ఏందీ..వాసన..!

3 Apr, 2018 08:56 IST|Sakshi

హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో విషవాయువుల ప్రభావం

మండుటెండలకు వెలువడుతున్న విషవాయువులు  

దుర్వాసనతో సాగర్‌ పరిసరాలకు వెళ్లలేని పరిస్థితి

కొద్దిసేపు అక్కడే గడిపితే తలనొప్పి, వాంతులు,కళ్లు తిరగడం వంటి రుగ్మతలు

గుట్టలుగా పోగుపడిన ఘన, ప్లాస్టిక్‌ వ్యర్థాలు

నీటిలో ఆక్సిజన్‌ శాతం సున్నా ప్రహసనంగా మారినక్లీనింగ్‌ ప్రక్రియ

‘మిషన్‌ హుస్సేన్‌ సాగర్‌’కు బాలారిష్టాలు

ఒకప్పుడు స్వచ్ఛమైన జలాలతో అలరారిన చారిత్రక హుస్సేన్‌సాగర్‌ గరళ కాసారంగా మారింది. మండుటెండలో సాగర తీరాన సేదదీరేందుకు నెక్లెస్‌ రోడ్‌కు వచ్చేవారికి సాగర్‌ నుంచి వచ్చే దుర్వాసన స్వాగతం పలుకుతోంది. దీంతో కొందరు తలనొప్పి, వాంతులు, కళ్లు తిరగడం వంటి సమస్యలతో సతమతమవుతుండడం పరిపాటిగా మారింది. ఇప్పటికే ఘనవ్యర్థాలు, గుర్రపుడెక్కతో సాగరజలాలు నిండిపోయాయి. ఇందులోని బ్యాక్టీరియా..కూకట్‌పల్లి, బాలానగర్‌ నాలా ద్వారా చేరుతున్న పారిశ్రామిక రసాయన వ్యర్థజలాల్లోని సల్ఫేట్‌ను గ్రహిస్తుండడంతో రసాయనిక చర్య జరిగి ‘హైడ్రోజన్‌ సల్ఫేట్‌’ వాయువు పెద్ద మొత్తంలో వెలువడుతోంది. ఈ దుర్వాసనకు ఇదే కారణమని నిపుణులు తేల్చారు. ప్రస్తుతం జలాశయం నీటిలో కరిగిన ఆక్సిజన్‌ శాతం సున్నాకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మండుటెండలకు ఈ వాయువు తీవ్రత మరింత పెరుగుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరో వైపు సాగర్‌ ప్రక్షాళన పేరిట వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం లేదు.

సాక్షి, సిటీబ్యూరో: హుస్సేన్‌సాగర్‌ జలాల్లోకి కూకట్‌పల్లి నాలా రసాయన వర్థాలు కలవకుండా ఉండేందుకు నాలా మళ్లింపు పనులను పూర్తిచేసినట్లు ఆర్భాటంగా ప్రకటించిచారు. కానీ ఈ నాలా నుంచి పారిశ్రామిక వ్యర్థాలు జలాశయంలోకి నేటికీ చేరుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు దశాబ్దాలుగా బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీలు వెదజల్లిన గరళాన్ని తన గర్భంలో దాచుకుని.. జలాశయం అట్టడుగున గడ్డకట్టుకుపోయిన ఘన వ్యర్థాల తొలగింపు పనులను తాత్కాలికంగా నిలిపివేయడంతో ప్రక్షాళనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తరుణంలో జలాశయం ఉపరితల భాగంలో తెట్టులా పేరుకున్న వ్యర్థాల తొలగింపునకు విదేశాల్లో వినియోగించే ఎనిమిదికాళ్ల ఎక్స్‌కవేటర్‌ను ప్రక్షాళనకు వినియోగిస్తున్నప్పటికీ ఇవన్నీ పైపై మెరుగులేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. జలాశయం ప్రక్షాళన పర్వంలో ప్రస్తుతానికి సాధించింది గోరంతేనని.. చేయాల్సిన పనులు కొండంత ఉన్నాయని పర్యావరణ వాదులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం పీవీ జ్ఙానభూమి నుంచి కిమ్స్‌ ఆస్పత్రి మార్గంలో సాగరజలాల్లో ఘన వ్యర్థాలు గుట్టలుగా పోగుపడడం ప్రస్తుతం సాగర్‌ దుస్థితికిఅద్దంపడుతోంది.

