అంబరాన్నంటిన బాలోత్సవ్

12 Nov, 2016 02:25 IST|Sakshi
అంబరాన్నంటిన బాలోత్సవ్

వ్యర్థానికి అర్థం చెప్పిన చిన్నారులు
ఆలోచింపజేసిన కార్యక్రమాలు
ఆకట్టుకున్న ప్రదర్శనలు

సాక్షి, కొత్తగూడెం: బాలల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి.. వారిలోని ప్రతిభా పాటవాలను చాటిచెప్పేందుకు భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహిస్తున్న బాలల పండగ బాలోత్సవ్‌కు రెండో రోజైన శుక్రవారం అనూహ్య స్పందన లభించింది. దాదాపు 7 రాష్ట్రాలకు చెందిన బాలబాలికలు వివిధ అంశాల్లో తమ ప్రతిభను చాటేందుకు బాలోత్సవ్‌ను వేదికగా చేసుకున్నారు. కొత్తగూడెం క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన 14 వేదికలపై జూనియర్, సీనియర్ విభాగాలకు పోటీలను నిర్వహిస్తున్నారు. శుక్రవారం కథారచన, భరతనాట్యం, కూచిపూడి, నీతిపద్యాలు, ఏకపాత్రాభినయం, ఫోక్ డాన్‌‌స, ఫ్యాన్సీ డ్రెస్, స్పెల్‌బీ, సినీ, లలిత, జానపద గీతాలు, క్విజ్, లేఖారచన, వ్యర్థంతో అర్థం, నాటికలు నిర్వహించారు. అనేక మంది విద్యార్థులు వ్యర్థ వస్తువులతో అద్భుతాలు సృష్టించి వేదికపై ప్రదర్శించడం, వాటి ప్రయోజనాలను వివరణాత్మకంగా విశ్లేషించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఎందుకూ పనికిరావనుకున్న అరటి తొక్కలను ఎలా ఉపయోగించుకోవచ్చు అన్న అంశాన్ని ఇల్లెందు మండలం మాదారం పాఠశాలకు చెందిన విద్యార్థులు వివరించారు. అరటి తొక్కను రెండు రోజులపాటు నానబెట్టి, అనంతరం పెరట్లో పెరుగుతున్న మొక్కలకు ఔషధంగా వేస్తే అవి అద్భుతంగా పెరుగుతాయని వివరించిన తీరు ఆకట్టుకుంది. ఇక చెత్త కాగితాలతో తమకేం పని అనుకునే వారికి వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో.. పాల్వంచకు చెందిన డీఏవీ పాఠశాల విద్యార్థులు వివరించారు. చిత్తు కాగితాలు, వాడి పడేసిన ఇంజక్షన్ బాటిళ్లతో చీకటి గదుల్లో వెలుగులు నింపవచ్చని నిరూపించారు. వీటిని బెడ్ ల్యాంప్‌లుగా ఎలా చేయాలో చూపారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బాలబాలికలు చేసిన జానపద, కూచిపూడి నృత్యాలు ఆకట్టుకున్నాయి.

తెలుగు భాష గొప్పదనాన్ని వివరిస్తూ ఖమ్మంలోని జాన్సన్ కిడ్‌‌స పాఠశాలకు చెందిన విద్యార్థి చేసిన నృత్యం ఆకట్టుకుంది. అలాగే ఓ చిన్నారి ‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా.. రక్తబంధం విలువ నీకు తెలియ దురా’ పాటకు చేసిన నృత్యం  ఆకట్టుకుంది. పలువురు చిన్నారులు ఫ్యాన్సీ డ్రెస్, తమ వేషభాషల తో, హావభావాలతో ఇచ్చిన ప్రదర్శనలు ప్రేక్షకులను అలరింపజేశాయి. బాలోత్సవ్ కన్వీనర్ రమేష్‌బాబు అన్ని వేదికలను పర్యవేక్షిస్తూ.. కార్యక్రమాలను వీక్షించారు.

మరిన్ని వార్తలు