నేటి నుంచే బడిబాట

14 Jun, 2019 09:00 IST|Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి ఈ నెల 19 వరకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేశారు. ఐదు రోజుల పాటు రోజుకో కార్యక్రమాన్ని చేపట్టి సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా బడిబయటి పిల్లల్ని బడిలో చేర్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించడం, పాఠశాలలను శుభ్రపర్చుకోవడం, తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఐదు రోజుల పాటు జిల్లాలోని ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు,  అధికారులను కార్యక్రమంలో భాగస్వామ్యం చేయనున్నారు.

డ్రాపౌట్‌ తగ్గించడమే లక్ష్యం..
బడియట ఉన్న పిల్లల్ని బడిలో చేర్పించేందుకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 709 మంది పిల్లలు బడిబయట ఉన్నారు. వీరిలో 453 మంది బాలురు, 256 మంది బాలికలు ఉన్నట్లు పేర్కొంటున్నారు. అయితే ఈ కార్యక్రమం జూన్‌ 4 నుంచి 12 వరకు నిర్వహించాల్సి ఉండగా, జిల్లాలో ఎండ తీవ్రత కారణంగా పాఠశాలలకు 11 వరకు సెలవులు పొడిగించిన విషయం విధితమే. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 14 నుంచి 19 వరకు చేపట్టనున్నారు. కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రంలో ఐదేళ్లు నిండిన పిల్లల్ని పాఠశాలల్లో చేర్చడం, 5వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులను ప్రాథమికోన్నత పాఠశాలలు, 7వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో చేర్పించడం, ఎన్‌రోల్‌మెంట్‌ తక్కువ ఉన్న పాఠశాలలను గుర్తించి విద్యార్థుల తల్లిదండ్రులకు సర్కారు బడుల గురించి వివరించి విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా బాలికల విద్య ప్రాముఖ్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి అనాథ పిల్లల్ని కేజీబీవీ, అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చేర్పించే కార్యక్రమాలను చేపట్టనున్నారు.

సర్కారు బడులను కాపాడుకునేందుకు..
ఆదిలాబాద్‌ జిల్లాలో 1,287 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 970 ప్రాథమిక పాఠశాలలు, 122 ప్రాథమికోన్నత పాఠశాలలు, 195 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 94,737 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే జిల్లాలో దాదాపు 50 పాఠశాలల్లో పది కంటే విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్నారు. జీరో ఎన్‌రోల్‌మెంట్‌ స్కూళ్లు దాదాపు 10 వరకు ఉన్నాయి. ఆదిలాబాద్‌ పట్టణంలోనే ఐదు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఆ పాఠశాలలు మూతపడ్డాయి. ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ప్రభుత్వ పాఠశాలలను రక్షించేందుకు బడిబాట కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యతోపాటు పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫాం, తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్తున్నారు.

రోజువారీగా కార్యక్రమాలు..
మొదటి రోజు(14న): మన ఊరు–మన బడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆవాసా ప్రాంతంలో బడిబాట కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ర్యాలీలు, కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహిస్తారు. పాఠశాల విద్యాకమిటీ, ఉపాధ్యాయులతో కలిసి వార్షిక ప్రణాళిక తయారు చేస్తారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు తీర్మానాలు చేస్తారు.

రెండో రోజు(15న): బాలికల విద్య, ఆరోగ్య పరిరక్షణ కోసం పంపిణీ చేయబడుతున్న ఆరోగ్య కిట్ల గురించి విద్యార్థినులకు అవగాహన కల్పిస్తారు. కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో విద్యార్థినుల తల్లిదండ్రులను పిలిచి సౌకర్యాల గురించి తెలియజేస్తారు. పాఠశాలల్లో బాలికల విద్యపై తీసుకోనున్న మార్షల్‌ ఆర్ట్, జీవన నైపుణ్యాలు, ప్రత్యేక అవసరాలు గల బాలికలకు స్టైఫండ్, తదితర వాటి గురించి వివరిస్తారు. మహిళ అధికారులను పిలిచి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

మూడో రోజు(17న): చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తారు. పాఠశాలల్లో పండగ వాతావరణం కల్పించడం, ఉన్నత పాఠశాలల్లో నూతనంగా చేరిన పిల్లల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహిస్తారు. బడిబాట ప్రాధాన్యత, చదువు విశిష్టత తెలియజేసే సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతారు.
నాలుగో రోజు(18న): పాఠశాలల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం, నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలను ఉపాధ్యాయులు, విద్యార్థులకు అప్పజెప్పడం. పాఠశాల ప్రాంగణాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం, వాటర్‌ ట్యాంక్‌ శుభ్రపర్చుకోవడం, తరగతి గదిలో వృథా సామగ్రిని తొలగించడం, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఐదవ రోజు(19న): బడిబయట ఉన్న పిల్లల్ని బడిలో చేర్పించడం. టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ద్వారా బాల కార్మికులను విముక్తి చేయడం, పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులను పాఠశాలకు మర్యాద పూర్వకంగా ఆహ్వానించి వారి సేవలను స్వచ్ఛందంగా పాఠశాలకు వినియోగించుకోవడం. విద్యార్థుల తల్లిదండ్రులు, యాజమాన్య కమిటీల సమావేశం నిర్వహించడం. ఇంటింటికి తిరుగుతూ పిల్లల్ని బడిలో చేర్పించడం. పదో తరగతిలో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థుల తల్లిదండ్రులను, విద్యార్థులను సన్మానించే కార్యక్రమాలు చేపట్టనున్నారు.

బడిబాటను పకడ్బందీగా నిర్వహిస్తాం
బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాం. ఈ నెల 14 నుంచి 19 వరకు రోజుకో కార్యక్రమాన్ని చేపడుతాం. శుక్రవారం బోథ్‌ మండలంలోని మర్లపల్లిలో బోథ్‌ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 15న ఆదిలాబాద్‌ మండలంలోని పిప్పల్‌ధరిలో బడిబాట కార్యక్రమంలో ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొంటారు. ఏ ఒక్క చిన్నారి కూడా బడిబయట ఉండకుండా ఉపాధ్యాయులు కృషి చేయాలి.
– ఎ.రవీందర్‌రెడ్డి, డీఈఓ  

మరిన్ని వార్తలు