ఉపాధికి ఎసరు!

14 May, 2020 03:05 IST|Sakshi

పట్టణాల్లో 80%, ‘గ్రామీణం’లో 57% ఉద్యోగాలపై ఎఫెక్ట్‌ 

లాక్‌డౌన్‌ ప్రభావంపై అజీమ్‌ ప్రేమ్‌జీ వర్సిటీ సర్వే

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి, సుదీర్ఘ లాక్‌డౌన్‌ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు లేబర్‌ మార్కెట్‌పై తీవ్రస్థాయిలో పడింది. లాక్‌డౌన్‌ సందర్భంగా వివిధ వర్గాల జీవనోపాధి ఊ హించని స్థాయిలో చిన్నాభిన్నమైనట్టు అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ తాజా సర్వేలో వెల్లడైంది. ఈ ప్రభావం నుంచి చాలా నెమ్మదిగా కోలుకోవడంతో పాటు ఈ ప్రక్రియ బాధాకరంగా ఉంటుం దని అధ్యయనం పేర్కొంది. ప్రస్తుతం తీవ్రంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో తక్షణ సహాయ కార్యక్రమాలు లేవంది. లాక్‌డౌన్‌ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ అనియత, (ఇన్‌ఫార్మల్‌ సెక్టార్‌) తది తర రంగాల్లోని మూడింట రెండొంతుల మంది (67%) ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయినట్లు ఇందులో వెల్లడైంది. ఇది నగర, పట్టణ ప్రాంతాల్లో 80%గా, గ్రామీణ ప్రాంతాల్లో 57%గా ఉందని తేలింది. పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి లేదా ఇతర రూపాల్లో పనిచేస్తున్న ప్రతీ పది మందిలో 8 మంది (80%), గ్రామీణ ప్రాంతాల్లో పది మం దిలో ఆరుగురు (57%) తమ ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయినట్లు ఈ పరిశీలనలో వెల్లడైంది.

సర్వే చేశారిలా..: ఏప్రిల్‌ 13 నుంచి మే 9 వరకు బెంగళూరు అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ‘సెంటర్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ ఎంప్లాయిమెంట్‌’ఆధ్వర్యంలో పది పౌర సేవా, సా మాజిక సంస్థలతో కలసి బిహార్, ఢిల్లీ, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర (పుణే), ఒడిశా, రాజస్తాన్‌. పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 4 వేల మంది పై సర్వే నిర్వహించింది. ఆగాఖాన్‌ రూరల్‌ సపోర్ట్‌ ప్రోగ్రా మ్, సెంటర్‌ ఫర్‌ అడ్వకసీ అండ్‌ రీసెర్చీ, గౌరి మీడియా ట్ర స్ట్, పశ్చిమ్‌ బంగా ఖేత్‌ మజ్దూర్‌ సంఘ్, సెల్ఫ్‌ ఎంప్లాయిడ్‌ ఉమెన్స్‌ అసోసియేషన్, ప్రధాన్, సమాలోచన, సృజన్, వా గ్దారా సంస్థలు సర్వేలో పాలుపంచుకున్నాయి. 2020 ఫిబ్రవరిలో స్వయం ఉపాధి, తదితర రంగాల్లోని వారు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగం, ఉపాధి, వాటి ద్వారా సంపాదించే ఆదాయంతో, లాక్‌డౌన్‌ విధించాక ఉపాధి లేదా ఉద్యోగం, దాని ద్వారా పొందే ఆదాయంతో పోల్చి చూసినపుడు ఆయా అంశాలు ఈ సర్వేలో వెల్లడైనట్టు అజీమ్‌ ప్రేమ్‌జీ వర్సిటీ తెలిపింది. వివిధ రంగాలకు చెందిన వారిపై ఈ అధ్యయనం నిర్వహించారు.

సర్వేలో వెల్లడైన కీలక అంశాలు..
► వ్యవసాయేతర స్వయం ఉపాధి కార్మికులు ఇంకా ఉపాధిని పొందుతున్నా వారు సగటున వారం రోజులకు సంపాదించే ఆదాయం రూ.2,240 నుంచి రూ.218కు (90 శాతం తగ్గుదల) తగ్గింది.
► క్యాజువల్‌ కార్మికులు ఇంకా ఉపాధి పొందుతున్నా, వారి సగటు వారం ఆదాయం ఫిబ్రవరిలో రూ.940 నుంచి లాక్‌డౌన్‌లో రూ.495 (దాదాపు సగానికి) పడిపోయింది.
► నెలవారీ వేతనం పొందే కార్మికుల్లో 51 శాతం మందికి వేతనంలో తగ్గుదల లేదా అసలు జీతం లభించకపోవడమో జరిగింది.
► 45 శాతం కుటుంబాలు తమకు వారానికి సరిపడా నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు అవసరమైన నగదు అందుబాటులో లేదని వెల్లడించాయి.
► 74 శాతం కుటుంబాలు గతంలో కంటే తక్కువ ఆహారం తీసుకుంటున్నాయి.

ఈ సందర్భంగా చేసిన సూచనలు..
► వచ్చే 6 నెలల పాటు ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత విస్తరించి, ఇచ్చే రేషన్‌ను పెంచడంతో పాటు రేషన్‌కార్డులతో సంబంధం లేకుండా ప్రభావిత పేద వర్గాలందరికీ సహాయం అందేలా చూడాలి.
► ఒక్కో కుటుంబానికి నెలకు రూ.7 వేల చొప్పున (రెండు నెలల పాటు) వారి ఖాతాల్లోకి నగదు బదిలీ చేయాలి.
► ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను పెంచేందుకు పెద్దమొత్తంలో నగదు బదిలీలు చేయాలి.
► జాతీయ ఉపాధి హామీ పనులను (మనుషుల మధ్య దూరం పాటిస్తూ) వెంటనే పెంచాలి .
► జాతీయ ఉపాధి హామీ పథకం విస్తరణలో భాగంగా పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాలి. యూనివర్సల్‌ బేసిక్‌ సర్వీసెస్‌లో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరముంది. 

మరిన్ని వార్తలు