'నిరక్షరాస్యతతోనే మూఢనమ్మకాలు'

1 Sep, 2015 17:32 IST|Sakshi

కొల్చారం (మెదక్ జిల్లా) : గ్రామాల్లో నిరక్షరాస్యతతోనే మూఢనమ్మకాలు ప్రబలి ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని మెదక్ డీఎస్పీ రాజారత్నం తెలిపారు. కొల్చారం మండలం వరిగుంతంలో గత ఆదివారం గ్రామస్థులు బాణామతి నెపంతో గ్రామానికి చెందిన దంపతులను పంచాయతీ పెట్టి బెదిరించి జరిమానా విధించారు. దీంతో బాధితులు పోలీస్టేషన్‌ను ఆశ్రయించారు. పంచాయతీ నిర్వహించిన గ్రామపెద్దలపై సోమవారం కొల్చారం ఎస్సై రమేష్‌నాయక్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. గ్రామంలో నెల క్రితం పోలీసుల ఆధ్వర్యంలో మూఢనమ్మకాలపై కళాజాత నిర్వహించారు. అయినా గ్రామంలో ప్రజలు మూఢనమ్మకాలను నమ్ముతుండడంతో మరోసారి ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యంతో మంగళవారం గ్రామంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. స్థానిక సర్పంచ్ లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన సదస్సుకు మెదక్ డీఎస్పీ రాజారత్నం హాజరయ్యారు. డీఎస్పీ సదస్సునుద్దేశించి మాట్లాడుతూ.. ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక రంగంలో అడుగిడుతున్న పరిస్థితుల్లో ప్రజల్లో మూఢనమ్మకాలు ఇంకా పెనవేసుకొని ఉండడం దురదృష్టకరమన్నారు.

సమాజంలో ఎక్కడా చేతబడి, బాణామతి లేదని మానసిక రోగాలకు లోనైన వ్యక్తుల కారణంగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. అనుమానం పెనుభూతం లాంటిదని.. ఇది నమ్మితే ఇబ్బందుల్లోకి వెళ్లడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా మహిళలు ఇలాంటివాటిని నమ్మడంతో ఆ కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయన్నారు. ప్రతి వ్యక్తి చదువుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం వల్ల ఇలాంటి ఘటనలు దూరమవుతాయన్నారు. అనారోగ్యం పాలైన వ్యక్తులు భూతవైద్యులను ఆశ్రయించకుండా ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకోవాలని సూచించారు. బాణామతి నెపంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దాడులకు, ఇతరత్రా వాటికి పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇకపై ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా గ్రామస్థులు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహశీల్దార్ నిర్మల మాట్లాడుతూ.. మూడనమ్మకాలను దరిచేరనివ్వద్దన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సీఐ రామక్రిష్ణ, ఎస్సై రమేష్‌నాయక్, గ్రామ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అడివప్ప, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు