బల్దియా బడ్జెట్‌ రూ.11,538 కోట్లు

21 Dec, 2018 11:04 IST|Sakshi
స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో మేయర్‌ రామ్మోహన్, కమిషనర్‌ దానకిశోర్‌

2019–20 ముసాయిదా సిద్ధం  

జీహెచ్‌ఎంసీ నిధులు రూ.6,150 కోట్లు  

కార్పొరేషన్ల గ్రాంట్‌ రూ.5,388 కోట్లు  

‘డబుల్‌’ ఇళ్లు, ఫ్లైఓవర్లు, రహదారులకు ప్రాధాన్యం  

స్టాండింగ్‌ కమిటీ ముందుకు ప్రతిపాదనలు  

మరో సమావేశంలో బడ్జెట్‌పై చర్చ  

యథాతథంగా ఆమోదించే అవకాశం  

సాక్షి, సిటీబ్యూరో: 2019–20 ఆర్థిక సంవత్సరానికి బల్దియా భారీ బడ్జెట్‌ రూపొందించింది. రూ.11,538 కోట్లతో ముసాయిదా సిద్ధం చేసింది. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత గురువారం నిర్వహించిన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఈ బడ్జెట్‌ను ప్రతిపాదించింది. తర్వాత సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదించనున్నారు. ప్రతిపక్షాలు లేనందున.. బహుశా యథాతథంగా బడ్జెట్‌ను ఆమోదించే అవకాశం ఉంది. వాస్తవానికి జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ రూ.6,150 కోట్లే అయినప్పటికీ ఇతర కార్పొరేషన్ల నుంచి భారీ ప్రాజెక్టులకు రూ.5,388 కోట్ల నిధులు అందుతాయని భావిస్తున్న బల్దియా మొత్తం రూ.11,538 కోట్లతో బడ్జెట్‌ రూపొందించింది.

ప్రతిఏటా బడ్జెట్‌ పెరగాలే తప్ప తగ్గరాదనే సాధారణ నియమయే ప్రాతిపదికగా జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ గతేడాది రూ.6,076.86 కోట్లుండగా... ఈసారి దాన్ని స్వల్పంగా పెంచి రూ.6,150 కోట్లుగా చూపారు. వాస్తవ పరిస్థితుల్ని కొంతమేర పరిగణనలోకి తీసుకొని ఇతర కార్పొరేషన్ల నుంచి ప్రాజెక్టులకు అందే నిధులు గతేడాది రూ.7,073.14 కోట్లుండగా, ఈసారి రూ.5,388 కోట్లకు తగ్గించారు. అయినప్పటికీ వస్తాయనుకున్న నిధులు, చేస్తున్న ఖర్చులకు పొంతన లేకపోవడంతో ప్రతిఏటా ఆమోదిస్తున్న బడ్జెట్‌లో దాదాపు సగం బడ్జెట్‌ను మాత్రమే అమలు చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సైతం రూ.13,150 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించినప్పటికీ, తొలి ఆరు నెలల్లో కేవలం రూ.2,461.05 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ ఖజానాకు వచ్చిన నిధులు కూడా రూ.2,741 కోట్లు మాత్రమే. ఈ లెక్కన ఆదాయం, ఖర్చు బొటాబొటిగా ఉన్నాయి. 

ఎప్పుడూ అంతే!  
మిగతా ఆరు నెలల్లో దాదాపు మరో రూ.4వేల కోట్లు చేసినా రూ.6వేల కోట్లు మాత్రమే అవుతుంది. 2017–18లో రూ.5,643 కోట్లతో బడ్జెట్‌ను ఆమోదించినప్పటికీ కేవలం రూ.3,736.80 కోట్లే ఖర్చు చేశారు. అలాగే 2016–17లోనూ రూ.5,600 కోట్లతో బడ్జెట్‌ ఆమోదించగా... రూ.2,782.10 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ లెక్కన కొత్త బడ్జెట్‌ సైతం అంకెల ఘనంగానే భావిస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను, అసైన్డ్‌ రెవెన్యూ తదితర వెరసి రూ.3,325 కోట్లు రాగలవని అనుకున్నప్పటికీ ఆరు నెలల్లో రూ.1,279 కోట్లు మాత్రమే వచ్చాయి. ఆస్తి పన్ను రూ.1,725.20 కోట్లుగా బడ్జెట్‌లో చూపినప్పటికీ ఇప్పటి వరకు వసూలైంది దాదాపు రూ.750 కోట్లు మాత్రమే. 

