ప్రారంభమైన వింగ్స్‌ ఇండియా–2020

12 Mar, 2020 12:00 IST|Sakshi

హెలికాప్టర్ల బృందానికి సారంగ్‌ నామకరణం

అద్భుతంగా ‘సారంగ్‌’ టీమ్‌ విన్యాసాలు

వేదికగా మారిన వింగ్స్‌ ఇండియా–2020

భారతీయ వైమానిక దళం బ్రాండ్‌ అంబాసిడర్లు

సనత్‌నగర్‌: బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ వేదికగా వింగ్స్‌ ఇండియా–2020 గురువారం ప్రారంభమైంది. ఇందులో సారంగ్‌ టీమ్‌ వైమానిక విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సారంగ్‌ టీమ్‌ నాలుగు రోజుల పాటు గురువారం నుంచి ప్రతిరోజూ ఉదయం 11.30 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 4.30 గంటల వరకు వైమానిక విన్యాసాలు చేయనున్నారు. ఈ టీమ్‌ ప్రధానంగా భారత వైమానిక దళం వైపు యువతను ప్రేరేపించే దిశగా ప్రదర్శనలు ఇస్తుంటుంది.

సారంగ్‌ హెలికాప్టర్‌ 2003లో బెంగళూరులో అడ్వాన్స్‌ లైట్‌ హెలికాప్టర్‌ (ఏఎల్‌హెచ్‌) ఎవాల్యుషన్‌ ఫ్లైట్‌ వారు రూపొందించారు. దీన్ని ‘ధ్రువ్‌’గా పిలుస్తారు. ఇది ఇండియన్‌ ఏవియేషన్‌ సెక్టార్‌కు మూల స్తంభంగా నిలబడింది. హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌)చే డిజైన్‌ చేయబడింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను ఛేదించే మల్టీ–మిషన్‌ సామర్థ్యం కలిగిన హెలికాప్టర్‌గా ఖ్యాతి గడించింది. భారతీయ వైమానిక దళం వృత్తి నైపుణ్యాన్ని, భారత విమానయాన పరిశ్రమ సాధించిన మైలురాళ్లను ప్రదర్శించే లక్ష్యానికి ఈ హెలికాప్టర్లు మార్గం సుగమం చేశాయి. 

ఈ హెలికాప్టర్ల బృందానికి సారంగ్‌ అని నామకరణం చేశారు. సారంగ్‌ అంటే సంస్కృతంలో నెమలి. ఈ బృందం భారతీయ వైమానిక దళం బ్రాండ్‌ అంబాసిడర్లుగా నిలుస్తోంది. 2004 ఫిబ్రవరిలో సింగపూర్‌లో జరిగిన ఆసియా ఏరోస్పేస్‌ ఎయిర్‌ షోలో సారంగ్‌ బృందం తన తొలి బహిరంగ ప్రదర్శన ఇచ్చింది. ఆ తరువాత అదే ఏడాది యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఆల్‌ ఐన్‌ గ్రాండ్‌ ప్రిక్స్, 2008 మేలో బెర్లిన్‌లో జరిగిన ఇండో–జర్మన్‌ ఎయిర్‌ షోలో పాల్గొని బెస్ట్‌ ఏరోబాటిక్‌ టీమ్‌గా పేరుతెచ్చుకుంది. రాజెడ్‌ 90వ వార్షికోత్సవం సందర్భంగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో, ఆ తరువాత ఆర్‌ఏఎఫ్‌ ఫెయిర్‌పోర్ట్‌లోని రాయల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ టాటూలో ప్రదర్శనలు ఇచ్చారు.

2008లో ప్రఖ్యాత ఫార్న్‌బరో ఎయిర్‌షో, 2016 జవనరిలో అల్‌ సఖీర్‌ ఎయిర్‌బేస్‌ వద్ద జరిగిన బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ షో, 50వ జాతీయ దినోత్సవం సందర్భంగా 2018 మార్చిలో మారిషస్‌లో సారంగ్‌ టీమ్‌ ఎయిర్‌ షోలు చేసింది. అవే కాకుండా ఫోఖ్రాన్‌లో ఫైర్‌ పవర్‌ డిమానిస్ట్రేషన్‌ వంటి ఉత్సవ సందర్భాల్లో వైమానిక విన్యాసాలను చేయడంతో పాటు బెంగళూరులోని ఏరో ఇండియా ఎయిర్‌ షోలో ఈ బృందం క్రమం తప్పకుండా పాల్గొంటుంది. ప్రెసిడెన్షియల్‌ ప్లీట్‌ రివ్యూ, నేవీ డే, వరల్డ్‌ మిలటరీ గేమ్స్, కామన్వెల్త్‌ యూత్‌ గేమ్స్‌ వంటి ఉత్సవ సందర్భాల్లో ఎయిర్‌ షో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. షోల ప్రదర్శన మాత్రమే కాకుండా యువతను వైమానిక దళం వైపు మళ్లించేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 

బాధ్యతాయుతమైన పాత్ర  

2006లో గుజరాత్‌లో వైబ్రంట్, 2008లో ముంబాయిలో మెరైన్‌ డ్రైవ్, 2014లో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పసిఘాట్, బిజు పట్నాయక్‌ శతాబ్ది ఉత్సవాల్లో ఈ బృందం తమ సందేశాలను అందించింది. వీరి విన్యాసాలు కేవలం వినోదం మాత్రమే కాకుండా జాతీయ శక్తిని నలుదిశలా చాటిచెప్పేందుకు ఒక సాధనంగా నిలుస్తాయి. సేవా ›కార్యక్రమాల్లో కూడా ఈ బృందం ముందంజలో ఉంది. 2013లో ఉత్తరాఖండ్‌లో వచ్చిన వరదల సమయంలో హెచ్‌ఏడీఆర్‌ మిషన్‌లో ఈ బృందం చురుగ్గా పాల్గొంది. ఈ బృందం వెయ్యి మందిని రక్షించింది. 10 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో 12 టన్నుల సహాయక సామగ్రిని అందించాయి. అలాగే గత డిసెంబర్‌ 17న ఓఖీ తుఫాను, 2018 మార్చిలో తేనిలో జరిగిన అటవీ మంటల వ్యాప్తిని నిరోధించడంలో ఈ బృందం స్పందించిన తీరు అద్భుతం. 2018 ఆగస్టులో కేరళలో సంభవించిన వరదల సమయంలో తమ సామర్థ్యంతో 320 మందిని రక్షించారు. కేరళ ప్రజలకు సహాయంగా 77 టన్నుల సహాయక సామగ్రిని అందించారు. వరదలతో బాధపడుతున్న ప్రజలకు సహాయాన్ని అందించడంలో ఈ బృందం బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తూనే ఉంది. 

నాలుగు రోజులపాటు ఏవియేషన్‌ షో
వింగ్స్‌ ఇండియా 2020 ఏవియేషన్‌ షో ఇవాళ్ట నుంచి నాలుగు రోజుల పాటు జరగనుంది. ఈ నేపథ్యంలో సరంగ్, మార్క్‌ జెఫ్రీ బృందాలు విమాన విన్యాసాల రిహార్సల్స్‌తో బుధవారం అలరించాయి. నింగిలో అబ్బురపరిచే విన్యాసాలతో కిరాక్‌ పుట్టించారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ పరిసర ప్రాంతాల ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. నింగిలో విన్యాసాలను చూసేందుకు రహదారుల పైనే తమ వాహనాలను నిలిపి రిహార్సల్స్‌ను చూసి ఎంజాయ్‌ చేశారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు