'ప్రపంచ తెలుగు మహాసభ'లో బాలయ్య సవాల్‌

19 Dec, 2017 12:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రాంతాలు వేరైనా తెలుగు ప్రజలంతా స్నేహ భావాన్ని వీడలేదని, ఇది ఎప్పటికీ అలాగే కొనసాగాలని ప్రముఖ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన వీర తెలంగాణ పుత్రులకు, విప్లవ తెలంగాణ ఆడబిడ్డలకు తన కళాభివందనాలు అని చెప్పారు. ఈ సభల్లో పాలుపంచుకోవడం తన పూర్వజన్మసుకృతం అని చెప్పారు. తెలంగాణలో పుట్టిన వారికి అభిమానించడం తెలుసని, ఎదురించడం తెలుసని అన్నారు.

తెలంగాణ సాయుధపోరాటంతో తమ సత్తాను ప్రపంచానికి చాటిన ఘనత తెలంగాణ గడ్డదని కొనియాడారు. ఇక తెలుగు భాష గురించి మాట్లాడుతూ పలువురు తెలుగు ప్రముఖులను గుర్తు చేశారు. తెలుగు పదం వింటే తన తనువు పులకిస్తుందన్న ఆయన ఐదువేల ఏళ్ల కిందట నుంచి తెలుగు జాతి ప్రారంభమైందని అన్నారు. ఒక మహనీయుడు చెప్పినట్లు మాతృభాష తల్లిపాలవంటిదని, పరాయి భాష డబ్బా పాలవంటిదని గుర్తు చేశారు. డబ్బా పాలపై మోజుతో అమ్మను అమ్మా అని పిలవలేకపోతున్నారని, తల్లులు కూడా అమ్మ అనిపించుకోవడం కంటే మమ్మీ అని, నాన్న డాడీ అని పిలిపించుకుంటున్నారని, ఇలా ఇరవై ఏళ్లు పోతే ఇవే తెలుగు పదాలేమో అనే నమ్మే దౌర్భాగ్యం వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ ఓ సవాల్‌ విసిరారు. మూడు నిమిషాలు ఒక్క పరాయి పదం రాకుండా స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారా అని సవాల్‌ విసిరారు. కమ్మనైన తెలుగు భాషలో గోదావరి వంపులున్నాయని, తెలంగాణ మాగాణం తెలుగు భాష అని, రాయలసీమ పౌరుషం తెలుగులో ఉంటుందని, కోనసీమ కొబ్బరి నీళ్ల లేతదనం తెలుగు భాషలో ఉందంటూ కవితాత్మకంగా వర్ణించారు. తెలుగు జాతికి గౌరవం దక్కాలంటే ముందు తెలుగు భాషను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు