ఆయనేమైనా మోనార్కా!

27 Mar, 2015 00:34 IST|Sakshi
ఆయనేమైనా మోనార్కా!
  • తనను తాను నిజాం ఆఫ్ హైదరాబాద్‌గా భావిస్తున్నట్లుంది
  • జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్‌పై హైకోర్టు ఆగ్రహం
  • సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్ సోమేష్ కుమార్‌పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆయన మోనార్క్‌లా వ్యవహరిస్తున్నారని, తనను తాను నిజాం ఆఫ్ హైదరాబాద్‌లా భావిస్తున్నట్లుందని వ్యాఖ్యానించింది. ఆస్తి పన్ను చెల్లించలేదనే నెపంతో తమ విద్యుత్, నీటి కనెక్షన్లను జీహెచ్‌ఎంసీ తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలను గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.

    పన్ను చెల్లించలేదంటూ జీహెచ్‌ఎంసీ అధికారులు తమ ఇంటి విద్యుత్, నీటి కనెక్షన్‌ను తొలగించారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకురాగా, ఏకంగా తన దుకాణాన్ని సీజ్ చేశారని సుజాత కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం..  మీ కమిషనర్‌కు జీహెచ్‌ఎంసీ చట్టం గురించి తెలుసా? అతని చర్యలను చట్టం సమర్థించడం లేదన్న విషయమైనా తెలుసా? అంటూ జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ‘మీరు విద్యుత్, నీటి కనెక్షన్లు ఇవ్వరు. మీ పని కేవలం ఇళ్ల నుంచి చెత్త సేకరించడమే. మరి మీరు అందివ్వని సదుపాయాలను మీరెలా తొలగిస్తారు? మీరిస్తున్న పన్ను చెల్లింపు నోటీసులను రద్దు చేయాలి.

    ఇటువంటి చర్యలు ఇలానే కొనసాగితే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనేందుకు మీ కమిషనర్ సిద్ధంగా ఉండాలి.’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మార్చి 19న పన్ను చెల్లింపు నోటీసు జారీ చేసి, ఆ వెంటనే విద్యుత్, నీటి కనెక్షన్లను తొలగించారని తెలుసుకున్న ధర్మాసనం.. ‘మీ కమిషనర్ మోనార్క్‌లా వ్యవహరిస్తున్నారు. ఆయన్ను ఆయన నిజాం ఆఫ్ హైదరాబాద్‌గా భావిస్తున్నట్లున్నారు. అతని చర్యలు నిజాం సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి.’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. పిటిషనర్ల కేసులను తిరిగి పునఃపరిశీలించి, మళ్లీ నిర్ణయం తీసుకోవాలని, అలాగే సీజ్ చేసిన సుజాత షాపును తెరవాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది.

మరిన్ని వార్తలు