టెంపుల్ సిటీగా భద్రాచలం

14 Apr, 2016 03:45 IST|Sakshi
టెంపుల్ సిటీగా భద్రాచలం

భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం: సీఎం కేసీఆర్
గోదావరి ఒడ్డున ప్రధాన ఆలయాలన్నీ అభివృద్ధి చేస్తాం
ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం

 
సాక్షి, హైదరాబాద్: భద్రాచలం ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు అనువైన ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. భద్రాచలాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలని, విశాలమైన ఉద్యానవనాలు, అన్ని సౌకర్యాలతో కూడిన కాటేజీలు నిర్మించాలని చెప్పారు. ఆలయ గర్భగుడిని యథాతథంగా ఉంచుతూనే భక్తుల సౌకర్యం కోసం మెరుగైన  ఏర్పాట్లు చేయాలని సూచించారు. భద్రాచలం రాములవారి ఆలయ అభివృద్ధిపై బుధవారం క్యాంపు కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, స్థపతి వల్లి నాయగం, దేవాదాయ శాఖ సీఈ కె.వెంకటేశ్వర్లు, ఆలయ నిర్మాణ రూపకర్తలు ఆనంద్‌సాయి, రవి, మధుసూదన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులతో సీఎం సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆలయం ప్రస్తుత స్థితి, కల్యాణ మండపం, మాడ వీధులు, ప్రాకారం, పరిసర ప్రాంతాలపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం సీఎం వారికి పలు సూచనలు చేశారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి ఒడ్డున ఉన్న ప్రముఖ ఆలయాలన్నింటినీ అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ప్రముఖ యాత్రా స్థలాలుగా పేరున్న ఈ దేవాలయాల్లో భక్తులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు ముఖ్యమైన ఉత్సవాల సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు అనువుగా కల్యాణ మంటపం, ఇతర ప్రాంగణాలను సిద్ధం చేయాలని సూచించారు. గోదావరి ఒడ్డున నిర్మించిన కరకట్ట, దేవాలయం మధ్య ఉన్న ప్రాంతాన్నంతటినీ పరిగణనలోకి తీసుకుని కొత్త డిజైన్లు రూపొందించాలని ఆదేశించారు. 

ప్రస్తుతమున్న ప్రాకారం సరిపోతుందా, లేక మరోటి నిర్మించాలా అన్న అంశంపైనా అధ్యయనం చేయాలని ఆదేశించారు. దేవాలయం చుట్టూ ఉన్న రహదారులను మాడ వీధులుగా తీర్చిదిద్దే అంశాన్ని పరిశీలించాలన్నారు. మహాలక్ష్మి, ఆండాళ్ అమ్మవార్ల దేవాలయాన్ని, పర్ణశాల, చిత్రకూట మంటపం, జటాయువు మంటపం తదితర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పారు.  స్థపతి, ఆలయ నిర్మాణ రూపకర్తలు, ఆగమ శాస్త్ర పండితులు కలసి పనిచేసి చినజీయర్ స్వామి సూచనలతో సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. శ్రీరామనవమి ఉత్సవాల తరువాత తాను భద్రాచలం వెళ్లి అక్కడ చేయాల్సిన మార్పులు, చేర్పులపై క్షేత్రస్థాయి పరిశీలన జరపనున్నట్లు చెప్పారు.

>
మరిన్ని వార్తలు