ఆటో పర్మిట్ల బ్లాక్‌.. డ్రైవర్లకు షాక్‌! 

11 Nov, 2017 03:32 IST|Sakshi

తాజాగా కొత్త ఆటోలకు జీవో విడుదల

రంగంలోకి దిగిన ఫైనాన్షియర్లు 

ధరలు పెంచేందుకు రంగం సిద్ధం  

సాక్షి,హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆటో పర్మిట్‌ల దందాకు మళ్లీ తెరలేచింది. నగరంలో కొత్త ఆటో పర్మిట్లు విడుదలైన ప్రతిసారీ నిరుపేద డ్రైవర్ల సొమ్మును ఫైనాన్షియర్లు, డీలర్లు కొల్లగొడుతున్నారు. ఆటోమొబైల్‌ తయారీదారులు నిర్ణయించిన ధర ప్రకారం ఒక ఆటోరిక్షా రూ.1.25 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు డ్రైవర్‌కు లభించాలి. కానీ, కొందరు ఫైనాన్షియర్లు, డీలర్లు కుమ్మక్కై బినామీ ఆటోడ్రైవర్ల పేరుతో పర్మిట్లను బ్లాక్‌ చేస్తున్నారు. తరువాత ఒక్కో ఆటోను రూ.2.5 లక్షలకు విక్రయిస్తున్నారు. ఎలాగైనా సొంతంగా ఆటోరిక్షాను సంపాదించుకోవాలనుకునే డ్రైవర్లు ఫైనాన్షియర్ల చక్రవడ్డీకీ, ధనదాహానికి బలవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా మరో 686 కొత్త ఆటోలకు అనుమతినిచ్చింది. 

తాజాగా మరో జీవో విడుదల: నగరంలో వాహన కాలుష్యాన్ని అరికట్టడంలో భాగంగా 2002లో కొత్త ఆటోలపై అధికారులు నిషేధం విధించారు. ఈ నిషేధమే ఆటోడీలర్లు, ఫైనాన్షియర్లకు కాసులు కురిపిస్తోంది. నగరంలోని సుమారు 1.4 లక్షల ఆటోల్లో 80 శాతం ఇప్పటికీ ఫైనాన్షియర్ల గుప్పిట్లోనే ఉన్నాయి. చక్రవడ్డీకి అప్పులిచ్చి ఆటోడ్రైవర్లకు ఆటోలను కట్టబెట్టడం, వాళ్లు డబ్బులు చెల్లించుకోలేని స్థితిలో తిరిగి వాటిని స్వాధీనం చేసుకొని మరో డ్రైవర్‌కు విక్రయించడం, అక్కడా అప్పు చెల్లించకుంటే జప్తు చేయడం సర్వసాధారణంగా మారింది. గతంలో ఇవ్వగా మిగిలిపోయిన 686 పర్మిట్‌లకు ప్రభుత్వం రెండు రోజుల క్రితం అనుమతినిస్తూ జీవో విడుదల చేసింది. ఈ పర్మిట్లపై ఇప్పటికే బినామీ పేర్లతో ప్రొసీడింగ్స్‌ సంపాదించిన ఫైనాన్షియర్లు తాజాగా దందాకు తెరలేపారు. 

ఆర్టీఏలోనే ప్రొసీడింగ్స్‌ ఇవ్వాలి... 
ఆటోడ్రైవర్‌లపై దోపిడీని అరికట్టి బ్లాక్‌ మార్కెట్‌కు అవకాశం లేకుండా ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలోనే నిజమైన ఆటోడ్రైవర్‌లను గుర్తించి ప్రొసీడింగ్స్‌ (అనుమతి పత్రాలు) ఇవ్వాలని ఆటోసంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. దందాకు ఆస్కారమిచ్చేవిధంగా ఇప్పటివరకు షోరూమ్‌లలో ప్రొసీడింగ్స్‌ ఇచ్చేవారని తెలంగాణ ఆటోడ్రైవర్‌ల సంఘం అధ్యక్షుడు వి.మారయ్య, తెలంగాణ ఆటోడ్రైవర్‌ల సంక్షేమ సంఘం నాయకులు ఎ.సత్తిరెడ్డి, అమానుల్లాఖాన్‌ పేర్కొన్నారు. ప్రొసీడింగ్‌ల జారీలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా రవాణా అధికారులు శ్రద్ధ చూపాలని కోరారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా