ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ​దళ్‌ కార్యకర్తలు

14 Feb, 2019 13:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రేమికుల రోజు జరుపుకోవడానికి వీల్లేదు... అది మన కల్చర్ కాదు... లవర్స్ డే రోజున జంటగా కనిపిస్తే పెళ్లి చేసేస్తాం... అంటూ వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ సంస్థలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. కేవలం హెచ్చరికలకే పరిమితం కాకుండా.. వాటిని నిజం చేసి చూపారు భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు. ఆదేశాలను లెక్క చేయకుండా జంటగా తిరుగుతున్న ఓ ప్రేమ జంటకి పెళ్లి చేసేశారు. వివరాలు.. మేడ్చల్‌లో కండ్లకోయ ఆక్సిజన్‌ పార్కులో ఓ ప్రేమ జంట తిరుగుతుండగా వాళ్లకు బలవంతంగా పెళ్లిచేశారు భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు. దాన్ని మొబైల్‌లో వీడియో తీసారు. దాంతో ఆ జంట పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు మొదలుపెట్టారు. వీడియో ఆధారంగా వాళ్లను పట్టుకుంటామంటున్నారు. 

ఇదిలా ఉండగా ప్రేమికుల దినోత్సవ వేడుకలకు వ్యతిరేకంగా  వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు... అబిడ్స్‌లోని జీపీఓ చౌరస్తా దగ్గర ఆందోళనలు చేస్తూ... దిష్టిబొమ్మను తగలబెట్టారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సాగర్ రోడ్‌లో గల సితార గ్రాండ్‌లో వాలెంటైన్స్‌ డే వేడుకలు జరుగుతున్నట్లు తెలుసుకున్న ఏబీవీపీ, భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు అక్కడికి వెళ్లి వాటిని ధ్వంసం చేశారు.

మరిన్ని వార్తలు