మిషన్‌ హుస్సేన్‌సాగర్‌లోచేపట్టాల్సినవి..
జలాశయం నీటిని ల్యాండ్‌ స్కేపింగ్, గార్డెనింగ్‌ అవసరాలకు వాడుకునే స్థాయిలో నీటి నాణ్యతను మెరుగుపరచాలి. సాగర్‌లోకి ఘనవ్యర్థాలు చేరకుండా చర్యలు చేపట్టాలి. దశాబ్దాలుగా జలాశయం అడుగున బెడ్‌లా ఏర్పడిన ఘన వ్యర్థాలను డ్రెడ్జింగ్‌ ప్రక్రియ ద్వారా తొలగించాలి. నాలుగు నాలాల నుంచి చేరుతున్న మురుగునీటిని దారి మళ్లించడం తప్పనిసరి. జలాశయం, దాని పరిసరాల్లో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలి. హుస్సేన్‌సాగర్‌ వద్దనున్న 20 ఎంఎల్‌డీ ఎస్టీపీ అధునికీకరణతో పాటు సామర్థ్యం పెంచాలి. హుస్సేన్‌సాగర్‌ చుట్టూ రింగ్‌ సీవర్‌ మెయిన్స్‌ నిర్మించి మురుగునీరు జలాశయంలో చేరకుండా చూడాలి. శుద్ధిచేసిన నీరు మాత్రమే జలాశయంలోకి ప్రవేశించే ఏర్పాటు చూడాలి. జలాశయంలో ఆక్సిజన్‌ శాతం పెంచేందుకు ఏరియేషన్‌ వ్యవస్థ ఏర్పాటు తప్పనిసరి.

స్వచ్ఛ‘సాగర’ం దిశగా..
హుస్సేన్‌ సాగర్‌ను స్వచ్ఛంగా మార్చే దిశగా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాన్నివ్వలేదు. కెనడాకు చెందిన ఎజాక్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఎల్‌ఎల్‌పీ ఆధునిక సాంకేతికతతో  జలాశయంలో ఆక్సిజన్‌ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు గతేడాది మార్చిలో ప్రయోగాత్మకంగా ఓ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా  శాటిలైట్‌ సహాయంతో మైక్రోవేవ్స్‌ను నీటిలోకి పంపించారు. దీంతో నీటిలో ఆక్సిజన్‌ మోతాదు పెరుగుతుందని.. తద్వారా సాగర గర్భంలో ఉన్న నైట్రేట్, పాస్పేట్‌ వంటి మూలకాలు ఉపరితలంపైకి వచ్చి ఆల్గేగా ఏర్పడుతాయని ఆర్భాటంగా ప్రకటించారు. ఈ ఆల్గేను దశలవారీగా తొలగించడం ద్వారా నీటి నాణ్యత మెరుగుపడుతుందనీ చెప్పారు. కానీ ఈ ప్రయోగం విఫలమవడంతో నెలరోజుల క్రితమే ఈ పనుల నుంచి ఎజాక్స్‌ కంపెనీ తప్పుకున్నట్లు తెలిసింది.

మరోసారి హెచ్‌ఎండీఏ సన్నద్ధం..
కాలుష్యంతో నిండిన హుస్సేన్‌సాగర్‌ను స్వచ్ఛంగా మార్చేందుకు హెచ్‌ఎండీఏ మరోసారి సన్నద్ధమవుతోంది. అత్యాధునిక పరిజ్ఞానంతో ఆరు నెలల నుంచి ఏడాదిలోపు మార్పు కనిపించేలా సాంకేతిక చికిత్స అందజేసేందుకు ముందుకు రావాలంటూ గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించింది. దాదాపు ఎనిమిది అంతర్జాతీయ కంపెనీలు బిడ్‌ దాఖలు చేశాయి. ఆయా కంపెనీల అనుభవం, పనితీరును బట్టి త్వరలోనే ఫైనల్‌ చేస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా జలమండలి సీఐపీపీ సాంకేతిక పరిజ్ఞానంతో తెలుగుతల్లి ఫైఓవర్‌ నుంచి ఎన్టీఆర్‌ గార్డెన్‌ వరకు భారీ మురుగునీటి పైప్‌లైన్‌ మరమ్మతు పనుల వల్ల నేరుగా మురుగునీరు, రసాయన కారకాలు సాగర్‌లో కలుస్తుండడంతో మురికి కూపంగా మారడం గమనార్హం. దీనివల్ల డీఓ (కరిగిన ఆక్సిజన్‌) తగ్గి, బయాలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (బీఓడీ) డిమాండ్‌ పెరిగిపోయినట్టుగా స్పష్టమవుతోంది.  

సాగర మథనం సాగుతోందిలా..
ప్రధానంగా కలుస్తోన్న నాలాలు: కూకట్‌పల్లి, పికెట్, బుల్కాపూర్, బంజారా నాలా
ప్రక్షాళనకు తీసుకున్న చర్యలు: 2006లో రూ.270 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం, ఘన వ్యర్థాల తొలగింపు
2014లో: రూ.56 కోట్లతో కూకట్‌పల్లి నాలా డైవర్షన్‌ పనులు
2015: జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఎనిమిదికాళ్ల ఎక్స్‌కవేటర్‌తో వ్యర్థాలు తొలగింపు
2017: హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో సాగర జలాల్లో ఆక్సిజన్‌ శాతాన్ని పెంచేందుకు కెనడాకు చెందిన ఎజాక్స్‌ కంపెనీ శాటిలైట్‌ ఆధారిత టెక్నాలజీ వినియోగం (ఈ ప్రయోగాన్ని ఉచితంగానే చేశారు)
ప్రక్షాళనకు దశాబ్దకాలంలో చేసిన వ్యయం: సుమారు రూ.326 కోట్లు

>
మరిన్ని వార్తలు