ఎంత కష్టమొచ్చే నర్సింహా...

7 May, 2018 11:18 IST|Sakshi
భార్య, పిల్లలు, తల్లితో.. నర్సింహారావు

రెండు కిడ్నీలు చెడిపోయి చావుబతుకుల మధ్యలో వ్యాన్‌డ్రైవర్‌

అవయవాన్ని దానం చేసేందుకు ముందుకొచ్చిన తల్లి

వైద్యానికి డబ్బులు లేక దాతలకోసం ఎదురు చూపు

అతడు స్టీరింగ్‌ తిప్పితేనే ఆ ఇంటి బండి నడుస్తుంది. వచ్చే కొద్ది సంపాదనతోనే భార్య, పిల్లలకు ఏ లోటు లేకుండా చూసుకునే వ్యాన్‌ డ్రైవర్‌ నర్సింహారావుకు రెండు కిడ్నీలు చెడిపోగా.. ఆ కుటుంబం పరిస్థితి దయనీయంగా తయారైంది. ఒకవైపు రోజు విడిచి రోజుకు డయాలసిస్‌ చేయించేందుకు డబ్బులు లేక.. మరోవైపు ఇళ్లు గడవక దాతల కోసం ఎదురు చూస్తోంది. 

ఖమ్మంఅర్బన్‌ : నగరంలోని గోపాలపురం కాల్వ కట్టపై నివాసం ఉంటూ వ్యాన్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న సురుగుల నర్సింహారావుకు ముగ్గురు బిడ్డలు, భార్య ఉన్నారు. రెండు నెలలు క్రితం అతడికి కాళ్లు వాపులు రావడంతో డాక్టరు వద్దకు వెళ్లాడు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు రెండు కిడ్నీలు చెడిపోయినట్లు నిర్దారించారు. నర్సింహారావుతో సహా కుటుంబ సభ్యులు పిడుగు లాంటి వార్త విని తట్టుకోలేకపోయారు. దుఖ:సాగరంలో మునిగిపోయారు.

నర్సింహారావు వ్యాన్‌ నడిపితేనే ఇల్లు గడుస్తుంది. అతడు అనార్యోగం బారిన పడటంతో కుటుంబంలో ఆర్థిక సమస్యలు ప్రారంభమయ్యాయి. నర్సింహారావుకు రోజు విడిచి రోజు డయాలసిస్‌ చేయాల్సి ఉంటుంది. లేకపోతే కిడ్నీలను మార్పిడి చేయాలి. చికిత్సకు, ఇల్లు గడవడానికి కుటుంబం ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి నెలకొంది. నర్సింహారావు భార్య, అక్క తమ బంగారం అభరణాలు తాకట్టు పెట్టి  నెల రోజులుగా రోజు డయాలసిస్‌ చేయిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం, హైదరాబాద్‌ ఆస్పత్రుల్లో సుమారు రూ. లక్షా 50 వేలపైగా ఖర్చు చేశారు. 

మందులకు నెలకు రూ. 10వేలు 

కన్న  బిడ్డపై మమకారంతో నర్సింహారావుకు తల్లి వెంకటరావమ్మ కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. వైద్యులు అన్ని పరీక్షలు చేసి తల్లి కిడ్నీ సరిపోతుందని చెప్పారు. అయితే ఆపరేషన్‌ ఆరోగ్య శ్రీలో ఉచితంగానే చేస్తామని వైద్యులు వివరించారు. కాని ఆపరేషన్‌ తర్వాత మూడు నెలలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది. అలాగే జీవితాంతం నెలకు సుమారు రూ.10 వేల విలువైన మందులను వాడాల్సి ఉంటుంది.

అందుకు అయ్యే ఖర్చులు లేక కుటుంబ సభ్యులు దాతలకోసం ఎదురు చూస్తున్నారు. చావు బతుకుల మధ్య కొట్టు మిట్లాడుతున్న నర్సింహారావు.. అతడిపై ఆధారపడిన భార్యా పిల్లల బాధను అర్థం చేసుకొని దాతలు ఆదుకోవాలని బంధువులు వేడుకుంటున్నారు. ప్రస్తుతం అతడు మమత రోడ్డులో ఒక అపార్టు మెంట్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తున్న తన అక్క, బావ వద్ద ఉంటున్నాడు. సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్‌ 9603443486  

>
మరిన్ని వార్తలు