ఆమడ దూరంలో!

19 Nov, 2018 16:58 IST|Sakshi

ఎవరికీ పట్టని రామగుండం 

పరిష్కారానికి నోచుకోని బీ-థర్మల్‌!

నిరుపయోగంగా వేలాది ఎకరాలు 

అసంపూర్తిగా రైల్వే వంతెన

అభివృద్ధికి నోచుకోని రామునిగుండాలు, పెద్దచెరువు 

సాక్షి, పెద్దపల్లి : రామగుండం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ప్రభుత్వాలు మారినా.. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో పట్టణవాసులు మా పరిస్థితి ఇంతేనా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీ-థర్మల్‌ పరిరక్షణతో పాటు నూతన విద్యుత్‌కేంద్రం ఏర్పాటు, బీపీఎల్‌ భూముల సమస్య,  రామునిగుండాలను పర్యాటక కేంద్రంగా మార్చడం, పెద్ద చెరువును మినీట్యాంక్‌ బండ్‌గా చేయడం.. అంతర్గాం టెక్స్‌టైల్‌ కార్మికుల సమస్యలు ఏళ్లకు ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోవడంలేదు.

విస్తరణకు నోచుకోని బీథర్మల్‌..
రామగుండం థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు (ఆర్‌టీపీపీ)ను అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి 1965 జూలై 19న శంఖుస్థాపన చేశారు. అప్పుడు రూ. 14.8 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత దీనిని జవహర్‌లాల్‌ నెహ్రూ థర్మల్‌ విద్యుత్తు కేంద్రంగా నామకరణం చేశారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎగిసిపడడంతో ఆంధ్రాలోనూ థర్మల్‌ విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేయాలని తలిచి విజయవాడ సమీపంలో నిర్మించతలపెట్టారు. దీంతో రామగుండం బి-థర్మల్‌ను 62.5 మెగావాట్లకు సరిపెట్టారు. ఆ తర్వాత బిథర్మల్‌ కేంద్రం విస్తరణకు నోచుకోలేదు. నేటి పాలకులు రామగుండంను విద్యుత్‌ హబ్‌గా మార్చుతామన్న హామీ కార్యరూపం దాల్చలేదు.

నిరుపయోగంగా వేలాది ఎకరాలు..
1994లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం బెంగళూరుకు చెందిన మారుబెని, తోషీబా, ఎలక్ట్రిక్‌ పవర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (జపాన్‌)లకు దశలవారీగా పనులు చేపట్టేందుకు ప్రాజెక్టును కట్టబెట్టారు. స్థానికంగా ఉన్న  ఏపవర్‌హౌస్‌ స్థలం 750 ఎకరాలతో పాటు మరిన్ని అవసరాల నిమిత్తం మరో 1,050 ఎకరాలను రైతుల నుంచి భూసేకరణ చేశారు. 520 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో రూ.2813.9 కోట్ల వ్యయంతో అంచనా రూపొందించి రూ. 150 కోట్ల వ్యయమంతో ప్రహరీ నిర్మాణాలు ఎకరాల విలువైన భూములు నిరుపయోగంగా ఉన్నాయి. 

ఎవరికీ పట్టని రాముని గుండాలు..
జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా గుర్తింపు పొందిన రామగుండం సమీపంలోని రామునిగుండాలను పర్యాటక కేంద్రంగా గుర్తించి అభివృద్ధి చేపట్టాల్సిన అవసరం ఉంది. స్థానికంగా రామునిగుండాలు ఉండడం, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు నిలయం కావడంతోనే ప్రపంచ దేశ, రాష్ట్ర చిత్రపటాలలో రామగుండంకు ప్రత్యేక పేరుంది.  రామునిగుండాలలో రామలక్ష్మణుడు సంచరించినట్లు ఆనవాళ్లుఉన్నాయి. కొండపై 108 గుండాలున్నాయి. గుట్టపై 200 ఫీట్ల లోతు, 50 ఫీట్ల వెడల్పుతో ఓలోయ ఉంది. లోయకు పైభాగాన ఉన్న బావిలో సీతాదేవి స్నానమాచరించిందని ప్రతీతి. రాముడు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు పాదముద్రికల స్థానంలో ఏర్పడిన గుంతలు గుండాలుగా మారి రామగుండంగా పేరువచ్చింది. 108 గుండాలలో అన్ని కాలాల్లో నీరు సమృద్ధిగా ఉండడం విశేషం. దీనిని ఆధ్యాత్మికంతో పాటు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవికూడా నాలుగు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. 

ఆమడదూరం పెద్ద చెరువు..
పట్టణంలోని 210 ఎకరాల విస్తీర్ణంలో నియోజకవర్గ పరిధిలోనే పెద్దచెరువు. ఇందులోకి ఎన్టీపీసీకి చెందిన బూడిద నీరు చేరుతుండడంతో పిచ్చి మొక్కలు, గుర్రపు డెక్క పెరగడంతో పాటు కార్పొరేషన్‌లోని వివిధ డివిజన్లలో సేకరించిన చెత్తను ఇందులో వేయడంతో చెరువు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయి కలుషితమవుతుంది. దీని కింద సుమారు రెండు వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనిని గడిచిన పాలకవర్గం మినీ ట్యాంకుబండ్‌గా ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ రాజకీయ వర్గ విభేధాలతో మరో చెరువును ఎంపిక చేశారు. దీంతో అభివృద్ధికి పుల్‌స్టాప్‌ పడింది.  

మరిన్ని వార్తలు