ఆ పాలు తాగలేం బాబూ!

16 Sep, 2018 02:31 IST|Sakshi

ఐసీడీఎస్‌ కేంద్రాల్లో ప్యాకెట్‌ పాలపై విముఖత  

లీటరుకు రూ.44 చొప్పున అంగన్‌వాడీలకు విజయ పాలు

మాకొద్దు అంటున్న గర్భిణులు, బాలింతలు, చిన్నారులు

సాక్షి, హైదరాబాద్‌: ‘కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లయింది’అన్నట్లుగా ఉంది అంగన్‌వాడీ సెంటర్ల తీరు. గతంలో పాలు పల్చగా ఉంటున్నాయి, లబ్ధిదారులకు అందకుండా పక్కదారి పడుతున్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం విజయ ప్యాకెట్‌ పాలు పంపిణీ చేస్తుండగా, వాటిని తాగడానికి చాలా మంది ఇష్టపడటం లేదని ‘సాక్షి’ క్షేత్ర స్థాయి పరిశీలనలో వెల్లడైంది. సమీకృత శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్‌) ద్వారా గర్భిణులకు, పిల్లలకు అందించే పాలు పక్కదారి పట్టకుండా, కల్తీ కాకుండా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టెట్రా ప్యాకెట్లలో పాలను అందిస్తోంది. అయితే ప్రస్తుతం అమలవుతున్న ఈ విధానం సైతం విమర్శల పాలవుతోంది.

ఆ పాలను పిల్లలతో పాటు బాలింతలు తాగలేకపోతున్నారు. ఈ ప్యాకెట్‌ పాల నుంచి వాసనరావడం, తొందరగా పాడవుతుండటం, రుచి లేకపోవడంతో తాగడానికి విముఖత చూపుతున్నారు. దీంతో వృథాను, సిబ్బంది చేతివాటాన్ని అరికట్టడానికి తీసుకున్న ఈ నిర్ణయంతో ఫలితం లేకుండా పోయిందనే విమర్శలొస్తున్నాయి. పోషకాహార మాసంలో వెలువడిన ఒక సర్వే వివరాల ప్రకారం తెలంగాణలో చాలా మంది గర్భిణులు రక్తహీనతతో, చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. ఒక పూట పోషకాహారం అందించడమే లక్ష్యంగా ఏర్పాటైన అంగన్‌వాడీలు సంపూర్ణ ఆహారం అందించడంలో విఫలమవుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ప్యాకెట్లతోనే తంటా..
ఐసీడీఎస్‌ కేంద్రాల ద్వారా ఒక్కో ప్యాకెట్‌ పాలు 500 మి.లీ.పరిమాణంలో ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. అయితే ఒక్కొక్కరికి 200 మి.లీ. పరిమాణంలో అందించాల్సి ఉండటంతో, ప్యాకెట్‌ను చించి ఇద్దరికి సరఫరా చేయాల్సి వస్తోంది. ఒక్కసారి ప్యాకెట్‌ తెరిచిన తరువాత గంట వ్యవధిలోనే పాలు పాడవుతున్నాయి. ఒక్కో కార్టన్‌ డబ్బాలో పదిలీటర్ల వరకు పాలప్యాకెట్లు రాగా ఒక్కోసారి పాలన్నీ పాడవుతున్నాయి. దీంతో సిబ్బంది ముందుగానే గుర్తించి పారబోస్తున్నారు. రసాయనాలు మొదలైన వాటితో తయారవుతాయనే ఉద్దేశంతో ప్యాకెట్‌ పాలు తాగడానికి విముఖత చూపుతూ కొంతమంది అసలు పాలప్యాకెట్లనే తీసుకోవడం లేదు. దీంతో స్త్రీ, శిశు పోషణకోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం నీరుగారిపోతోంది.