తగ్గిన రివైజ్డ్‌ బడ్జెట్‌
గతేడాది రివైజ్డ్‌ బడ్జెట్‌ను పెంచినప్పటికీ, ఈసారి కాస్త వాస్తవిక దృక్పథంతో తగ్గించారు. దాన్ని రూ.13,150 కోట్ల నుంచి రూ.8,935 కోట్లకు తగ్గించారు. అయితే ఇదైనా అమలు చేయగలరా అన్నదే సందేహం. జీహెచ్‌ఎంసీ పర్యవేక్షించే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, రహదారుల పనులకు హౌసింగ్‌ కార్పొరేషన్, హెచ్‌ఆర్‌డీసీఎల్‌ (హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌)ల నుంచి భారీ మొత్తాల్లో గ్రాంట్స్‌ వస్తాయనే  అంచనాతో క్యాపిటల్‌ ఖర్చును ఎక్కువగా చూపారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ఇచ్చే నిధులను కూడా లెక్కించి ప్రస్తుత బడ్జెట్‌లోనూ రూ.6,317.69 కోట్లు కేటాయించినప్పటికీ, వాటిని రివైజ్డ్‌ బడ్జెట్‌లో రూ.3,410 కోట్లకు తగ్గించారు. రోడ్ల అభివృద్ధికి రూ.500 కోట్లు ఖర్చు చేయాలనుకున్నప్పటికీ, రివైజ్డ్‌లో రూ.150 కోట్లకు పరిమితం చేశారు.  

కొత్త బడ్జెట్‌ (2019–20)లో పెద్ద ప్రాజెక్టుల కింద ఇతర కార్పొరేషన్ల నుంచి అందే నిధులను రూ.5,388 కోట్లుగా చూపారు. అందులో హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ రూ.200 కోట్లు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, ఇతర ఇళ్ల అభివృద్ధికి హౌసింగ్‌ కార్పొరేషన్‌ రూ.5,188 కోట్లు.  

‘డబుల్‌’ ఇళ్లు,ఎస్సార్డీపీ పనులకు ప్రాధాన్యం...
ప్రస్తుతం బడ్జెట్‌ లాగే కొత్త బడ్జెట్‌లోనూ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, నాలాల ఆధునికీకరణ, ఎస్సార్డీపీ ప్రాజెక్టులు, రహదారుల పనులకు ప్రాధాన్యమిచ్చారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో వీటికోసం చేసిన ఖర్చులు చూస్తే.. రానున్న ఏడాదిలో ఎంతవరకు అమలవుతాయన్నది సందేహమే. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ.6,317.70 కోట్లు కేటాయించగా, ఇప్పటివరకు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.992.86 కోట్లు మాత్రమే అందింది. బహుళ వరుసల ఫ్లైఓవర్లు, రహదారుల అభివృద్ధి తదితర ఎస్సార్డీపీ పనుల కోసం ప్రస్తుత బడ్జెట్‌లో రూ.1,802 కోట్లు బాండ్ల జారీ, బ్యాంకు రుణాల ద్వారా తీసుకోనున్నట్లు పేర్కొన్నప్పటికీ.. ఇప్పటి వరకు రెండు విడతలుగా రూ.195 కోట్లు మాత్రమే తీసుకున్నారు. అలాగే వరద కాలువల ఆధునికీకరణ పనుల కోసం ప్రస్తు బడ్జెట్‌లో రూ.361.45 కోట్లు కేటాయించినప్పటికీ, ఇప్పటి వరకు కేవలం రూ.58.27 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. రహదారులు, ఫుట్‌పాత్‌ల కోసం రూ.2,173.77కోట్లు కేటాయించినప్పటికీ, రూ.380.59 కోట్లే ఖర్చు చేశారు. ఈ లెక్కన భారీ బడ్జెట్‌ కాగితాలకే పరిమితం కానుంది. గతేడాది లాగే ఈసారి సైతం జీహెచ్‌ఎంసీ నిధులకు సంబంధించి ‘ఎ’ భాగంగా, జీహెచ్‌ఎంసీ పర్యవేక్షించే పనులకు ఇతర కార్పొరేషన్ల నుంచి అందే నిధులను ‘బి’ బడ్జెట్‌గా రూపొందించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు