అనారోగ్యం ‘మస్తు’

26 Mar, 2020 01:45 IST|Sakshi
బుధవారం ఉగాది వేడుకల్లో పాల్గొన్న మంత్రి అల్లోల, ప్రభుత్వ సలహాదారు రమణాచారి

ప్రజలు జాగ్రత్తలు పాటించాలి

ఆర్థిక మాంద్యమున్నా.. రాష్ట్రం బయటపడుతుంది

వర్షాలకు ఢోకా లేదు.. పంట దిగుబడుల వెల్లువ

బాచంపల్లి సంతోష్‌కుమారశాస్త్రి పంచాంగ పఠనం

సాక్షి, హైదరాబాద్‌: ‘ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ బారి నుంచి త్వరగా కోలుకునేందుకు ప్రజలు సమష్టిగా ముందడుగు వేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను పాటిస్తే ఈ భయంకర సమస్య నుంచి బయటపడతాం. ప్రభుత్వ సూచనలే కాదు, పంచాంగం కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. కొత్త ఏడాదిలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వికారి నామ సంవత్సరం పోతూపోతూ ‘కరోనా’ వికారాన్ని అంటగంటి వెళ్లింది. కొత్త ఏడాది మార్చి 30 నుంచి మే 4 వరకు మకరరాశిలో కుజుడు, శని, గురువు సంచారం ఉంది. ఒకే రాశిలో మూడు గ్రహాల సంచారం వల్ల ఘోర ఫలితాలు ఎదురుకావచ్చు’ అని ప్రముఖ పౌరాణికులు బాచంపల్లి సంతోష్‌కుమారశాస్త్రి అన్నారు.

శ్రీ శార్వరి నామ సంవత్సరం కాలసర్పయోగంతో మొదలైందని, అటువంటి యోగాలు ఈ ఏడాదిలో 6 ఉన్నందున ప్రజలకు ఆరోగ్యపర ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అయితే, జాగరూకతతో వ్యవహరిస్తే సమస్యల నుంచి బయటపడవచ్చన్నారు. శార్వరి నామ ఉగాది వేడుకలు బుధవారం ఉదయం దేవాదాయశాఖ కమిషనర్‌ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆంక్షలు ఉండటంతో సాధారణ ప్రజలు, మీడియా ప్రతినిధుల హాజరు లేకుండా దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ సమక్షంలో అర్చకులు, ఇతర అధికారుల మధ్య వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పంచాంగం ప్రకారం ఈ ఏడాది యోగఫలాల వివరాలు బాచంపల్లి మాటల్లోనే..

ఈ ఏడాది వానలే వానలు..
ఈ ఏడాది వానలు బాగా కురుస్తాయి. రైతాంగానికి మేలు కలుగుతుంది. సంవర్త పేరుతో మేఘాలు ఉన్నందున మూడు కుంచాల వాన కురుస్తుందని పంచాంగం చెబుతోంది. ఎరుపు నేలలు, ఎరుపు రంగు పంటలు లాభిస్తాయి. అరేబియా, హిందూ మహా సముద్రాల్లో అల్పపీడనాలు, ద్రోణులు ఏర్పడటంతో భారీ వర్షాలు, అడపాదడపా భూకంపాలు సంభవిస్తాయి. ఆషాఢంలోనూ ఈసారి వానలు కురుస్తాయి. ఆగస్టు, సెప్టెంబరుల్లో దక్షిణ భారతంతో పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదలు వస్తాయి. చెన్నైలో భారీ వానలు కురుస్తాయి. హైదరాబాద్‌లో మంచి వానలుంటాయి. కాళేశ్వరం ఫలితాలు రాష్ట్రమంతా అందే అవకాశం ఉంటుంది. నవంబరు 20 నుంచి డిసెంబరు 1 వరకు తుంగభద్ర నదీ పుష్కరాలు.. ఈయేడు ఐదు గ్రహణాలు ఏర్పడుతున్నా, దేశంలో రెండు మాత్రమే ప్రభావవంతంగా ఉంటాయి. అందులో జూన్‌ 21 ఆదివారం ఉదయం 10.15 నుంచి మధ్యాహ్నం 1.44 వరకు చూడామణి కంకణ సూర్యగ్రహణం ఉంటుంది. 

