ఆ క్షణాలు ఎంతో విలువైనవి

27 Jul, 2018 12:27 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న పుప్పాల శ్రీనివాస్, రక్తస్రావం నియంత్రణపై అవగాహన కల్పిస్తున్న సిబ్బంది

రోడ్డు ప్రమాదాల్లో రక్తస్రావ నియంత్రణపై శిక్షణ

పోలీసులు, ఆటోడ్రైవర్లకు కిట్‌లు అందజేసిన ఆర్టీఏ అధికారులు

ప్రధాన రహదారుల్లో ప్రమాద బాధితులకు సత్వర సహాయం  

సాక్షి, సిటీబ్యూరో: ఇటీవల నగరశివార్లలోని దూలపల్లిలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో స్వరూప అనే మహిళ తీవ్రంగా గాయపడింది. వెంటనే అక్కడే ఉన్న ఆటోడ్రైవర్‌ నర్సింహ అప్రమత్తమై రక్తస్రావ నియంత్రణ చికిత్స అందజేశాడు. ఆ తర్వాత 108లో ఆ మహిళను ఆస్పత్రికి తరలించారు. మరో సంఘటనలోనూ కృష్ణయాదవ్‌ అనే ఆటోడ్రైవర్‌ అన్సారీ అనే రోడ్డు ప్రమాద బాధితుడికి రక్తస్రావ నియంత్రణ చికిత్సను అందజేసి ప్రాణాలను కాపాడాడు. చాలా వరకు రోడ్డు ప్రమాదాల్లో ఆస్పత్రికి తరలించేలోపే  తీవ్రంగా రక్తస్త్రావమై మృతి చెందుతున్నారు. ఇలాంటి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయ స్థితి నుంచి బాధితులను కాపాడడంలో రక్తస్రావాన్ని నియంత్రించడమే ఎంతో కీలకమైన అంశం. ఈ మేరకు  రవాణాశాఖ మేడ్చల్‌ జిల్లా యంత్రాంగం ప్రధాన రహదారుల్లో పోలీసులు, ఆటోడ్రైవర్‌లు, పెట్రోలు బంకుల సిబ్బంది, చిరువ్యాపారులు, తదితర వర్గాలకు రక్తస్రావ నియంత్రణలో శిక్షణకు శ్రీకారం చుట్టింది. జీవీకె,ఈఎంఆర్‌ఐ, రోడ్‌ సేఫ్టీ క్లబ్, పెడస్టర్, తదితర స్వచ్ఛంద సంస్థల సహకారంతో గురువారం నగరంలోని బోయిన్‌పల్లి– మేడ్చల్, అల్వాల్‌– శామీర్‌పేట్‌ రహదారుల్లో సుమారు 300 మంది ఆటోడ్రైవర్లు, పోలీసులు తదితర వర్గాలకు శిక్షణనిచ్చారు. ప్రమాద బాధితులను ఆదుకొనేందుకు రక్తస్రావాన్ని అరికట్టేందుకు అవసరమైన మెడికల్‌ కిట్‌లను అందజేశారు. మేడ్చల్‌ జిల్లా రవాణా అధికారి పుప్పాల శ్రీనివాస్‌ నేతృత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు  పాల్గొన్నారు.

స్పందిస్తే చాలు..
సాధారణంగా రహదారులపై ఆటోరిక్షాలు విరివిగా తిరుగుతాయి. పోలీసుల గస్తీ ఉంటుంది. రోడ్డు పక్కనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనేవాళ్లు ఉంటారు. కానీ ప్రమాదం జరిగిన వెంటనే ఏం చేయాలో చాలామందికి తెలియదు. కొంత గందరగోళం కూడా ఉంటుంది. వెంటనే 108 కు ఫోన్‌ చేస్తారు. కానీ అది వచ్చేలోపే తీవ్రమైన రక్తస్రావం జరిగి ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొంటుంది. సరిగ్గా ఈ సమయంలోనే  అప్రమత్తత అవసరం. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి  రక్తస్రావం జరగకుండా  చర్యలు తీసుకుంటే చాలు విలువైన ప్రాణాలు నిలబడుతాయి. ఇందుకోసం చేయాల్సిందల్లా  గాయాలకు పై భాగంలో ఒక రబ్బరుబ్యాండ్‌ వేయడం, గాయాలకు బ్యాండేజీ చేయడం. ఈ రెండు చిన్న చికిత్సల వల్ల రక్తస్రావం ఆగుతుంది.

ఈ క్రమంలో 108 లో ఆసుపత్రికి తరలించవచ్చు. ఇటీవల  ఒకరిద్దరు  ఆటోడ్రైవర్లు  ఇలాంటి సహాయ చర్యలు చేపట్టడంతో విలువైన ప్రాణాలు దక్కినట్లు  వైద్యులు గుర్తించారు. ఆ స్ఫూర్తితోనే ఈ  రక్తస్రావ నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా రవాణా అధికారి పుప్పాల శ్రీనివాస్‌  తెలిపారు. ప్రస్తుతం  300 మందికి  శిక్షణనిచ్చి, రక్తస్రావ నియంత్రణ కిట్‌లను అందజేశామని, త్వరలో 1000 మందికి శిక్షణనివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. రోడ్డు ప్రమాద బాధితులను కాపాడడం ప్రతి ఒక్కరు  తమ బాధ్యతగా  భావించాలని  కోరారు.‘కచ్చితమైన రహదారి భద్రతా నిబంధనలు పాటిస్తే చాలా వరకు రోడ్డు ప్రమాదాలకు దూరంగా ఉండవచ్చు. అనూహ్యమైన పరిస్థితుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులు మృత్యువాతపడకుండా రక్తస్రావ నియంత్రణ దోహదం చేస్తుందన్నారు.  కార్యక్రమంలో అధికారులు తదితరులు  పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు