బడి బలోపేతం

10 Jun, 2019 08:09 IST|Sakshi

కరీంనగర్‌ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. జిల్లాలో ఈనెల 14 నుంచి 19 వరకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టేందుకు జిల్లా విద్యాశాఖ పూర్తి ఏర్పాట్లు చేస్తోంది. రోజుకో కార్యక్రమం ద్వారా విద్యార్థుల సంఖ్యను పెంచడం, హాజరు , ఉత్తీర్ణత పరిశీలించడం, విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, బాలకార్మికుల నమోదు, పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ, ప్రత్యేక కేంద్రాల్లో చేరికకు విద్యార్థుల ఎంపిక, తదితర వాటిపై దృష్టిపెట్టనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయనున్నారు. ఆరు రోజులపాటు సాగనున్న బడిబాటకు కరపత్రాలు, బ్యానర్లతో విసృత ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులను ఇప్పటికే ఆదేశించింది.

ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని అన్ని అవాస ప్రాంతాల్లోని బడిఈడు పిల్లలను గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో   ఎన్‌రోల్‌మెంట్‌ పెంచి నాణ్యమైన విద్యను అందించడం, ప్రభుత్వ పాఠశాలల్లో సమాన భాగస్వామ్యంతో బలోపేతం చేయడం, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు నిండిన బాలబాలికలను సమీపంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం, గ్రామ విద్య రిజిస్టర్‌ అప్‌లోడ్‌ చేయడం, ప్రాథమిక పాఠశాలల్లో 5వ తరగతి పూర్తి చేసుకున్న వారిని ప్రాథమికోన్నత పాఠశాలల్లో, ప్రాథమిక పాఠశాలలో 7వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో చేర్పించి నూరుశాతం ఎన్‌రోల్‌మెంట్‌ పూర్తి చేయడం, తక్కువ ఎన్‌రోల్‌ ఉన్న పాఠశాలలను గుర్తించి తల్లిదండ్రుల భాగస్వామ్యంతో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళిక రూపొందించనున్నారు. బాలిక విద్య ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు వివరించి బాలికలను పాఠశాలల్లో చేర్పించడం వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయనుంది.

నిధులు మంజూరు...
బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నుంచి నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రచార సామగ్రి, ప్రగతి నివేదికలు, బ్యానర్లు వంటి వాటికి ఒక్కో పాఠశాలకు రూ.1000 చొప్పున డీఈవోల నుంచి ఎంఈవోలకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని 620 పాఠశాలలకు రూ.6,20,000 మంజూరు చేసింది.
 
ఆంగ్ల మాధ్యమంపై   విస్తృత ప్రచారం...
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేస్తున్నట్లు విసృతంగా ప్రచారం చేయాలని విద్యా కమిటీలకు ఇప్పటికే జిల్లా విద్యాశాఖ నుంచి ఆదేశాలు అందాయి.  ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యతోపాటు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు విసృతంగా ప్రచారం చేపట్టడంతోపాటు కొత్తగా ఆంగ్ల మాధ్యమ తరగతులను ప్రారంభించే విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రభుత్వ పాఠశాలల్లో బడిబయట ఉన్న పిల్లల నమోదును పెద్ద ఎత్తున పెంచేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతుంది.


రోజువారీ బడిబాట కార్యక్రమాలు...

  • 14వ తేదీన బడిబాట ప్రాధాన్యతను గుర్తించేలా అవాస పాఠశాలలను అందంగా అలంకరించాలి. గ్రామంలో ర్యాలీ నిర్వహించి కరపత్రాలను పంచాలి. విద్యార్థులతో ‘మన పాఠశాల మన గ్రామం’ నినాదంతో ప్రచారం. పాఠశాల పనితీరుపట్ల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం.
  • 15వ తేదీన పాఠశాలల్లో బాలికలకు బాలిక విద్యపట్ల ప్రత్యేక అవగాహన కల్పించడం. బాలికల జీవనైపుణ్యం పెంపొందించేలా కార్యక్రమాలు.
  • 16న సామూహిక అక్షరాభ్యాసం, పిల్లల తల్లిదండ్రులతో సమావేశం, ఉన్నత పాఠశాలల్లో నూతనంగా చేరిన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించడం. 
  • 17న స్వచ్చ పాఠశాలలో భాగంగా తరగతి గదులను, మరుగుదొడ్లను, పాఠశాల ఆవరణను శుభ్రం చేసుకోవడం, చెట్ల సంరక్షణ, చెట్లకు నీరుపోయడం, చెట్ల బాధ్యతను విద్యార్థులకు అప్పగించడం.
  • 18న బాలకార్మికులకు గుర్తించి పాఠశాలల్లో చేర్పించడం, అవసరమైతే బాల కార్మిక నిర్మూలనాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికా«ధికారులను భాగస్వామ్యులు చేయడం. పాఠశాల యాజమాన్య కమిటితో సమావేశం నిర్వహించాలి. 
  • 19న ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలపై ప్రచారం... మాతృభాష, ఆంగ్ల భాషలో విద్యాబోధన, డిజిటల్‌ తరగతి గదులు, నాణ్యమైన విద్య, నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, పాఠశాల యాజమాన్య కమిటి ఏర్పాటు. రవాణా భత్యం, స్కాలర్‌షిప్‌లు, ఎస్కార్ట్‌ అలవెన్స్‌లపై అవగాహన కల్పిస్తారు.

ప్రత్యేక శ్రద్ధ చూపాలి
జిల్లాలో బడిబాట కార్యక్రమాన్ని ఈనెల 14 నుంచి 19 వరకు విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. విద్యాకమిటీల భాగస్వామ్యంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మండలస్థాయి అధికారులను, స్వచ్ఛంద సంస్థలను, మహిళ సంఘాలను, యువతను  సమావేశాలకు ఆహ్వానించి విద్యార్థుల సంఖ్యను పెంచేలా కృషి చేయాలి. ఈమేరకు ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశాం.  – వెంకటేశ్వర్లు, డీఈవో, కరీంనగర్‌ 

మరిన్ని వార్తలు