మాంద్యమున్నా రాష్ట్రం నెట్టుకొస్తుంది..
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావం ఉన్నా.. మన దేశం, మన రాష్ట్రం విజయవంతంగా నెట్టుకొస్తాయి. ఈ సంవత్సరం మన దేశ సర్వ ఆదాయం 105, సర్వ వ్యయం 96. మిగులు 9. దానితోనే కేంద్ర, రాష్ట్రాలు నెట్టుకురావాలి. ప్రణాళికాబద్ధ ఆర్థిక విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ప్రజలకందే కొన్ని సబ్సిడీలు దూరమవుతాయి. ఆర్థిక మాం ద్యం దృష్ట్యా ప్రజలు పొదుపు మంత్రం పాటించాలి. ఆర్థిక క్రమశిక్షణతోనే మేలు కలుగుతుంది. తరచూ జాతీయస్థాయి విపత్తులు సంభవిస్తాయి. ధరలు పెరుగుతాయి. శని రసాధిపతిగా ఉన్నందున పెట్రోలు, డీజిల్‌ ధరలు తారస్థాయికి చేరుతాయి. బ్యాంకులపై ప్రజలకు నమ్మకం సడలుతుంది. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుకు ఈ సంవత్సరం కత్తిమీద సామే.. ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలి. విద్యారంగంలో సాధారణ ఫలితాలుం టాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదమ్ముల్లా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండటం ప్రజలకు మేలు చేస్తుంది. క్రీడారంగం, మిలిటరీలో ఉత్సాహం అంతంతే.

ఈ ఏడాది 384 రోజులు.. 13 నెలలు
ఈయేడు నవ నాయకుల్లో నాలుగు శుభగ్రహాలకు, ఐదు పాపగ్రహాలకు ఆధిపత్యం వచ్చింది. ఉగాది బుధవారం వచ్చినందున బుధుడు రాజుగా ఉంటాడు. బుద్ధిమంతు డు, యుక్తాయుక్త వివేచన కలవాడు రాజుగా ఉండేం దుకు అవకాశం కలుగుతుంది. రియల్‌ఎస్టేట్‌ రంగం హైదరాబాద్‌లో కొత్తపుంతలు తొక్కుతుంది. శాంతిభద్రతలు బాగుంటాయి. సేనాధిపతి రవి అయినందున ప్రజలకు రక్షణ అందించేందుకు పోలీసు శాఖ బాగా పనిచేస్తుంది. మీడియా ఇబ్బందులు, ఆర్థికచిక్కులతో అతలాకుతలం కాక తప్పదు. సంక్షేమ శాఖలు, పరిశోధన రంగాల్లో మంచి ఫలితాలుంటాయి. ఓ ప్రఖ్యా త కళాకారుడు మృత్యువాత పడతారు. శార్వరి నామ సంవత్సరంలో 384 రోజులుంటాయి. ఆశ్వయుజ మాసం అధికమాసంగా వచ్చినందున 13 నెలలుంటా యి. ఈ సంవత్సరం దైవం భాస్కరుడు. ప్రజలు సూర్యోదయా న్ని, చంద్రోదయాన్ని చూడటం అలవాటు చేసుకోవాలి. ఆదివారం మాంసాహారాన్ని మానితే ఆరోగ్యానికి మేలు.

మనో సంకల్పం నెరవేరుతుంది..
కేసీఆర్‌: కర్కాటకం
ఆదాయం–11, వ్యయం–8
రాజపూజ్యం–5, అవమానం–4

గ్రహస్థితి రీత్యా మిశ్రమ ఫలితాలున్నా వ్యక్తిగత జాతకరీత్యా పరిస్థితి అనుకూలంగా మారుతుంది. ప్రస్తుతం రాహు మహాదశ కొనసాగుతోంది. సూర్యుడి స్థితి దాటుతున్నందున మనో సంకల్పం నెరవేరుతుంది. జూలై నుంచి అక్టోబరు వరకు ముఖ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తు ప్రణాళికలకు అనుకూల సంవత్సరం.

గతంలో కంటే అనుకూల ఫలితాలు
మోదీ: వృశ్చికం
ఆదాయం–5, వ్యయం–5 
రాజపూజ్యం–3, అవమానం–3

మిశ్రమ ఫలితాలుంటాయి. అయితే, శని బాగా యోగిస్తున్నాడు.  గురువు కొద్దికాలం మాత్రమే యోగించటం, రాహుకేతువులు అనుకూలంగా లేనందున విజయం కోసం కష్టపడాలి. గతేడాది కంటే అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. శని మూడో స్థానంలో ఉన్నందున చేపట్టిన పనిలో విజయం సా«ధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

మరిన్ని వార్తలు