సిద్దిపేట బల్దియాకు అవార్డుల పంట  

23 Jun, 2018 14:46 IST|Sakshi
ఢిల్లీలో శుక్రవారం జరిగిన వేడుకలో అవార్డు అందుకుంటున్న కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి  

ఢిల్లీలో సిద్దిపేటకు దక్కిన గౌరవం

ఆరు స్కోచ్‌ అవార్డులు అందుకున్న కమిషనర్‌

సిద్దిపేటజోన్‌ : సిద్దిపేట మున్సిపాలిటీ ఆరు అంశాల్లో 2018 స్కోచ్‌ అవార్డులను కైవసం చేసుకొని ఢిల్లీలో అరుదైన గౌరవం సొంతం చేసుకుంది. శుక్రవారం ఢిల్లీలోని కానిస్ట్యూషన్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా ఆడిటోరియంలో స్కోచ్‌ గ్రూప్‌ సీఈఓ గుర్షారాన్‌ దంజాల్‌ చేతుల మీదుగా సిద్దిపేట మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి అవార్డులను స్వీకరించారు.

 గత మూడేళ్లుగా వరుసగా అవార్డులను అందుకున్న సిద్దిపేట బల్దియా ఈ ఏడాది ఏకంగా ఆరు నామినేషన్లలో మెరుగైన ఫలితాలను సాధించి అవార్డులను  దక్కించుకుంది. సిద్దిపేట బల్దియా గెలుచుకున్న అవార్డులకు సంబంధించిన అంశాలిలా ఉన్నాయి. 1.ఈ– గవర్నెన్స్‌ ద్వారా సుస్థిర సేవలు, పరిపాలన అందించండం, 2. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ను పటిష్టంగా అమలు చేసి క్లీన్‌ సిటీగా మార్చడంలో కృషి చేసినందుకు రజిత స్కోచ్‌ అవార్డులు పొందింది.

3. సుస్థిరమైన పట్టణం (సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రజలకు సత్వర సేవలు అందించడం), 4. స్థిరమైన అమృత్‌ పట్టణ నగరీకరణ, 5. స్థిరమైన పర్యావరణ పరిరక్షణ, సమతుల్యత పాటించడం. 6.  సమర్థవంతమైన పాలన, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం లాంటి విభాగాల్లో సిద్దిపేట రజిత స్కోచ్‌ అవార్డులను అందుకుంది. ఒకే ఏడాదిలో ఆరు స్కోచ్‌ అవార్డులను కైవసం చేసుకున్న పట్టణంగా సిద్దిపేట చరిత్ర సృష్టించింది.  

మరిన్ని వార్తలు