వాహన చోరీలు... హైస్పీడ్‌!  

18 Jan, 2020 10:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

2014 నుంచి కట్టడికి ప్రత్యేక చర్యలు

జాయ్‌ రైడర్స్‌తో కొత్త తలనొప్పులు

ప్రత్యేక చర్యలకు పోలీసుల సన్నాహాలు

► వాహనాన్ని తస్కరించడం.. దాన్ని రిసీవర్‌కు విక్రయించడం.. అలా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేయడం.. ఇది ప్రొఫెషనల్‌ దొంగల శైలి.
► ఓ వాహనంపై మోజుపడి చోరీ చేయడం.. విసుగొచ్చే వరకు తిరిగేసి ఒకచోట వదిలేయడం లేదా దాచేయడం.. మరోటి తస్కరించడం.. ఇదీ జాయ్‌ రైడర్స్‌ స్టైల్‌.

సాక్షి, సిటీబ్యూరో: సిటీలో ఈ రెండు రకాలైన నేరాలు చోటు చేసుకున్న ఫలితంగా గత ఏడాది వాహనచోరీ కేసుల సంఖ్య ఏకంగా 17 శాతం పెరిగింది. 2014 నుంచి ఈ నేరాలను కట్టడి చేయడానికి పోలీసు విభాగం ప్రయత్నాలు ప్రారంభించింది. ఫలితంగా 2018 వరకు వరుసగా తగ్గతూ వచ్చిన ఆటోమొబైల్‌ అఫెన్సులు 2019లో మాత్రం హఠాత్తుగా పెరిగాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసు విభాగం ఈ క్రైమ్‌ను కట్టడి చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. వాహనచోరీలనే వృత్తిగా ఎంచుకుని, అలా వచ్చే సొమ్ముతోనే బతికే వాళ్లతో పాటు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తమ సరదా తీర్చుకోవడం కోసం చోరబాట పడుతున్నారని అధికారులు గుర్తించారు. రికార్డుల్లో ఉన్న పాత వారిని పట్టుకోవడం కొంత వరకు సాధ్యమవుతున్నా... జాయ్‌ రైడర్స్‌ మాత్రం ముçప్పుతిప్పలు పెడుతున్నారు.  

వలసవస్తున్న ‘ప్రొఫెషనల్స్‌’... 
వాహనచోరీలనే వృత్తిగా ఎంచుకున్న నగరానికి చెందిన వారి సంఖ్యా ఎక్కువగానే ఉండేది. అయితే గడిచిన ఆరేళ్లుగా నగర పోలీసులు ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ (పీడీ) యాక్ట్‌ వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో వీరికి కొంతమేర అడ్డుకట్ట పడింది. ప్రస్తుతం సిటీకి వలస దొంగల బెడద ఎక్కువగా ఉంటోంది. బయటి రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన చోరులు నగరానికి వచ్చి తమ ‘పని’ పూర్తి చేసుకుని వెళ్తున్నారు. వీరి పూర్తి వివరాలు పోలీసు రికార్డుల్లో లేకపోవడం, పీడీ యాక్ట్‌ నమోదుకు సాంకేతిక ఇబ్బందులు ఉండటంతో ఈ చోరులకు అడ్డుకట్ట వేయడం కష్టంగా మారుతోంది. ఈ ముఠాలు, చోరులు సిటీలో తస్కరించిన వాహనాలను బయటకు తరలించి విక్రయిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ కారణంగానే చోరీకి గురైన వాహనాల రికవరీ దారుణంగా ఉంటోందని వివరిస్తున్నారు. గడిచిన కొన్నేళ్ళ గణాంకాలు తీసుకుంటే ఏ ఒక్క ఏడాదీ వాహనచోరీల్లో రికవరీల శాతం 50 శాతానికీ చేరకపోవడానికి ప్రధాన కారణం ఇదేనని స్పష్టం చేస్తున్నారు.  

జాయ్‌ రైడర్స్‌తో మరో తలనొప్పి... 
స్నేహితులు లేదా ప్రేయసితోనే,  సరదాగా తిరగడం కోసమో వాహనాలను చోరీ చేస్తున్న జాయ్‌ రైడర్స్‌ సంఖ్య ప్రొఫెషనల్స్‌కు దీటుగా ఉంటోందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ ట్రెండ్‌ నగరంలో పెరిగిపోయిందని అధికారులు చెప్తున్నారు. జాయ్‌ రైడర్స్‌గా పట్టుబడుతున్న వారిలో విద్యార్థులు, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారి బిడ్డలు ఉంటుండటం, వీరంతా కొత్త నేరగాళ్లు కావడంతో గుర్తించడం, పట్టుకోవడానికి ఎక్కువ సమయం పడుతోంది. ఇలాంటి జాయ్‌ రైడర్స్‌కు సంబంధించిన ఇటీవల కాలంలో పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మైనర్లు ఈ నేరాల వైపు మళ్ళుతున్నారు. నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో లభిస్తున్న గుర్తుతెలియని వాహనాల్లో జాయ్‌ రైడర్స్‌ ద్వారా చోరీకి గురైనవీ పెద్దసంఖ్యలోనే ఉంటున్నాయని పోలీసు అధికారులు చెప్తున్నారు. చోరీ చేసిన వాహనానికి రిజి్రస్టేషన్‌ నెంబర్‌ మార్చి కొంతకాలం తిరిగిన తరవాత లేదంటే ట్రాఫిక్‌ పోలీసులు అడిగినప్పుడు సరైన డాక్యుమెంట్లు చూపించలేకో వదిలేసి వెళుతున్నారు.  

దృష్టిపెట్టిన ప్రత్యేక విభాగాలు... 
నగరంలో 2018తో పోలిస్తే 2019లో నేరాల నమోదు తగ్గింది. అయితే దీనికి భిన్నంగా పెరిగిన వాహనచోరీలను కట్టడి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఓ పక్క ప్రొఫెషనల్స్, మరోపక్క జాయ్‌ రైడర్స్‌ను కట్టడి చేయడానికి చర్యలు ప్రారంభించారు. నేర విభాగాలతో పాటు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు వాహనచోరీలపై దృష్టి కేంద్రీకరించేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తున్న ప్రత్యేక బృందాలు వాహనచోరీలకు చెక్‌ చెప్పడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. జాయ్‌రైడర్స్‌ను కట్టడి చేయడంతో తల్లిదండ్రుల పాత్ర ఎక్కువగా ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ వాళ్ళపై కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందని వివరిస్తున్నారు. ఈ జాయ్‌రైడర్స్‌ ఎక్కువగా అనధికారిక పార్కింగ్‌ ప్లేసులు, రాత్రి వేళల్లో ఇళ్ళ బయట పార్క్‌ చేసిన వాహనాలే టార్గెట్‌ చేస్తారని, వీటిని వాహనచోదకులు దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 

 ఎన్ని చోరీలు? 
 
ఏ ఏడాది
2014 1475
2015 1211
2016 1034
2017 889
2018 661
2019 78

మరిన్ని వార్తలు