ఉన్నత చదువులకు వెళ్లి అనంతలోకాలకు...

27 Mar, 2014 04:30 IST|Sakshi

ఎల్లారెడ్డిపేట, న్యూస్‌లైన్: మండలంలోని కోరుట్లపేటకు చెందిన తాడ సంధ్యారాణి (20) బుధవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న ఆమె ఉదయం కళాశాలకు వెళ్లింది. అనంతరం కళాశాల భవనం నాలుగో అంతస్తు ఎక్కి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సంధ్యారాణిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందింది.  సంధ్యారాణి తండ్రి మల్లారెడ్డి ఆమె చిన్నతనంలోనే మృతిచెందాడు. మృతురాలికి సోదరుడు మహేందర్ ఉండగా తల్లి శోభారాణి ఇద్దరు పిల్లలను  కూలి పనులు చేస్తూ పోషించుకుంది.
 
 కొడుకును చదివించిన ఇంటర్ వరకు తల్లి  కూతురును మాత్రం కష్టపడుతూ ఉన్నత చదువులు చదివిస్తోంది. పదో తరగతి బొప్పాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన సంధ్యారాణి అత్యధిక మార్కులు సాధించి పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచింది. కూతురు చదువును మధ్యలో ఆపకుండా అప్పులు చేస్తూ ఉన్నత చదువులకోసం సంధ్యారాణిని ఆమె తల్లి హైదరాబాద్‌కు పంపించింది. ఇంటర్ పూర్తయిన తరువాత ఆమె జనరల్ కౌన్సిలింగ్‌లో ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ఫీజురియింబర్స్‌మెంట్ కింద సీటు సంపాదించింది. ఇంకో రెండేళ్లలో ఉన్నత చదువు పూర్తయి కూతురు మంచి ఉద్యోగం సంపాదిస్తుందని ఆశించిన ఆ తల్లికి దుఃఖమే మిగిలింది. అయితే సంధ్యారాణి కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగానే ఆత్మహత్య చేసుకుందని హైదరాబాద్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.
 
 కాగా ఫీజురియింబర్స్‌మెంట్ విషయంలో కళాశాల యాజమాన్యం సంధ్యారాణిని ఫీజుకోసం వేధించడంతోనే ఈ అఘాహిత్యానికి పాల్పడిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఉజ్వల భవిష్యత్తు ఉన్న సంధ్యారాణి మృతి వారి కుటుంబానికి తీరని లోటును మిగిల్చింది.  సంధ్యారాణి మృతివార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులతో పాటు సర్పంచ్ మౌలోజి సింహాద్రి, మాజీ సర్పంచ్ సుధాకర్‌రావు హైదరాబాద్‌కు వెళ్లారు.

మరిన్ని వార్తలు