నామా వల్లే టీడీపీ నాశనం

7 Dec, 2014 03:26 IST|Sakshi
నామా వల్లే టీడీపీ నాశనం

ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ

సాక్షి, ఖమ్మం :  డబ్బు, అహంకారంతో నామా నాగేశ్వరారవు జిల్లాలో టీడీపీ నాశనం చేశాడని టీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ విమర్శించారు. శనివారం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏనాడు టీడీపీ కార్యకర్తల కష్టాలు ఆయన చూడలేదని అందుకే తాము టీఆర్‌ఎస్‌లో చేరుతున్న సమయంలో వారు కూడా తమ బాటే పట్టారనని అన్నారు. ఇది గిట్టక తమపై అవాకులు చవాకులు మాట్లాడితే జిల్లా ప్రజలే వారికి రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు.

టీడీపీలో శకుననిలా మారి పార్టీని నిర్వీర్యం చేశారనని ఆరోపించారు. జిల్లాలో సామాజిక న్యాయం పాటించకుండా తనకు వచ్చిన టికెట్ కూడా తన అనుచర నేతలకు నామా ఇప్పించుకొని కేడర్‌ను మనస్తాపానికి గురి చేశారని బాలసాని  ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు.. ఎవరి ఓటమి కోసం పనిచేశారో జిల్లా ప్రజలకు తెలుసని అన్నారు. ఖమ్మంలో ఎవరి బంధువులు పార్టీ అభ్యర్థి ఓటమి కోసం డబ్బులు పంచారో జగమెరిగిన సత్యమని అన్నారు. ఇలాంటివన్నీ చేయించిన వారు.. జిల్లాలో పార్టీని మోసిన తమపై నిందలు మోపుతారా..? అని ప్రశ్నించారు. ఒకప్పుడు టికెట్ రాలేదని పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వారిని, పార్టీ అధినేత చిత్రపటాలు చించి అవమానించిన వారిని భుజానకెత్తుకుంది మీరు కాదా..? అని నామాను ప్రశ్నించారు.

నీతి, నిజాయితీతో చేసినందునే తమకు జిల్లా ప్రజలు గౌరవం ఇచ్చారని, మాతో ఉన్న టీడీపీ కేడర్ మనస్ఫూర్తిగానే టీఆర్‌ఎస్‌లో చేరారని అన్నారు. ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావులు అవకాశవాదులని.. అర్థరాత్రి ముసుగులో వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ గుమ్మం తొక్కిన విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసని అన్నారు. ఇలాంటి అవకాశవాదులకు తమ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు కొండాబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్న వారు ఇవాళ టీడీపీలో నేతలుగా చలామణి అవుతున్నారని ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, మందడపు సుధాకర్, చింతనిప్పు కృష్ణచైతన్య, మదార్ సాహెబ్, జక్కంపుడి కృష్ణమూర్తి, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు