బుగ్గల జమానా

21 Nov, 2018 13:56 IST|Sakshi
బెలూన్లలో గ్యాస్‌ నింపేందుకు తెచ్చిన సిలండర్లు

ఎక్కడ చూసినా బెలూన్‌లే.. 

ప్రచార బుగ్గలకు భలే గిరాకీ

ఒక్కో బెలూన్‌కు రూ.25వేలు

ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్న నేతలు

భైంసాటౌన్‌(ముథోల్‌): ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ ప్రచారానికి ఉపయోగపడే ప్రతీ సాధనాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రచార రథాలు, ఫ్లెక్సీలు, కరపత్రాలు, వాల్‌పెయింటింగ్‌లతోపాటు ప్రధాన ప్రాంతాల్లో భారీ బెలూన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా రాజకీయ పార్టీల గుర్తులు, అభ్యర్థుల ఫొటోలతో ఏర్పాటు చేసిన భారీ బెలూన్‌లే దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రస్తు తం ఈ భారీ బెలూన్లు అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాయి. బెలూన్‌లలో గ్యాస్‌ నింపడం ద్వారా వాటిని తాడు సహాయంతో గాలిలో ఎగురవేస్తున్నారు. అందరి దృష్టిలో పడేలా భారీ బెలూన్‌లు ఏర్పాటు చేయడంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం లభించినట్లు అవుతోంది.

అన్ని పార్టీలదీ అదే దారి..
ప్రస్తుతం శాసనసభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రచార సందడి మొదలైంది. ప్రచారం ప్రారంభించిన వారిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ముందున్నారు. గడపగడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంతోపాటు, మండల కేంద్రాల్లో, గ్రామాల్లోని ప్రధాన ప్రాంతాల్లో భారీ బెలూన్లు ఏర్పాటు చేశారు. తర్వాత బీజేపీ, బీఎస్పీ పార్టీలు సైతం వారి వారి గుర్తులు, ఫొటోలతో బెలూన్‌లు ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం ముథోల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా రామారావుపటేల్‌కు టికెట్‌ కేటాయించడంతో ఆయన సైతం భారీ బెలూన్‌లను ఏర్పాటు చేయించారు.

రూ.లక్షల్లో ఖర్చు..
బెలూన్‌లపై ప్రచారం కోసం రాజకీయ పార్టీల నాయకులు ఆసక్తి చూపుతుండడంతో పలువురికి ఉపాధి లభిస్తోంది. స్థానికంగా ఈ వ్యాపారులు లేకపోవడంతో హైదరాబాద్‌ నుంచి వారిని ఇక్కడికి తెప్పించి బెలూన్లు ఏర్పాటు చేయిస్తున్నారు. ఒక్కో బెలూన్‌కు రూ.25వేలు వెచ్చిస్తున్నారు. ఈ లెక్కన మొత్తం జిల్లావ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో అన్ని ప్రధాన పార్టీలు బెలూన్లు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇందుకుగాను రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. దీంతో ఈ బెలూన్‌ ఏర్పాటు చేస్తున్న వ్యాపారులకు చేతినిండా పని దొరుకుతోంది. 

మరిన్ని వార్తలు