బల్దియా బడ్జెట్‌ కట్‌?

7 Mar, 2017 12:57 IST|Sakshi
► రూ.100 కోట్లు కుదించిన అధికారులు
► నేడు ఖమ్మం కార్పొరేషన్‌ బడ్జెట్‌ సమావేశం
ఖమ్మం: ఇటీవల ఖమ్మం కార్పొరేషన్‌ రూపొందించిన అంచనా బడ్జెట్‌ను కుదించనున్నారా? అంటే  దీనికి అవుననే సమాధానం వినిపిస్తోంది. 2016–17 ఏడాదిలో ముఖ్యమంత్రి ఖమ్మం కార్పొరేషన్‌ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ.100 కోట్ల నిధులు కేటాయించారు. దీంతో నాన్‌ప్లాన్‌గ్రాంట్‌ ద్వారా ఖమ్మం కార్పొరేషన్‌కు అదనంగా రూ.100 కోట్లు అందాయి. అయితే ఈ ఏడాది సైతం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్పొరేషన్‌ అభివృద్ధికి నిధులు ఇస్తారనే ఆశతో నాన్‌ప్లాన్‌ గ్రాంట్స్‌ నిధులల్లో రూ.102 కోట్లను చేర్చారు.
 
బడ్జెట్‌ సమావేశాలను దృష్టిలో ఉంచుకొని రెండు రోజుల పాటు చర్చ సాగించిన టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ఈసారి బడ్జెట్‌ భారీగా రూపొందించారని, ముఖ్యమంత్రి నిధులు ఇవ్వకపోతే బడ్జెట్‌ అంచనాలు తప్పుగా తేలే అవకాశాలున్నాయని అన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నాన్‌ ప్లాన్‌ గ్రాంట్స్‌ నిధుల అంచనాలో చేర్చిన రూ.102 కోట్లను బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా తొలగించనున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటికే రూ.543 కోట్ల అంచనాలతో రూపొందించిన కార్పొరేషన్‌బడ్జెట్‌ రూ.443 కోట్లకు చేరనుంది.రెండు రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన చర్చలో కార్పొరేటర్లు సూచించిన సలహాల మేరకు కొన్ని మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఏడాది పాటు అభివృద్ధి ప్రణాళికతో రూపొందించనున్న బడ్జెట్‌ను మంగళవారం జరగనున్న సమావేశంలో కౌన్సిల్‌ ఆమోదం తెలపనుంది. 
మరిన్ని వార్తలు