మెట్రో రైలు: మా పేర్లు లేవా?.. బల్దియా బాసుల నారాజ్‌!

28 Nov, 2017 11:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మకమైన మెట్రో రైలు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మియాపూర్‌ స్టేషన్‌లో మెట్రోరైలును ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి, రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖమంత్రి కే తారకరామారావు తదితరులు పాల్గొంటారు. 

అయితే, హైదరాబాద్‌కు మణిమకుటమైన మెట్రో రైలు ప్రారంభోత్సవ వేడుకలో స్థానిక బల్దియా పెద్దలకు ప్రాధాన్యం దక్కకపోవడం విమర్శలకు తావిస్తోంది. మెట్రో రైలు ప్రారంభోత్సవ ఫైలాన్‌లోనూ, ఎల్‌ అండ్‌ టీ మెట్రో లిమిటెట్‌ విడుదల చేసిన వోచర్‌లోనూ జీహెచ్‌ఎంసీ పాలకులకు, యంత్రాంగానికి ప్రాధాన్యం లభించలేదు. మెట్రో ప్రారంభోత్సవ శిలాఫలకంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌, కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి, రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖమంత్రి కే తారకరామారావు పేర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. శిలాఫలకం బయటకు కనబడకుండా ఇప్పటికే వస్త్రంతో మూసేశారు

మెట్రో రైలు ఫైలాన్‌, వోచర్‌లో హైదరాబాద్‌ మేయర్‌ పేరుగానీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ పేరుగానీ లేకపోవడంపై బల్దియా వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ప్రధాని మోదీతో కలిసి మెట్రో రైల్లో ప్రయాణం చేసేవారి జాబితాలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కమిషనర్‌ లేకపోవడంపై కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ నగరానికి తలమానికమైన ఇంతటి చరిత్రాత్మక కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీకి ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని కార్పొరేటర్లు కినుక వహించారు. మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీకి తగినంత ప్రాధాన్యం లభించడం లేదని వారు అంటున్నారు. ప్రధాని నరేంద్రమోడీ మెట్రో రైలును ప్రారంభించి అందులో ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నారు. 


>
మరిన్ని వార్తలు