దేశ భవితకు ఆవిష్కరణలు అవసరం

8 Mar, 2020 03:58 IST|Sakshi
దత్తాత్రేయకు మెమెంటో అందజేస్తున్న ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ మూర్తి

ఐఐటీహెచ్‌లో హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

సాక్షి, సంగారెడ్డి: సామాజిక అవసరాలకు అనుగుణంగా ఐఐటీ విద్యార్థులు నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీహెచ్‌ను ఆయన సందర్శించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఏ వ్యక్తికైనా దేశం, ప్రజలే ప్రథమ ప్రాధాన్యతని తెలిపారు. ప్రతి పౌరుడు రాజ్యాంగబద్ధంగా మెలగాలని సూచించారు.  ఫస్ట్‌ నేషన్‌.. నెక్ట్స్‌ ఫ్యామిలీయని, అదేవిధంగా జాతి మొదటి దని, స్వార్థం చివరిది అనే భావన ప్రతి వ్యక్తిలో ఉన్నప్పుడే దేశం కోసం ఏదైనా చేయాలనే ఆకాంక్ష ఏర్పడుతుందన్నారు. ఐ ఐటీ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగి స్తోందన్నారు. విద్యార్థులు ఏకాగ్రతతో ఉండాలని, ఇందుకు ని రంతరం యోగా సాధన చేయాలన్నారు. టిబెట్‌ విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.

ఉద్యోగాలను యాచించొద్దు.. కల్పించాలి: ఐఐటీల్లో చదివి బయటకు వచ్చిన విద్యార్థులు ఉద్యోగాల కోసం యాచించవద్దని, వారే పది మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని బండారు దత్తాత్రేయ సూచించారు. 2030 నాటికి భారతదేశంలో 65 శాతం యువత ఉంటోందని తెలిపారు. ఇది ప్ర పంచ దేశాలన్నింటిలోకి మన దేశం చేసుకున్న అదృష్టమన్నా రు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల ఉద్యోగాల కల్పన ఉంటే.. వీటిలో 1.5 కోట్ల ఉద్యోగాలు భారత్‌లోనే లభిస్తాయని చెప్పారు. తాను మొదటగా సామాజిక సేవా కార్యకర్తనని.. ఆ తర్వాతే రాజకీయ నాయకుడినని చెప్పారు. పలువురు విద్యార్థులు సీఏఏ, ఎన్‌పీఆర్, రాజకీయాలపై ప్రశ్నలు అడగగా.. తాను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నందు వల్ల అవి మాట్లాడటం తగదని తిరస్కరించారు. సమావేశంలో ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు