ఎండ వేళ జర భద్రం

27 May, 2019 07:48 IST|Sakshi
ఎండలతో జనసంచారం లేక ఆదివారం నిర్మానుష్యంగా మారిన తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ మార్గం

గ్రేటర్‌లో అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలు

పొంచి ఉన్న వడదెబ్బ ప్రమాదం

జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి రుగ్మతలు సైతం

మరింత అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఎండలు మండిపోతున్నాయి. 43 నుంచి 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో సిటీజనులు అల్లాడుతున్నారు. ఎండలో బయటకు వెళ్లిన వారికి వడదెబ్బ ప్రమాదం పొంచి ఉంది. కొందరికి జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలతో అస్వస్థత కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో మనిషి శరీరం భరించలేని స్థాయిలో ఉష్ణోగ్రతలునమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఈ ఉష్ణోగ్రతలకు రేడియేషన్‌ తోడవుతుండంతో శరీరంలో పోటాషియం, సోడియం లెవల్స్‌ పడిపోయి త్వరగా వడదెబ్బకు     గురవుతుండటమే కాకుండా చర్మం నల్లగా వాడిపోతోంది. చర్మంపై చెమట పొక్కులు ఏర్పడుతున్నాయి. రకరకాల ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతుంది. ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల కింద కూర్చునప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. ఇదిలా ఉంటే వడదెబ్బ బారినపడి సిటీలో రోజుకు సగటున ఇద్దరు ముగ్గురు చనిపోతున్నారు. కానీ ఇది అటు జీహెచ్‌ఎంసీలో గానీ, కలెక్టరేట్‌లో గానీ రికార్డు కావడం లేదు. ఎండ తీవ్రత నేపథ్యంలో ఉదయం 9 గంటల తర్వాత అవసరమైతే తప్పా..ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే విధిగా గొడుగు, మంచినీళ్లు తీసుకెళ్లాలని చెబుతున్నారు. మండే ఎండల నేపథ్యంలో వైద్యుల సూచనలు కొన్ని....

పిల్లలకు మరింత ప్రమాదం
చిన్నారుల శరీరంలో 50 శాతం నీరే ఉంటుంది. ఎండ దెబ్బకు నీటి శాతం తగ్గడం వల్ల చిన్నారులకు వడదెబ్బకు గురవుతారు. తద్వారా తలనొప్పి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు. వేసవి సెలవుల కారణంగా ఆటపాటలు ఎక్కువవడం సహజం. దీనికి ఎండ తోడవడం వల్ల విపరీతమైన అలసటకు గురవుతారు. నీటి పరిమాణం ఎక్కువుండే పుచ్చకాయ, స్ట్రాబెర్రీ వంటివి అందించాలి. మధ్యాహ్నం సమయంలో నీడలో ఉండేలా చూడాలి. బ్రేక్‌ఫాస్ట్‌ తప్పనిసరిగా తీసుకునేలా చూడాలి. ఆహారంగా ఆమ్లెట్‌కు బదులు ఉడకబెట్టిన గుడ్డు, కోల్డ్‌ మిల్క్‌ వంటివి అందించాలి.  
– డాక్టర్‌ రాజన్న, చిన్నపిల్లల వైద్య నిపుణుడు

చెమట పొక్కులకు ఇలా చెక్‌
చెమటపొక్కుల్ని గోళ్లతో గిల్లడం వంటివి చేస్తే ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉంది. ఎండలకు సెగగడ్డలు అయ్యే అవకాశం ఎక్కువ. యాంటీ బ్యాక్టీరియల్‌ సోప్‌తో వీటిని శుభ్రం చేసుకోవాలి. గాఢమైన రంగులున్న దుస్తులు కాకుండా తేలికైన తెల్లని కాటన్‌ దుస్తులు ధరించాలి. పట్టినట్టుండే దుస్తులు కాకుండా వదులైన పలుచని దుస్తువులు వేసుకోవాలి. బయటికి వెళ్లేప్పుడు తలకు క్యాప్‌ అలవాటు చేసుకోవాలి. సాయంత్రం వేళలో చల్లటి నీటితో స్నానం చేయాలి. ఇంటి తలుపులు, కిటికీలకు గోనె సంచులను అమర్చి, వాటిని నీటితో తడపాలి. టూ వీలర్‌పై ప్రయాణిస్తే ముఖానికి రుమాలు చుట్టుకోవడం ఉత్తమం.      – డాక్టర్‌ సందీప్‌రెడ్డి, జనరల్‌ ఫిజీషియన్‌

