ఒకే కాన్పులో నలుగురు శిశువుల జననం

27 Nov, 2014 02:01 IST|Sakshi
ఒకే కాన్పులో నలుగురు శిశువుల జననం
  • గాంధీ ఆసుపత్రిలో ఘటన
  • హైదరాబాద్: ఒకే కాన్పులో ఓ మహిళ నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. అయితే గర్భంలోనే ఓ శిశువు మృతిచెందటంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి మృతశిశువుతోపాటు ఇద్దరు మగ, ఒక ఆడ శిశువును తల్లి గర్భం నుంచి బయటకు తీశారు. ఈ ఘటన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో బుధవారం చోటుచేసుకుంది. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు.

    మెదక్ జిల్లా సంగారెడ్డి సమీపంలోని ఆరూరు గ్రామానికి చెందిన లక్ష్మికి రెండేళ్ల కిందట సీహెచ్.రాజన్నతో వివాహమైంది. కొన్ని నెలల కిందట గర్భందాల్చిన లక్ష్మి వైద్యపరీక్షల కోసం స్థానిక డాక్టర్లను సంప్రదించగా వారి సూచన మేరకు ఈ ఏడాది జూన్‌లో గాంధీ ఆస్పత్రిలో చేరింది. గైనకాలజీ విభాగ వైద్యులు లక్ష్మికి పరీక్షలు నిర్వహించి ఆమెకు ఒకే గర్భసంచిలో నాలుగు అండాలు పెరుగుతున్నట్లు గుర్తించారు.

    ఏడు నెలలు నిండిన తర్వాత గర్భంలోని ఓ శిశువు మృతి చెందినట్లు స్కానింగ్ ద్వారా గుర్తించారు. అప్పుడే శస్త్రచికిత్స నిర్వహిస్తే మిగిలిన శిశువులు మృతి చెందే అవకాశం ఉందని భావించి ఆస్పత్రిలోనే వైద్యసేవలు అందించారు. కడుపులోని మిగిలిన శిశువులతోపాటు తల్లికి ఎటువంటి ప్రమాదం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. నెలల నిండిన తర్వాత బుధవారం ఉదయం సుమారు రెండు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి మృతశిశువుతోపాటు, ముగ్గురు శిశువులను బయటకు తీశారు.
     

>
మరిన్ని వార్తలు