ఇక బాలామృతం ‘ప్లస్‌’! 

17 Dec, 2019 03:04 IST|Sakshi
బాలామృతాన్ని చిన్నారికి తినిపిస్తున్న మంత్రి ఈటల. చిత్రంలో మంత్రి సత్యవతి రాథోడ్‌

పోషకలోపాన్ని పరిష్కరించేందుకు చర్యలు

ఆసిఫాబాద్, గద్వాల జిల్లాల్లోని అంగన్‌వాడీలకు సరఫరా

సాక్షి, హైదరాబాద్‌: చిన్నారుల్లో తీవ్ర పోషక లోపాలకు చెక్‌ పెట్టేందుకు సరికొత్త పౌష్టికాహారం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అన్నిరకాల పోషక విలువలున్న ఆహారంగా ‘బాలామృతా’న్ని చిన్నారులకు అందిస్తున్నారు. దీంతో చిన్నారుల పెరుగుదల సంతృప్తికరంగా ఉంటోంది. అయితే పోషకలోపాలున్న చిన్నారులకు బాలామృతం కంటే మరింత అధిక పోషణ గుణాలున్న ఆహారాన్ని ఇవ్వాలని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘బాలామృతం ప్లస్‌’ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సోమవారం తార్నాకలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషన్‌ (ఎన్‌ఐఎన్‌)లో జరిగిన కార్యక్రమంలో ‘బాలామృతం ప్లస్‌’ను వినియోగంలోకి తెచ్చారు.

ముందుగా రెండు జిల్లాల్లో... 
అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారుల ఆరోగ్య స్థితిని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. వారి బరువు, ఎదుగుదలను క్రమం తప్పకుండా కొలవడంతో పాటు వారి ఆరోగ్య స్థితిని సైతం రికార్డు చేస్తుంది. ఈక్రమంలో రాష్ట్రస్థాయి నివేదికను విశ్లేషించగా... కుమ్రంభీం ఆసిఫాబాద్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ఎక్కువ మంది చిన్నారులు తీవ్ర పోషక లోపాల బారిన పడినట్లు గుర్తించారు. ఇలాంటి వారికి సాధారణ ఆహారంతో పాటు అధిక పోషక విలువలున్న ఆహారాన్ని ఇవ్వాలి.

అలా అయితేనే వారు ఐదేళ్ల వయసొచ్చేసరికి పోషక లోపాలు అధిగమించడంతో పాటు ఆ తర్వాత ఎదుగుదల సాధారణంగా మారుతుంది. ఈ అంశంపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ యంత్రాంగంతో పాటు ఎన్‌ఐఎన్, టీఎస్‌ ఫుడ్స్, యూనిసెఫ్‌ అధికారులు ప్రత్యేక బృందంగా ఏర్పడి పోషక విలువలు ఎక్కువగా ఉన్న బాలామృతం ప్లస్‌ను తయారు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.జగదీశ్వర్, యూనిసెఫ్‌ దక్షిణాది రాష్ట్రాల చీఫ్‌ మిషల్‌ రాస్డియా తదితరులు పాల్గొన్నారు.

కొత్త ఆహారంలో... 
కొత్తగా తీసుకొచ్చిన బాలామృతం ప్లస్‌లో పాలపొడి, పల్లీ నూనె, రైస్, వీట్, బెంగాల్‌గ్రామ్, చక్కెరతో పాటు కొవ్వు పదార్థాలు సమృద్ధిగా ఉండే మిశ్రమాలను జత చేస్తారు. దీంతో పోషక విలువలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం బాలామృతం ప్లస్‌ను కుమ్రంభీం ఆసిఫాబాద్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో అందించాలని అధికారులు నిర్ణయించారు. ఈ రెండు జిల్లాల్లో నెలకు సగటున టన్ను బాలామృతం ప్లస్‌ సరఫరా చేసేలా తయారు చేస్తున్నారు. డిమాండ్‌కు తగినట్లు పరిమాణాన్ని పెంచేందుకు టీఎస్‌ఫుడ్స్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్లస్‌ ఆహారాన్ని అందిస్తూ చిన్నారుల ఎదుగుదల, పోషక లోపాల తీరును వరుసగా మూడు నెలల పాటు పరిశీలిస్తారు. ఫలితాల ఆధారంగా వచ్చే ఏడాది మరో 10 జిల్లాల్లో బాలామృతం ప్లస్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేస్తోంది.

మరిన్ని వార్తలు