రెండు మూడు విడతలుగా మేలు
నిర్ణీత ప్రమాణాలతో ప్రాసెస్‌ చేసి, ప్యాక్‌ చేసిన పాలే అయినప్పటికీ ఎక్కువకాలం నిల్వ ఉండటం లేదు. నెలలో అవసరమైన అన్ని ప్యాకెట్లను ఒకేసారి కేంద్రాలకు తరలించడం వల్ల ఆ పాలు మాసాంతం ఉండటం లేదు. అలాకాకుండా నెలలో రెండు మూడు విడతలుగా అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తే ప్రయోజనం ఉంటుందని అంగన్‌వాడీ కార్యకర్తలు అంటున్నారు.

పాలు తీసుకునేందుకు ఇష్టపడటంలేదు
ఒక్కోసారి పాలన్నీ చెడిపోతున్నాయి. దీంతో చేసేదేంలేక వాటిని బాలింతలకు పంపిణీ చేయకముందే పారబోస్తున్నాం. కొంత మంది వీటిని తీసుకోవడానికి అయిష్టత చూపుతున్నారు. నెలకు కావల్సిన ప్యాకెట్లన్నీ ఒకేసారి కాకుండా విడతలవారీగా అందజేస్తే బాగుంటుంది. – కె.వింధ్యారాణి, అంగన్‌వాడీ కార్యకర్త

‘హాకా’ ద్వారా పంపిణీ చేయాలనుకుంటున్నాం
పాలను ప్యాకెట్ల ద్వారా అందించడం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న విధానం. అన్ని ప్రమాణాలతో పూర్తిగా ప్రాసెస్‌ అయ్యి ధ్రువీకరించిన తర్వాతే పంపిణీ చేస్తారు. పాలు పాడైతే రీప్లేస్‌ చేస్తాం. విజయడెయిరీ టెట్రా ప్యాకెట్‌ పాలు బాలింతలు, పిల్లలు తాగడం లేదని అంగన్‌వాడీల ద్వారా మా దృష్టికి వచ్చింది. అందుకోసం ప్రభుత్వం హాకా అనే నోడల్‌ ఏజెన్సీ ద్వారా పాలు సరఫరా చేసే ఆలోచనలో ఉంది. అయితే ఫినోప్యాక్స్‌ ద్వారా సరఫరా చేయడంకంటే బ్రిక్‌ ప్యాక్స్‌ ద్వారా పంపిణీ చేయాలనుకుంటున్నాం. ఈ విషయంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.  – విజయేందిర బోయి, ఐసీడీఎస్‌ సంచాలకులు

బిల్లులు రావు..
ఈ చిత్రంలోని అంగన్‌వాడీ కేంద్రం మానుకోట మండలం పత్తిపాక గ్రామంలోని అద్దె భవనంలో నడుస్తోంది. దీన్ని నెలకు రూ.500తో అద్దెకు తీసుకుని నడిపిస్తున్నారు. గత ఆరునెలలుగా బకాయిలు రాకపోవడంతో అంగన్‌వాడీ టీచర్లే తమ సొంత జీతంలో నుంచి కడుతున్నారు.

పాలు వాసన వస్తున్నాయి
అంగన్‌వాడీ కేంద్రంలో ప్యాకెట్‌లో వచ్చే పాలను వేడి చేసి ఇస్తున్నారు. కానీ అవి ఎర్రగా, తాగుతుంటే వాసన వస్తున్నాయి. ఒకసారి ఆ పాలను ఇంటికి తీసుకెళ్లి తాగుదామనుకునేలోపు ప్యాకెట్‌ పగిలిపోయి భరించలేని దుర్వాసన వచ్చాయి. ఇప్పటికైనా ప్రభుత్వం టెట్రా ప్యాకెట్‌ పాలకు బదులు వేరే పాలు ఇవ్వాలి. అంతేకాకుండా అంగన్‌వాడీ కేంద్రంలో బాలామృతం ప్యాకెట్లు ఇవ్వడం లేదు. కోడిగుడ్లు కూడా నెలకు ఎనిమిది మాత్రమే ఇస్తున్నారు.   –బండారి శ్యామల, నెల్లికుదురు, మహబూబాబాద్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా