తెలంగాణలో కొనసాగుతున్న బంద్

12 Jul, 2014 09:22 IST|Sakshi

హైదరాబాద్: పోలవరం బిల్లు ఆమోదానికి నిరసనగా తెలంగాణ జేఏసీ ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. పోలవరం ఆర్డినెన్స్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించడాన్ని నిరసిస్తూ జేఏసీ రాష్ట్రవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దాంతో తెలంగాణ జిల్లాల్లో  ఆందోళనలు, నిరసనలు హోరెత్తుతున్నాయి. బంద్ కారణంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్‌లో బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. అలాగే రంగారెడ్డి జిల్లాలో బంద్ ప్రభావం కనిపించటం లేదు.  బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి.


ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బంద్

కాగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. సీపీఐ, సీపీఎం, సీపీఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. వర్తక, వాణిజ్య, విద్యా, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. జిల్లాలోని ఆరు డిపోల్లో 625 బస్సులు నిలిచిపోయాయి. డిపోల ఎదుట నిరసన తెలుపుతూ బస్సులను అడ్డుకుంటున్న పలువురు వామపక్ష కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మహబూబ్‌నగర్

బంద్ సందర్భంగా జిల్లాలో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. 9 డిపోల్లో 850 బస్సులను నిలిపివేశారు. డిపోల ఎదుట టీఆర్‌ఎస్, వామపక్షాల నిరసన తెలుపుతున్నాయి

నిజామాబాద్

నిజామాబాద్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. బంద్ కారణంగా మొత్తం 650 బస్సులు నిలిచిపోయాయి. బస్టాండ్ వద్ద ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆకుల లలిత పాల్గొని బంద్ కు మద్దతు తెలిపారు.

నల్గొండ

జిల్లాలో బంద్ కొనసాగుతోంది. జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, నల్గొండ, నార్కెట్‌పల్లి, యాదగిరిగుట్ట, దేవరకొండ డిపోల ముందు శనివారం తెల్లవారుజాము నుంచే వివిధ పార్టీల శ్రేణులు, సంఘాలు బైటాయించి నిరసన తెలుపుతున్నారు.

కరీంనగర్

 పోలవరం బిల్లుకు నిరసనగా కరీంనగర్ జిల్లాలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. కరీంనగర్ బస్టాండ్ ఎదుట టీఆర్ఎస్, వామపక్ష పార్టీల కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు.

వరంగల్

వరంగల్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. అన్నివర్గాల ప్రజలు బంద్లో  స్వచ్ఛందంగా పాల్గొన్నారు. జనగామ బస్సు డిపో ఎదుట వామపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచాలని వారు నినాదాలు చేశారు.

In English Polavaram Bill: Telangana bandh underway

>
మరిన్ని వార్తలు