థితి.  
ఫైనాన్స్‌ వాయిదా చెల్లించడం లేదనే నెపంతో నాలుగు రోజుల క్రితం ఒక వ్యాపారి ఎర్రగడ్డకు చెందిన ఆటోడ్రైవర్‌ షేక్‌ అజారుల్లా ఇంటికి తాళం వేశాడు. ఆటోడ్రైవర్ల ఇళ్లపైన, వాహనాలపైన దాడులు చేసేందుకు ప్రతి ఫైనాన్షియర్‌  కొంతమంది రౌడీషీటర్లతో ‘సీజర్స్‌ వ్యవస్థ’ను ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. 

ఏ నిబంధనలూ వర్తించవా..!
కనీసం రూ.5 లక్షల పైన జరిగే లావాదేవీలకు మాత్రమే ఆర్‌బీఐ నిబంధనలు వర్తిస్తాయి. ఉదాహరణకు కార్ల విక్రయాల్లో నిబంధనల ప్రకారం వడ్డీ రేట్లు ఉంటాయి. కానీ ఆటోరిక్షా ఫైనాన్షియర్లు కేవలం రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకే వడ్డీకి అప్పు ఇస్తున్నారు. దీంతో వారికి ఆర్‌బీఐ నిబంధనలు వర్తించడం లేదు. ఇష్టారాజ్యంగా వడ్డీలు వసూలు చేస్తున్నారు. రూ.1.5 లక్షల అప్పు తీసుకున్న ఆటోడ్రైవర్‌ మూడేళ్లలో వడ్డీతో సహా రూ.2 లక్షలకు పైగా చెల్లించినా అప్పు తీరడం లేదు. మధ్యలో ఏ ఒకటి, రెండు నెలలు వాయిదాలు చెల్లించకున్నా ఆటోలను జప్తు చేస్తారు. లేదా భారీగా వడ్డీ విధిస్తారు. నగరంలో బాగా పేరు మోసిన పది, పదిహేను ఫైనాన్స్‌ సంస్థలు తమ కింద సబ్‌ ఫైనాన్షియర్లను డీలర్లుగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ డీలర్ల సాయంతో అక్రమ వడ్డీ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. వడ్డీ వ్యాపారుల అక్రమాలను అరికట్టాలని కోరుతూ ఆటోకార్మిక సంఘాలు అనేకసార్లు ఆందోళనలు చేపట్టాయి. ఇటీవల ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి తమ కష్టాలను చెప్పుకొన్నారు. డీజీపీకి వినతి పత్రాలు ఇచ్చారు. కానీ ఆటో సంఘాల ఆవేదన అరణ్య రోదనగానే మిగిలింది. 

దోపిడీ క్రమం సాగుతుందిలా..
సుమారు 500 మంది చిన్న, పెద్ద ఫైనాన్షియర్లు 30 ఏళ్లుగా ఈ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సుమారు 90 వేల ఆటోలు వారి  చేతుల్లోనే ఉన్నాయి.  
ఆటోడ్రైవర్లు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల కోసం వీరిని ఆశ్రయిస్తున్నారు. దీనిపై 1.5 శాతం నుంచి 2 శాతం వరకు వడ్డీ విధిస్తున్నారు. ఈ లెక్కన ప్రతి నెలా రూ.6500 వరకు ఆటోడ్రైవర్‌ వాయిదాల పద్ధతిలో చెల్లిస్తాడు. కానీ 30 నెలల వ్యవధిలో ఏ నెల చెల్లించకపోయినా వడ్డీ మొత్తం పెంచేస్తారు.   
ఉదాహరణకు రూ.లక్ష అప్పు తీసుకున్న వ్యక్తి అప్పు తీరే నాటికి ఫైనాన్సర్‌కు రూ.1,59,990 వరకు చెల్లిస్తున్నాడు. ఇందుకోసం ఎలాంటి తేడాలు రాకుండా ఉండేందుకు, ఏ క్షణమైనా ఆటోను స్వాధీనం చేసుకొనేందుకు తెల్ల బాండ్‌ పేపర్లపై ఆటోడ్రైవర్‌తో సంతకాలు చేయిస్తారు. ఈ చెల్లింపుల్లో ఒక్క నెలా అప్పు కట్టలేకపోయినా ఆటోను స్వాధీనం చేసుకుంటారు.
2,3 నెలల పాటు అప్పు కట్టలేని ఆటోడ్రైవర్లపై వడ్డీని 2 నుంచి 5 శాతానికి పెంచుతారు. స్వాధీనం చేసుకున్న ఆటోలు తమ వద్ద ఉంచుకున్నందుకు పార్కింగ్‌ ఫీజు పేరిట నెలకు మరో రూ.1000 చొప్పున వసూలు చేస్తారు. మొత్తంగా ఆటోడ్రైవర్‌ను శాశ్వత రుణగ్రస్తుడిగా మార్చేస్తున్నారు.
గ్రేటర్‌లో ఏటా రూ.500 నుంచి రూ.700 కోట్ల వరకు ఈ వడ్డీ వ్యాపారం సాగుతోంది.

మరిన్ని వార్తలు