ఐదు నుంచిఏడు లీటర్ల నీరు తాగాలి
వేసవిలో రోజుకు కనీసం ఐదు నుంచి ఏడు లీటర్ల నీరు తాగాలి. పోటాషియం, సోడియం లెవల్స్‌ పడిపోవడంతో వడదెబ్బకు గురవుతారు. మూత్ర విసర్జన సమయంలో భరించలేని మంటతో పాటు తీవ్ర జ్వరం వస్తుంది. వేడికి తట్టుకోలేక తాగే కూల్‌డ్రింక్స్‌ ఆరోగ్యాన్ని హరిస్తాయి. వీటిలోని ఫాస్పేట్‌ పదార్థంతో కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వీలున్నంత వరకూ వీటికి దూరంగా ఉండడమే మేలు. దాహం వేయకపోయినా నీళ్లు కొంచెం కొంచెం తాగడం వల్ల డీహైడ్రేషన్‌ భారీ నుంచి కాపాడుకోవచ్చు. కొబ్బరినీళ్లు, నిమ్మరసం, పుదీనారసం, మజ్జిగ, పుచ్చకాయ రసం వంటివి మంచినీళ్లకు ప్రత్యామ్నాయంగా ఉపకరిస్తాయి. ఇక మామిడి, సపోటా, బత్తాయి వంటి పండ్లు పోషకాలపరంగా ఉత్తమమైనవి.     – డాక్టర్‌ స్వప్నప్రియ

మసాల ఫుడ్డు వద్దే వద్దు
స్థూలకాయులు బరువు తగ్గించుకోవడం కోసం భోజనం మానేస్తుంటారు. తద్వారా జీవక్రియలు మందగిస్తాయి. తక్కువ పరిమాణంలో తేలికగా జీర్ణమయ్యే...ఇంట్లో తయారు చేసిన వేడివేడి ఆహారం తీసుకోవాలి. రోడ్ల వెంట దొరికే ఐస్‌లు, ఫ్రిజ్‌ వాటర్‌ తాగొద్దు. రోడ్ల వెంట దొరికే నిల్వ ఫ్రూట్‌ సలాడ్స్‌ వంటివి కూడా హానికరం. పాలు, పాల పదార్థాలతో తయారు చేసిన లస్సీలు కాకుండా ఉప్పు కలిపిన మజ్జిగ, నిమ్మరసం తాగాలి. ద్రవపదార్థాలు అధికంగా ఉండే పుచ్చ, కర్బూజా, ద్రాక్ష, మామిడి పండ్లు, ముంజలు వంటివి తీసుకోవాలి. రోడ్లు వెంట ఐస్‌తో తయారు చేసిన రంగు నీళ్లకు బదులు కొబ్బరి నీళ్లు తాగాలి. మసాలాలు ఉన్న ఆహారం వద్దు. తేలికగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి. వడదెబ్బ తగిలి సొమ్మసిల్లిన వ్యక్తులను కూర్చో బెట్టకూడదు. నీడకు తరలించి ఏదైనా నునుపైన బల్లపై కానీ మంచంపై కానీ పడుకోబెట్టాలి. నూలుతో తయారు చేసిన తడిగుడ్డతో ఒళ్లంతా తుడవాలి. స్పహలోకి వచ్చిన తర్వాత చల్లటి మంచి నీరు, సోడా, కోబ్బరి నీళ్లు, మజ్జిగ తాగించాలి.  – డాక్టర్‌ సందీప్‌గంటా, జనరల్‌ ఫిజీషియన్‌

మరిన్ని వార్తలు