కాంగ్రెస్‌ను దూరంగా ఉంచితే మంచిది..   

3 Aug, 2018 13:26 IST|Sakshi
కేసముద్రం మండలం కోరుకొండపల్లిలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతున్న మంత్రి చందూలాల్‌ 

గిరిజన సంక్షేమ, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌

కోరుకొండపల్లిలో హరితహారం..

అయ్యగారిపల్లిలో కొత్త జీపీ ప్రారంభానికి హాజరు

కేసముద్రం(మహబూబాబాద్‌) : రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వలేని కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదని రాష్ట్ర గిరిజన సంక్షేమ సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ అన్నారు. గురువారం మండలంలోని కోరుకొండపల్లిలో ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో తాటివనంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కాంగ్రెస్‌పార్టీ కోర్టులకు వెళ్లినా చుక్కెదురవుతోందని అన్నారు.

సీఎం కేసీఆర్‌ ప్రజల సంక్షేమాన్ని కోరుకునే మనిషి అన్నారు. ప్రతి ఒక్కరూ నాటిన మొక్క నాది అనేభావంతో, ఒక కొడుకులా, బిడ్డలాగ చూసుకోవాలన్నారు. హాస్టళ్లలో ప్రతి విద్యార్థికి మొక్క ఇచ్చి, ఆ విద్యార్థి పేరు రాసుకుంటే బాధ్యతతో పెంచుతాడని చెప్పారు. పూల మొక్కలు, పండ్ల మొక్కలు పెంచాలని సూచించారు. అందరి ఆరోగ్యం కోసం ఈనెల 15 నుంచి కంటివెలుగు పథకానికి శ్రీకారం చుట్టి ప్రజలకు కంటి పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రికి గీతాకార్మికులు ఈత మొక్కలను బహూకరించారు.

అయ్యగారిపల్లిలో జీపీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి

కేసముద్రం మండలం ఇనుగుర్తి శివారు అయ్యగారిపల్లి కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటుకా గా, గురువారం ఇక్కడికి వచ్చిన మంత్రి అజ్మీరా చందూలాల్‌ జీపీ భవన్నాన్ని రిబ్బన్‌ కట్‌చేసి ప్రారంభించారు. మంత్రి సమక్షంలో స్పెషల్‌ఆఫీసర్‌గా విద్యాసాగర్, కార్యదర్శిగా అలీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో కేసీఆర్‌ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదన్నారు. అన్ని గ్రామాలు, తండాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడానికి సీఎం కేసీఆర్‌ నూతనంగా జీపీలను ఏర్పాటు చేశారని అన్నారు. అ నంతరం గ్రామస్తులు మంత్రిని, కలెక్టర్‌ను సన్మానించారు.

96లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం

జిల్లాలో నాలుగో విడతలో 96లక్షల మొక్కలను నాటడమే లక్ష్యమని కలెక్టర్‌ శివలింగయ్య అన్నారు. గురువారం కోరుకొండపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడో విడత వరకు జిల్లాలో 2కోట్ల 3లక్షల మొక్కలను నాటామన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ హరితహరంలో భాగస్వాములు కావాలని, నాటిన మొక్కలన్నింటినీ బతికించుకోవాలన్నారు.

ప్రజలసంక్షేమం కోసం సీఎం కృషి

రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ నిరంతరం కృషిచేస్తున్నారని మానుకోట ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు. గురువారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగా జీపీలను ఏర్పాటు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన భాద్యత అందరిపై ఉందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, నాటిన మొక్కను బతికించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ కోటిరెడ్డి, జేసీ దామోదర్‌రెడ్డి, డీఎఫ్‌వో కిష్టగౌడ్, డీఏవో చత్రునాయక్, జిల్లాఎక్సైజ్‌ అధికారి దశరథ్, ఎంపీపీ కదిర రాధిక, జెడ్పీటీసీ బండారు పద్మ, ఎంపీడీవో అరుణాదేవి, తహసీల్దార్‌ యోగేశ్వర్‌రావు పాల్గొన్నారు.

వర్షంతో అంతరాయం

ఇనుగుర్తి గ్రామ శివారు అయ్యగారిపల్లి నూతన గ్రామపంచాయతీని మంత్రి అజ్మీరా చందూలాల్‌ గురువారం ప్రారంభించిన తర్వాత సభాప్రాంగణంలో వేదిక పైనున్న వారు మాట్లాడుతుండగా వర్షం మొదలైంది. దీంతో టెంట్ల నుంచి వర్షపు దారలు జనంపై పడుతుండటంతో కొందరు లేచి పక్కకు వెళ్లగా, మరికొందరు అలాగే కూర్చున్నారు. వేదికపై మంత్రి కూర్చున్న చోట వర్షపునీరు టెంటు నుంచి దారగా పడుతుండటంతో మంత్రి కుర్చిని కాస్త పక్కకు జరిపారు. వర్షపు నీరు పడకుండా గొడుగు పట్టుకోవడంతో మంత్రి సభలో ప్రసంగించారు.

సీఎం పదవి కోసం కాంగ్రెస్‌ కొట్లాట : మంత్రి చందూలాల్‌

కొత్తగూడ(ములుగు) : ఎన్నికలు రాకముందే సీఎం పదవి కోసం కాంగ్రెస్‌ నాయకులు కొట్లాడుతున్నారని గిరిజన సంక్షేమ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీర చందూలాల్‌ అన్నారు. మారుమూల గ్రామాల్లో మంత్రి గురువారం మంత్రి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నూతనంగా ఏర్పడ్డ మొండ్రాయిగూడెం గ్రామ పంచాయతీని ప్రారంభించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల మాటలు నమ్మొద్దని, వారి మాటలు నమ్మితే నెలకో ముఖ్యమంత్రిని మార్చుకుంటారన్నారు. చిన్న గ్రామ పంచాయతీలతో గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ముందుకెళ్తున్నారని చెప్పారు. రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఏజెన్సీలో చిన్న చిన్న కారణాలతో అందని రైతుబంధు చెక్కులు తొందరలోనే పరిష్కరిస్తామన్నారు.

రూ.2.50లక్షలతో గుండంపల్లి నుంచి పాకాల వరకు బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. పాకాల శిఖంను ఆనుకుని ఉన్న రెవెన్యూ పట్టాలను ఫారెస్ట్‌ అంటూ తొలగించారని గుండంపల్లి గ్రామస్తులు మంత్రికి విన్నవించారు. మంత్రి స్పందిస్తూ విషయాన్ని కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు. మండలకేంద్రంలో నూతన మండల పరిషత్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనం తరం కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

జెడ్పీ చైర్‌పర్సన్‌ పద్మ, జెడ్పీటీసీ సభ్యురాలు దేశిడి అరుణ, వైస్‌ ఎంపీపీ పూల యాదగిరి, ఎంపీటీసీ సభ్యుడు బంగారి నారాయణ, తహసీల్దార్‌ తరంగిణి, ఎంపీడీఓ జయరాంనాయక్, టీఆర్‌ఎస్‌ నాయకులు నాగమల్లేశ్వర్‌రావు, ఈసం సమ్మయ్య, కొమ్మనబోయిన వేణు, విశ్వనాథం, సిరిగిరి సురేష్, శ్రీనివాస్‌రెడ్డి, వీరన్న, అజ్మీర్‌పాషా పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా