అభివృద్ధిని విస్మరించారు.. ఆస్తులు పెంచుకున్నారు!

14 Dec, 2014 03:24 IST|Sakshi
అభివృద్ధిని విస్మరించారు.. ఆస్తులు పెంచుకున్నారు!

నిజామాబాద్‌కల్చరల్ : సమైక్య రాష్ట్రంలో పదేళ్లు అధికారం వెలగబెట్టిన  కాంగ్రెస్ నాయకులు అభివృద్ధిని విస్మరించారని, ఆస్తులను సంపాదించుకోవడంలోనే తలమునకలయ్యారని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు బాల్క సుమన్ విమర్శించారు.  శనివారం జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో గల ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో జిల్లాలో ఉన్న పెద్దపెద్ద నాయకులు జిల్లా అభివృద్ధిని పూర్తిగా మరచిపోయారని, కేవలం తమ సొంత ఆస్తులను పెంచుకోవడంతోనే సరిపెట్టుకున్నారని విమర్శించారు.

అంతకు ముందు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. అందువల్లే జిల్లా అభివృద్ధి చెందలేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు మాసాల్లోనే ఎన్నికల్లోని మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అమలు చేస్తూ, ఎన్నికల్లో ఇవ్వని వాటిని కూడా అమలు చేస్తోందన్నారు.  తెలంగాణలోని ప్రతి ఇంటికి మంచినీటిని అందించే బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ పథకం సర్వే పనులు కొనసాగుతున్నాయన్నారు.  రైతులకు గతంలో ఏ ప్రభుత్వాలు ఇవ్వని ఇన్‌పుట్ సబ్సిడీని అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు.
 
గల్ఫ్ బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ
తెలంగాణలో గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు కేరళ రాష్ట్రం తరహాలో సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్యాకేజీని ప్రవేశపెట్టనున్నట్లు  తెలిపారు. ముస్లిం, గిరిజనలకు రిజర్వేషన్‌ల కోసం కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో ఉన్న  85 శాతం అణగారిన వర్గాల వారి అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.

ఆర్మూర్‌లో ఎర్రజొన్న రైతులకు రూ.10 కోట్ల బకాయిలను చెల్లించామన్నారు. సమైక్య రాష్ట్రంలో కోస్తాంధ్రలో ఆంధ్ర నాయకులు ఈదురుగాలులకు కొబ్బరిచెట్లు కుప్పకూలితే బాధితులకు  రూ. 5 వేల నష్టపరిహారం ఇచ్చారని, తెలంగాణలో రైతుల పంట వడగండ్ల వానకు నష్టపోయినా, విద్యుత్ కోతలతో ఎండిపోయినా నయా పైసా నష్టపరిహారం చెల్లించలేదన్నారు.  

ఆసరా పథకంపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నిజామాబాద్ స్మార్ట్‌సిటీ కోసం ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారని తెలిపారు.  అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా మాట్లాడుతూ,  ఆసరా పథకం ద్వారా అర్హులైన వారికి పింఛన్ తప్పనిసరిగా అందుతుందన్నారు.సమావేశంలో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏ ఎస్ పోశెట్టి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు