ఓడీఎఫ్‌కు టైమైంది..!

23 Sep, 2017 11:41 IST|Sakshi

ఈనెల 29తో ముగియనున్న గడువు

అక్టోబర్‌ 2న బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటించేందుకు కసరత్తు

జిల్లాలో 87.27 శాతం పూర్తయిన ఐహెచ్‌హెచ్‌ఎల్‌ల నిర్మాణాలు

మిగిలిన 12.73 శాతం నిర్మాణాల పూర్తికి చర్యలు

29వ తేదీలోగా చెల్లింపులు పూర్తి చేయాలని సూచన

మిగిలిన నిధులు ప్రభుత్వ ఖజానాకు..

మోర్తాడ్‌(బాల్కొండ) : స్వచ్ఛభారత్‌ అభియాన్‌లో భాగంగా జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ఈనెల 29తో గడువు ముగియనుంది. అక్టోబర్‌ 2వ తేదీన జిల్లాను ఓడీఎఫ్‌ (బహిరంగ మల విసర్జన రహిత)గా ప్రకటించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో 87.27శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలిన నిర్మాణాలు పూర్తిచేసేందుకు జీపీల ఖాతాల్లో జమచేసిన నిధులను 29వ తేదీలోగా ఖర్చు చేయాల్సి ఉంది. ఒకవేళ ఈ నిధులను ఖర్చు చేయకపోతే ఆ నిధులు ప్రభుత్వ ఖజానాకు మళ్లనున్నాయి. దీంతో కొద్దిరోజులే గడువు ఉండడంతో గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని గ్రామాల్లోని లబ్ధిదారులకు అధికారులు సూచించారు.  

29లోగా ఖర్చు చేయాల్సిందే..
జీపీ ఖాతాల్లోని ఈ నిధులను ఈనెల 29వ తేదీలోగా ఖర్చు చేయకపోతే ఎంపీడీవో ఖాతాలకు మళ్లించాలని ప్రభుత్వం లీడ్‌ బ్యాంకు ద్వారా ఆయా బ్యాంకుల శాఖలకు ఆదేశించింది. గ్రామ పంచాయతీ ఖాతాల్లో ఉన్న నిధులతో నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయడం, మొదలు పెట్టనివి ప్రారంభించాల్సి ఉంది. ఒకవేళ నిధులు ఖర్చు చేయకపోతే పంచాయతీ ఖాతాల నుంచి ఎంపీడీవో ఖాతాలకు మళ్లిపోనున్నాయి. జిల్లాలోని పాత మండలాల ప్రకారం 19 మండలాల్లోని నిర్మాణాలను పరిశీలిస్తే 99.30 శాతంతో వేల్పూర్‌ ప్రథమ స్థానంలో నిలువగా 73.77 శాతంతో నవీపేట్‌ చివరి స్థానంలో ఉంది. లక్ష్యానికి అనుగుణంగా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేస్తే జిల్లాను బహిరంగ మల విసర్జన లేని జిల్లాగా ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయడానికి మరికొద్ది రోజులే గడువు ఉంది. ఇప్పటికే గ్రామాలలోని లబ్ధిదారులకు మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులు సమాచారం అందించారు. నిర్మాణం మొదలైన వాటిని పూర్తిచేయడం, అసలే మొదలుపెట్టని వాటిని ఆరంభించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఆసరా పింఛన్‌లకు లింకు..
ప్రభుత్వ ఆసరా పింఛన్‌లను పొందుతూ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోని వారిని గుర్తించి పింఛన్‌ను నిలిపివేయాలని అధికారులు తపాలా శాఖ ఉద్యోగులకు లేఖ రాశారు. సోమవారం నుంచి పింఛన్‌లను పంపిణీ చేసే అవకాశం ఉండటంతో మరుగుదొడ్డి నిర్మించుకోని వారికి పింఛన్‌లు నిలిపివేయనున్నారు. జిల్లాలోని గ్రామాలను ఓడీఎఫ్‌ గ్రామాలుగా ప్రకటించడంలో భాగంగా లబ్ధిదారులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకరావడం తప్పడం లేదని అధికారులు అంటున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను ఎలాగైనా పూర్తి చేయించాలనే లక్ష్యంతో అధికారులు పని చేస్తున్నారు.

వందశాతం పూర్తిచేయాలని ఆదేశం..
వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వందశాతం పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. నిర్మాణాలు పూర్తి చేయాల్సిన వాటి సంఖ్య తక్కువగా ఉండటం, సమయం కూడా ఎక్కువ లేకపోవడంతో నిరంతరం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయించడానికి కృషి చేస్తున్నాం. – పీవీ శ్రీనివాస్, ఎంపీడీవో, మోర్తాడ్‌

87.27 శాతం పూర్తి..
జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాల లక్ష్యం 99,065 కాగా, ఇప్పటివరకు 86,453 నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 7,036 మరుగుదొడ్లు నిర్మాణంలో ఉన్నాయి. 5,576 నిర్మాణాలు మొదలు కావాల్సి ఉంది. జిల్లామొత్తంలో 87.27 శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంకా 12.73 శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.118కోట్ల 87లక్షల 80వేల నిధులను కేటాయించింది. నిర్మాణాలు కొనసాగుతున్నవి, ఇంకా నిర్మాణాలు జరగాల్సిన మరుగుదొడ్ల కోసం గ్రామ పంచాయతీ ఖాతాల్లో రూ.15కోట్ల 13లక్షల 44వేల నిధులున్నాయి.

>
మరిన్ని వార్తలు