‘పది’, ఇంటర్‌ ఫెయిల్‌.. రూ.3 లక్షల జీతం

8 May, 2019 08:02 IST|Sakshi
రొడ్డ వైకుంఠం

   పది, ఇంటర్‌ ఫెయిలై ఆటో డ్రైవర్‌గా జీవితం.. 

ఇంగ్లిష్, మ్యాథ్స్‌లో ట్యూషన్‌తో చదువుపై శ్రద్ధ

దుబాయిలో క్వాలిటీ మేనేజర్‌గా రూ.3 లక్షల వేతనం

పెద్దపల్లి: అతడు ఓ సామాన్య కుటుంబంలో పుట్టాడు.. అందరిలాగే సర్కార్‌ బడిలో చదువు కొనసాగించాడు. ఇంగ్లిష్, మ్యాథ్స్‌ సరిగా రాక ‘పది’, ఇంటర్‌లో ఫెయిల్‌ అయ్యాడు. పదే పదే అవే సబ్జెక్టులు తప్పాడు.. ఫెయిల్‌ అయ్యానని ఏనాడూ కుంగిపోలేదు. జీవితంలో ఎదగాలనే లక్ష్యాన్నీ మరువలేదు. తనకు నచ్చని సబ్జెక్టులోనే పట్టు సాధించాలనుకున్నాడు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ ట్యూషన్‌కు వెళ్లాడు.. ఫెయిలైన సబ్జెక్టులనే తనకు ఇష్టమైనవిగా మార్చుకుని సక్సెస్‌ అయ్యాడు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా నెలకు రూ.3 లక్షల వేతనంతో పనిచేస్తూ జీవితంలో డిస్టింక్షన్‌లో పాస్‌ అయ్యాడు పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ మండలం లొంకకేసారం గ్రామానికి చెందిన రొడ్డ వైకుంఠం.

నిన్నటితరం యువకులతోపాటు రేపటితరం విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన వైకుంఠం సక్సెస్‌పై ఆయన మాటల్లో.. ‘మాది కమాన్‌పూర్‌ మండలం లొంకకేసారం. అమ్మ మార్తమ్మ, నాన్న పేరు నారాయణ. మేము ముగ్గురం అన్నదమ్ములం. నేనే ఇంట్లో చిన్నవాడిని నాన్న వ్యవసాయం చేస్తూ మమ్మల్ని పెంచాడు. పెద్దన్న భద్రయ్య సింగరేణి ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నన్న హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. నేను 5వ తరగతి వరకు గ్రామంలోనే చదువుకున్నా. 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు కమాన్‌పూర్‌ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న. 1986 వార్షిక పరీక్షల్లో మ్యాథ్స్‌లో ఫెయిల్‌ అయ్యాను. తర్వాత రెండుసార్లు సప్లిమెంటరీ రాసి టెన్త్‌ పాస్‌ అయ్యాను. ఫెయిలైన తర్వాత పెద్దన్న కొన్న ఆటో నడిపించాను.

నాకు జీవితంలో బాగా ఎదగాలని, ఉన్నత స్థానంలో ఉండాలనే ఆకాంక్ష ఉండేది. అందుకే ఫెయిల్‌ అయినా చదువు ఆపాలనుకోలేదు. ఆటో నడుపుతూనే గోదావరిఖని జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదివాను. 1989 పరీక్షలు రాసి ఫెయిల్‌ అయ్యాను. నా లక్ష్యం అన్నయ్యలకు చెప్పడంతో ఆటో నడపడం మానేసి చదువుకోమని సూచించారు. చదువుకుంటేనే బాగుపడుతావని వారు ప్రోత్సహించారు. అయినా.. ఆటో నడుపుతూ నేను వీక్‌గా ఉన్న సబ్జెక్టులు ఇంగ్లిష్, మ్యాథ్స్‌ ట్యూషన్‌కు వెళ్లాను. అలా రెండు సబ్జెక్టుల్లో పట్టుసాధించి ఇంటర్‌ పాస్‌ అయ్యాను. 1989లో ఎంసెట్‌ కోచింగ్‌ తీసుకుని ర్యాంక్‌ సాధించాను. 1990లో వరంగల్‌ కిట్స్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌లో చేరాను.

ఇంగ్లిష్‌ మాట్లాడడానికి ఇబ్బంది..
ఇంజినీరింగ్‌లో చేరినా.. ఇంగ్లిష్‌ సబ్జెక్టులో ట్యూషన్‌కు వెళ్లినా మాట్లాడడం మాత్రం రాలేదు. కాలేజీలో ఇంగ్లిష్‌లో మాట్లాడాలంటే ఇబ్బంది పడేవాడిని. ఎలాగైనా తోటి విద్యార్థుల్లా నేనూ ఇంగ్లిష్‌ మాట్లాడాలని పట్టుసాధించేందుకు స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కోచింగ్‌ తీసుకున్న. అందరితో మాట్లాడడం ప్రారంభించి సక్సెస్‌ అయ్యాను. 1994లో బీటెక్‌ పూర్తిచేశాను. అప్పటికే రాదనుకున్న ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడడం వచ్చింది.

ఇంజినీరింగ్‌ అయిన ఏడాదికే ఉద్యోగం..
కిట్స్‌ కాలేజీ రాష్ట్రంలోని టాప్‌ కాలేజీల్లో ఒకటి. దీంతో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఏడాదికే 1995లో మలేషియా కంపెనీ నుంచి ఇంటర్వ్యూకు లెటర్‌ వచ్చింది. ఇంటర్వ్యూ సక్సెస్‌ కావడంతో ఉద్యోగం వచ్చింది. అందులో పనిచేస్తూనే 2008లో ఎరెన్‌కో గ్రూప్‌ తలపెట్టిన ఇంటర్వ్యూకు వెళ్లి సెలక్ట్‌ కావడంతో దుబాయికి వెళ్లాను. దుబాయిలోనూ యూనియన్‌ రేబర్‌ కంపెనీ ఇచ్చిన ఆఫర్‌తో అందులో చేరి ప్రస్తుతం క్వాలిటీ మేనేజర్‌గా పనిచేస్తున్నా.

నా జీవితంలో ఎన్నోసార్లు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నా. జీవితంపై విరక్తి చెందిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొద్దిగా శ్రమిస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చనే అన్నయ్యల మాటలతో స్ఫూర్తి పొంది నేడు ఈ స్థాయికి చేరుకున్నా. టెన్త్‌ ఫెయిల్‌ అయినప్పుడే చదువుపై ఆసక్తి చంపుకుంటే ఇంటర్‌లో చేరేవాణ్ని కాదు.. ఇంటర్‌ ఫెయిల్‌ అయినప్పుడు ఆటోడ్రైవర్‌గా స్థిరపడితే ఇంజినీరింగ్‌ చేసేవాన్ని కాదు. అబుదాబి అవకాశం దక్కేది కాదు.. వీటన్నింటికి సమాధానం పట్టుదల.. ఓడినా కుంగిపోకుండా కష్టపడడం.

మరిన్ని వార్తలు